పొలం గట్టుపై నిల్చుని, కుండపోత వర్షం తర్వాత మోకాళ్ల లోతు నీళ్లలో మునిగివున్న తన వెండితెలుపు పంటను చూస్తూ ఉన్నాడతను. విదర్భలోని విజయ్ మరోత్తర్ పొలంలోని పత్తి పంట ధ్వంసమైంది. “నేను దాదాపు రూ.1.25 లక్షలు ఈ పంటపై పెట్టుబడి పెట్టాను. నా పంట దాదాపు పూర్తిగా నాశనమైంది.” అని ఆ 25 ఏళ్ల యువకుడు చెప్పాడు. అది సెప్టెంబర్ 2022, విజయ్‌కిది మొదటి పంట కాలం. ఈసారి, తన సమస్యలను పంచుకోవడానికి అతనికి ఎవరూ లేరు.
అతని తండ్రి, ఘనశ్యామ్ మరోత్తర్ ఐదు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించారు, అతని తల్లి రెండేళ్ల క్రితం గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోయింది. విదర్భ ప్రాంతంలోని అనేకమంది రైతుల మాదిరిగానే, అస్థిర వాతావరణం వల్ల జరిగిన పంటనష్టం, పెరుగుతున్న అప్పులు అతని తల్లిదండ్రులను తీవ్రమైన ఆందోళన, ఒత్తిడిలోకి నెట్టాయి. వారికి అందిన సాయం కూడా చాలా తక్కువ.
కానీ తన తండ్రిలా కుప్పకూలిపోవటం వల్ల ఏ ఉపయోగం లేదని విజయ్‌కి తెలుసు. అందుకే రెండు నెలల పాటు తన పొలంలో ఉన్న నీటిని ఎత్తిపోసే పనిలో నిమగ్నమయ్యాడు. ప్రతిరోజూ రెండు గంటలపాటు, చేతిలో బకెట్ తప్ప మరేమీ లేకుండా, ట్రాక్ ప్యాంటును మోకాళ్ల వరకు మడుచుకొని, బురదగా ఉన్న తన పొలంలో చెప్పులు లేకుండా పనిచేశాడు. అతని టీ-షర్టు చెమటతో తడిసిపోయింది, ఒళ్లు హూనమైంది. మొత్తం నీటిని అతను తన చేతులతోనే తోడాడు. “నా వ్యవసాయ భూమి ఒక వాలులో ఉంది. అందుకే, అధిక వర్షాల వల్ల నాకు ఎక్కువగా నష్టం జరిగింది. చుట్టుపక్కల పొలాలలోని నీరంతా నా పొలంలోకే వస్తుంది. దీన్ని నివారించడం కష్టం." అన్నాడు విజయ్. ఈ అనుభవం అతన్ని భయపెట్టింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అధిక వర్షపాతం, సుదీర్ఘంగా కొనసాగిన పొడి వాతావరణం, వడగళ్ల వానలూ వంటివి అపారమైన వ్యవసాయ సంక్షోభానికి కారణమై, రైతుల మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీశాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన సాయం చాలా తక్కువ.(చదవండి: విదర్భ: మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న వ్యవసాయ సంక్షోభం). మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్, 2017 ప్రకారం మానసిక ఒత్తిడి, రుగ్మత ఉన్న వ్యక్తుల కోసం అందుబాటులో ఉన్న సేవలు, వాటిని పొందే విధానం గురించి విజయ్‌కి గానీ, అతని తండ్రి ఘనశ్యామ్కు బ్రతికి ఉన్నప్పుడు గానీ తెలీదు, అందలేదు కూడా. అలాగే 1996 జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం కింద నిర్వహించిన ఔట్రీచ్ క్యాంపుల గురించి కూడా వారికి తెలియదు.
నవంబర్ 2014లో, మానసిక సమ్యలు, అందుతున్న చికిత్సకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం 'ప్రేరణా ప్రకల్ప్ ఫార్మర్ కౌన్సెలింగ్ హెల్త్ సర్వీస్ ప్రోగ్రామ్'తో ముందుకు వచ్చింది. జిల్లా కలెక్టరేట్ ద్వారా యవత్మాల్కు చెందిన స్వచ్ఛంద సంస్థ - ఇందిరాబాయి సీతారామ్ దేశ్‌ముఖ్ బహుద్దేశీయ సంస్థతో కలిసి అందరికి అందుబాటులోకి మానసిక చికిత్సను తేవడం ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రభుత్వ-ప్రైవేట్ (పౌర సమాజం) భాగస్వామ్య పద్దతిలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం పనిచేస్తుంది. కానీ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకున్న ఈ ప్రేరణ ప్రాజెక్ట్, 2022లో విజయ్ తన తండ్రిని కోల్పోయే సమయానికి పూర్తిగా విఫలమైంది.









