మావాళ్ళ మరణాల గురించి రాయడానికి నేను ప్రయత్నించిన ప్రతిసారీ, శరీరం నుండి శ్వాస వదిలి వెళ్ళిపోయినట్లుగా నా మనసంతా ఒక్కసారిగా ఖాళీ అవుతుంది.
మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, మన సమాజం మాత్రం తమ శరీరాన్ని ఉపయోగించి పనిచేసే పారిశుద్ధ్య శ్రామికుల జీవితాలను అసలు పట్టించుకోదు. వీరి మరణాలు సంభవిస్తున్నాయని కూడా ప్రభుత్వం ఒప్పుకోదు. అయితే, ఈ ఏడాది లోక్‌సభ సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానంగా, 2019-2023 మధ్య “మురుగు కాలువలను, సెప్టిక్ ట్యాంకులను శుభ్రంచేసే ప్రమాదకరమైన పని వల్ల” 377 కంటే ఎక్కువమంది పారిశుద్ధ్య శ్రామికులు మరణించినట్లు సామాజిక న్యాయం, సాధికారత శాఖా మంత్రి రామ్‌దాస్ ఆఠవలే తెలియజేశారు.
గత ఏడేళ్ళలో నేను మ్యాన్‌హోల్‌లో పనిచేస్తూ మరణించిన లెక్కలేనంతమంది పారిశుద్ధ్య శ్రామికుల అంత్యక్రియలకు హాజరయ్యాను. 2022 నుండి, ఒక్క చెన్నై జిల్లాలోని ఆవడిలోనే ఇటువంటి 12 మరణాలు సంభవించాయి.
ఆగస్టు 11న, ఆవడిలో నివాసముండే అరుంధతియర్ సముదాయానికి చెందిన 25 ఏళ్ళ హరి అనే కాంట్రాక్ట్ కార్మికుడు, మురుగుకాల్వను శుభ్రం చేస్తూ, ఆ మురుగునీటిలో మునిగి చనిపోయారు.
పన్నెండు రోజుల తరువాత, హరి అన్న మరణవార్తను రిపోర్టు చేయడానికి నేను వెళ్ళాను. అతని మృతదేహాన్ని ఆయన ఇంటిలోనే ఒక ఫ్రీజర్ బాక్స్‌లో పెట్టివుండటం కనిపించింది. అతని భార్య తమిళ్ సెల్విని, ఒక భర్తను కోల్పోయిన మహిళ చేయాల్సిన అంతిమ ఆచారాలన్నిటినీ నిర్వహించమని ఆమె కుటుంబం అడిగింది. ఆమె పొరుగింటివారి బంధువులు ఆమె తాళిని తెంచడానికి ముందు, ఆమెకు పసుపు రాసి స్నానం చేయించారు. ఈ ఆచారాలు జరుగుతున్నంత సేపూ ఆవిడ గంభీరంగా, మౌనంగా ఉండిపోయారు.




















