"మొదటి రోజు, మజీదాఁ నా చేతి మీద ఇలా చరిచింది," అని 65 ఏళ్ళ కర్సైద్ బేగమ్ సరదాగా ఆ క్షణాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె ప్రక్కనే కూర్చునివున్న మజీదాఁ బేగమ్ ఆ పాత కథను తల్చుకుని ఉల్లాసపడిపోతూ, వెంటనే తన చర్యలను సమర్థించుకున్నారు. “కర్సైద్‌కు మొదట్లో దారాలతో ఎలా నేయాలో తెలిసేది కాదు. నేను ఆమెను ఒక్కసారి మాత్రమే ఇలా చరిచాను,” ఆమె చెప్పారు. “అప్పుడే తను త్వరగా నేర్చుకుంది.”
పంజాబ్‌లోని బఠిండా జిల్లా, ఘందా బానా అనే గ్రామంలో మజీదాఁ, కర్సైద్ అనే ఆ ఇద్దరు పెద్దవయసు మహిళలు పత్తి, జనపనార, పాత బట్టలతో సుందరమైన, సంక్లిష్టమైన నమూనాలతో ఉండే దరీల [రగ్గులు] నేతకు ప్రసిద్ధి చెందారు.
"నేను 35 సంవత్సరాల వయస్సులో మజీదాఁ నుంచి దరీలు నేయడం నేర్చుకున్నాను," అని కర్సైద్ చెప్పారు. "అప్పటి నుంచి మేమిద్దరం కలిసి దరీలు నేస్తున్నాం," అని 71 ఏళ్ళ మజీదాఁ చెప్పారు. "ఇది ఒకరితో అయ్యే పని కాదు, ఇద్దరూ చేయవలసిన పని."
వాళ్ళిద్దరూ, ఇద్దరు సోదరులను వివాహం చేసుకోవడం వల్ల ఏర్పడిన బంధుత్వంతో తమను తాము అక్కాచెల్లెళ్ళుగా, కుటుంబ సభ్యులుగా భావిస్తారు. " మేం నిజమైన అక్కాచెల్లెళ్ళకంటే భిన్నమేమీ కాదు," అని కర్సైద్ చెప్పారు. దానికి మజీదాఁ, "మా స్వభావాలు పూర్తిగా వ్యతిరేకం అయినా," అని నవ్వుతూ జత చేశారు. దానికి కర్సైద్ వేగంగా స్పందిస్తూ, "ఆమె అన్నీ గట్టిగా మాట్లాడేస్తుంది. నేను కొంచెం నెమ్మదిగా ఉంటాను," అన్నారు.
దరీలు నేయడంలో అనేక గంటల పాటు గడిపినా, మజీదాఁ, కర్సైద్‌లు ఆ పనితో పాటు తమ కుటుంబాలకు సహాయపడడానికి కొద్ది వేల రూపాయల జీతం కోసం కొన్ని ఇళ్ళల్లో పని చేస్తారు. అయితే ఈ రెండు పనులూ, మరీ ముఖ్యంగా ఆ వయసులో ఉన్న మహిళలకు, శారీరకంగా చాలా శ్రమతో కూడిన పనులే.


















