సునీత భుర్‌కుటే మాతృభాష కోలామీ, కానీ ఈ పత్తి రైతు రోజు మొత్తంలో ఎక్కువగా మరాఠీ భాషనే మాట్లాడతారు. "మా పత్తిని అమ్ముకోవాలంటే మాకు మార్కెట్ భాష తెలిసివుండాలి," అంటారామె.
మహారాష్ట్రలోని యవత్మళ్ జిల్లాలో పెరిగిన ఆమె కుటుంబం ఇంట్లో మాత్రం తమ కోలామీ భాషలోనే మాట్లాడుకుంటారు. సుర్ దేవి పోడ్ (గూడెం)లోని తమ మాహెర్ (పుట్టిల్లు)లో తన తాత నాయనమ్మలు స్థానిక భాష మరాఠీని మాట్లాడేందుకు ఎంతగా కష్టపడేవారో సునీత గుర్తుచేసుకున్నారు. "వాళ్ళెప్పుడూ బడికి వెళ్ళినవారు కాదు, చిన్న చిన్న మరాఠీ వాక్యాలను వాళ్ళు నట్లు కొడుతూ మాట్లాడేవారు," అన్నారామె.
అయితే కుటుంబం నుంచి మరింతమంది పత్తిని అమ్మడానికి స్థానిక మార్కెట్‌కు వెళ్తుండటంతో వారికి భాష పట్టుబడింది. ఈ రోజున, అందరూ కోలామ్ అదివాసులే నివాసముండే భుల్‌గడ్ గ్రామంలోని ఆమె పోడ్‌లో బహుభాషలను మాట్లాడతారు: వాళ్ళు మరాఠీ, హిందీలో కొన్ని వాక్యాలు, మాతృభాష కోలామీ భాషలను మాట్లాడతారు.
ద్రావిడ భాష అయిన కోలామీని ఎక్కువగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఛత్తీస్‌గఢ్‌లలో మాట్లాడతారు. యునెస్కోవారి ఆట్లస్ ఆఫ్ ది వరల్డ్స్ లాంగ్వేజెస్ ఇన్ డేంజర్ ప్రకారం, ఇది 'ఖచ్చితంగా అంతరించిపోయే ప్రమాదంలో' ఉన్న భాషగా వర్గీకరించివుంది – అంటే, దీనిని పిల్లలు తమ మాతృభాషగా నేర్చుకోవడం లేదని ఈ వర్గీకరణ సూచిస్తోంది.
“పన్ ఆమ్‌చీ భాషా కమీ హోత్ నాహీ. ఆమ్‌హీ వాపర్‌తాత్ [మా భాష చచ్చిపోవటంలేదు, మేం దాన్ని ఉపయోగిస్తున్నాం]!" అంటారు 40 ఏళ్ళ సునీత














