సంతోషి కోరీ, సొంత యాజమాన్యం కలిగివుండటం కలిగించే వింత అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. “ఒక రైతుల సహకార సంఘాన్ని స్థాపించాలని మా మహిళలమే నిర్ణయించుకున్నాం. మా గ్రామంలోని మగవాళ్ళందరూ అది మంచి ఆలోచన అని ఇప్పుడు అంగీకరిస్తున్నారు,” ఆమె నవ్వుతూ అన్నారు.
భైరాహా పంచాయతీలోని గుచారా కుగ్రామానికి చెందిన ఆమె ఒక దళిత రైతు. రూంజ్ మహిళా రైతు ఉత్పత్తిదారుల కోఆపరేటివ్ లిమిటెడ్ (MFPO) లో సభ్యత్వం కోసం ఆవిడ రూ.1,000 రుసుము చెల్లించారు. జనవరి 2024లో పన్నా జిల్లాలో సభ్యత్వం తీసుకున్న 300 మంది ఆదివాసీ, దళిత, ఒబిసి (ఇతర వెనుకబడిన తరగతి) మహిళలలో ఈవిడ కూడా ఒకరు. అంతేకాకుండా, రూంజ్‌లోని ఐదుగురు బోర్డు సభ్యులలో సంతోషి కూడా ఒకరు. ప్రతి సమావేశంలో మాట్లాడటానికి, ప్రచారం చేయడానికి ఆమెను పిలుస్తుంటారు.
“ఇంతకుముందు, బిఛోలియా (వ్యాపారి) వచ్చి, పప్పుగా మార్చని మా అరహర్ దాల్ (కందులు)ను తక్కువ ధర ఇచ్చి కొనేవాడు. అదీగాక, అతనెప్పుడూ సమయానికి వచ్చేవాడు కాదు, పైగా మాకెప్పుడూ సకాలంలో డబ్బు ఇవ్వలేదు కూడా,” ఆమె PARIతో అన్నారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఈ 45 ఏళ్ళ మహిళ, తన కుటుంబానికి చెందిన రెండెకరాల వర్షాధార భూమిలో అరహర్ దాల్ పండిస్తున్నారు. మరో ఎకరం భూమిని కూడా కౌలుకు తీసుకున్నారు. మనదేశంలో 11 శాతం మంది మహిళలకు మాత్రమే సొంత భూమి ఉంది. మధ్యప్రదేశ్ ఇందుకు మినహాయింపేమీ కాదు.
రూంజ్ ఎమ్ఎఫ్పిఒను యమునా నదిలో కలిసే బాఘైన్‌కు ఉపనది అయిన రూంజ్ నది పేరు మీద స్థాపించారు. ఇది అజయ్‌గఢ్, పన్నా బ్లాకులలోని 28 గ్రామాలకు చెందిన మహిళా రైతుల సమష్టి. 2024లో ప్రారంభమైన ఇది ఇప్పటికే రూ. 40 లక్షలు టర్నోవర్‌ను సాధించింది. రాబోయే ఏడాదిలో దీనికి రెట్టింపు టర్నోవర్ సాధించాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది










