"నక్షత్రాలకు మా రబారీలు పెట్టుకున్న పేర్లు మీరు పిలిచే పేర్లకు భిన్నంగా ఉంటాయి," అన్నారు మశ్రూభాయి." తుమ్హారా ధ్రువ్ తారా, హమారా పరోదియా (మీ ధృవతార మా పరోదియా)".
మేం వర్ధా జిల్లా, దెనోడా గ్రామంలోని అతని డేరా- తాత్కాలిక నివాసం వద్ద వున్నాం. అది నాగపూర్ నుంచి 60 కిలోమీటర్లూ, అతని స్వస్థలమైన కచ్‌కు 1300 కిలోమీటర్ల దూరంలో వుంది.
ఆ రబారీ డేరా మీదికి సాయం సంజె వెలుగులు ప్రసరించడం ప్రారంభయింది. అది మార్చి నెల మొదలు, శీతాకాలం నుంచి వేసవికి మారే సమయం. సాయంత్రపు నారింజ వెలుగులు కాస్త ఎక్కువసేపు వుండే కాలం. అటవీ జ్వాలలా పూసే పలాశ్ లేదా కెసుడా (బ్యూటియా మోనోస్పెర్మా - మోదుగు పూలు) పూల కుంకుమ రంగు నేలనంతా అలంకరిస్తోంది. రంగుల పండగ హోలీ దగ్గర్లోనే వుంది.
జనం అభిమానంగా మశ్రూ మామా అని పిలుచుకునే ఆయనా నేనూ విదర్భలో ఆ సాయంకాలపు నిర్మలాకాశాన్ని చూస్తున్నాం. పత్తి చేల మధ్యలో వేసివున్న అతని మంచం మీద కూర్చుని, భూమండలంలోని అన్ని విషయాల గురించీ మాట్లాడుకుంటున్నాం: నక్షత్రాలు, నక్షత్ర రాశులు, మారుతున్న వాతావరణం, పర్యావరణం, అతని ప్రజల, పశువుల, అనేక భావాలు, సంచారజీవుల మోటైన, కఠినమైన జీవితం, అతనికి తెలిసిన జానపద కథలూ గాథలూ, ఇంకా అనేకం.
రబారీల జీవితాలలో నక్షత్రాలకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. రాత్రివేళల్లో వారికి నక్షత్రాలే మార్గదర్శనం చేస్తాయి. "సప్తర్షి మండలం అని మీరు పిలుచునే ఏడు నక్షత్రాల రాశి మాకు హరణ్ (జింక)," అని ఆయన వివరిస్తారు. "ఆ ఏడు నక్షత్రాలు తెల్లవారుఝామున వెలిసిపోతాయి. అయితే ఇంకా చీకటి వుండగానే అవి రాబోయే కొత్త ఉదయాన్ని, అది తెచ్చే కొత్త సవాళ్ళను, ఎన్నో సంభావ్యతలను గురించి చెప్తాయి," అన్నారు మశ్రూభాయి వేదాంత ధోరణిలో.











