సాంస్కృతిక జ్ఞానాన్ని, సామాజిక కట్టుబాట్లని ఎల్లప్పుడూ తన భుజాలపై మోస్తూ వస్తున్న శక్తి, జానపద గీతం. అదే జానపదం సాంస్కృతిక మార్పు కోసం, అవగాహనను కల్పించడానికి కూడ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ కళా ప్రక్రియకు గల ఈ ఒదుగుబాటు - జానపద సంగీతానికున్న మౌఖికత (నోటిమాటల్లో వెల్లడిచేయగల శక్తి), ప్రతీ ప్రదర్శనకూ అనుగుణంగా మారగలిగే దాని సమర్థత, ఆ సముదాయపు సంస్కృతితో నాటుకుపోయిన అనుబంధం - వీటి నుండి వచ్చింది.
జానపద సంగీతానికి గల ఈ పునరుజ్జీవింపజేసే శక్తిని ఈ పాట ఇక్కడ ఉపయోగించుకుంటోంది, అవగాహన సందేశాన్ని తెలియజేస్తోంది. ఈ సందర్భంలో, గ్రామీణ మహిళల జీవితాలను చుట్టుముట్టే లింగ ఆధారిత వాస్తవికతను తెలియచేస్తోంది. కచ్ఛ్ ప్రాంతానికి చెందిన మహిళా కళాకారులు పాడిన ఈ పాట సామాజిక విమర్శను భావోద్వేగ నివేదనగా ప్రతిపాదిస్తోంది.
ఈ పాటలోని ప్రత్యేక ఆకర్షణ, నేపథ్యంలో వినపడుతోన్న జోడియా పావా లేదా అల్ఘోజా అనే వాయిద్యం. ఇది సంప్రదాయంగా, పాకిస్తాన్ లోని సింధ్, భారతదేశంలోని కచ్ఛ్, రాజస్థాన్, పంజాబ్ వంటి వాయవ్య ప్రాంతాలకు చెందిన కళాకారులు వాయించే జంట వేణువుల వాయు వాయిద్యం



