పద్దెనిమిదేళ్ళ సుమిత్ (అసలు పేరు కాదు) ఛాతీ పునర్నిర్మాణ శస్త్రచికిత్స గురించి వివరాలు తెలుసుకునేందుకు హరియాణాలోని రోహతక్‌లో ఉన్న జిల్లా వైద్యశాలకు మొదటిసారి వెళ్ళినప్పుడు, అతన్ని కాలిన గాయాలున్న పేషంట్‌గా చేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
ఒక అబద్ధం. భారతదేశంలోని ట్రాన్స్‌జెండర్ సముదాయానికి చెందినవారు తాము పుట్టిన శరీరం నుండి, తమకు సౌకర్యంగా ఉండే శరీరంలోకి మారాలని అనుకుంటే, సంక్లిష్టమైన వైద్య-చట్టపరమైన ప్రయాణాన్ని ఆవరించి ఉన్న సాచివేత ధోరణిని ఛేదించటానికి ఈ అబద్ధాన్ని చెప్పవలసి ఉంటుంది. అయినప్పటికీ, ఆ అబద్ధం కూడా ఇక్కడ పని చేయలేదు.
వాడుకగా 'టాప్ సర్జరీ' అని పిలిచే ఈ శస్త్రచికిత్స చేయాలంటే సుమిత్‌కు రాతపని, అంతులేని మానసిక నిర్ధారణలు, వైద్య సంప్రదింపులు, అప్పులతో సహా లక్ష రూపాయలకు పైగా ఖర్చు, దెబ్బతిన్న కుటుంబ సంబంధాలు, పూర్వం ఉన్న రొమ్ముల పట్ల అతనిలో ఉన్న మార్పులేని అయిష్టత - ఇలా మరో ఎనిమిదేళ్ళ కాలం అవసరమయింది. ఎట్టకేలకు రోహ్తక్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిస్సార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ చికిత్స జరిగింది.
ఇది జరిగిన ఏడాదిన్నర తర్వాత కూడా 26 ఏళ్ళ సుమిత్ నడిచేటప్పుడు తన భుజాలను వంచుతూనే ఉన్నాడు. శస్త్రచికిత్సకు ముందు సంవత్సరాలలో - అతని రొమ్ములు అవమానానికీ అసౌకర్యానికీ మూలంగా ఉన్నప్పుడు - అలా వంగి నడవటం అతనికి అలవాటుగా ఉండేది.
భారతదేశంలో సుమిత్ వంటి ఎంత మంది వ్యక్తులు తాము పుట్టినప్పటి జెండర్ కంటే భిన్నమైన జెండర్‌తో గుర్తించబడ్డారనే దాని గురించి ఇటీవలి లెక్కలు లేవు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సహకారంతో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, 2017లో భారతదేశంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంఖ్య 4.88 లక్షలుగా ఉంది.
2014 నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, ‘మూడవ జెండర్’ను, ‘తమను తాము గుర్తించుకున్న’ జెండర్‌తో తమ గుర్తింపును కోరే వారి హక్కును గుర్తిస్తూ, వారి ఆరోగ్య సంరక్షణకు హామీ ఇవ్వాలని ప్రభుత్వాలను నిర్దేశిస్తూ సుప్రీమ్ కోర్ట్ ఒక మైలురాయి తీర్పును జారీ చేసింది. ఐదు సంవత్సరాల తరువాత, జెండర్ స్థిరీకరణ శస్త్రచికిత్సలు, హార్మోన్ థెరపీ, మానసిక ఆరోగ్య సేవలు వంటి సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలను ఈ సమాజానికి అందించడంలో ప్రభుత్వాల పాత్రను గురించి ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం, 2019 మళ్ళీ నొక్కి చెప్పింది.









