"నా దగ్గర ఎప్పుడూ డబ్బులుండవు," కుటుంబ బడ్జెట్‌ను రూపొందించుకోవటంలో తన కష్టాల గురించి చెప్పారు బబిత మిత్రా. "నేను తిండి కోసమని డబ్బుల్ని పక్కన పెడితే, అది మందులకు ఖర్చయిపోతుంది. నా కొడుకుల ట్యూషన్ కోసమని ఉంచిన డబ్బు రేషన్ కొనడానికి అవుతుంది. ఇక ప్రతి నెలా నేను పనిచేసే ఇంటివాళ్ళ దగ్గర అప్పు చేయాల్సివస్తోంది...”
కొల్‌కతాలోని కాళికాపూర్ ప్రాంతంలో రెండు ఇళ్ళలో పనిచేసే 37 ఏళ్ళ బబిత మొత్తం ఆదాయం ఏడాదికి సుమారు ఒక లక్ష రూపాయలు కూడా ఉండదు. పశ్చిమ బెంగాల్, నదియా జిల్లాలోని ఆసాన్నగర్ నుంచి కొల్‌కతాకు వచ్చేనాటికి ఆమెకు పదేళ్ళు కూడా నిండలేదు. "ముగ్గురు పిల్లలను పెంచగలిగే స్తోమత నా తల్లిదండ్రులకు లేదు. అందుకని, మా ఊరి నుంచి వెళ్ళి కొల్కతాలో స్థిరపడిన ఒకరి ఇంట్లో పని చేయటానికి నన్ను కొల్కతా పంపించారు."
అప్పటి నుంచి బబిత అనేక ఇళ్ళల్లో ఇంటిపనులు చేస్తూనేవున్నారు. ఆమె కొల్కతాలో ఉంటున్నప్పటి నుంచి దేశంలో ఆమోదం పొందిన 27 కేంద్ర బడ్జెట్లు బబితకు గానీ, ఆమె వంటి 42 లక్షల మంది గృహ కార్మికుల (అధికారిక అంచనాలు) పరిస్థితుల్లో గానీ పెద్దగా మార్పేమీ తీసుకురాలేదు. స్వతంత్ర అంచనాల ప్రకారం ఈ శ్రామికుల సంఖ్య 5 కోట్లకు పైగానే ఉంది.
బబిత 2017లో దక్షిణ 24 పరగణాల జిల్లా, ఉచ్ఛేపోతా పంచాయతీ పరిధిలోని భగవాన్‌పూర్ ప్రాంతంలో నివాసముండే నలబైఏళ్ళు దాటిన అమల్ మిత్రాను పెళ్ళి చేసుకున్నారు. అయితే, ఇంటిని నడపటంలో ఒక ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసే ఆమె భర్త సహకారం చాలా తక్కువ కావటంతో పెళ్ళి తర్వాత బబిత బాధ్యతలు రెట్టింపయ్యాయి. బబిత, అమల్‌తో పాటు 5, 6 సంవత్సరాల వయసున్న వారి ఇద్దరు కుమారులు, ఆమె అత్తగారు, 20 ఏళ్ళు దాటిన ఒక సవతి కూతురు - ఇలా ఆరుగురున్న ఆ కుటుంబాన్ని ఆమె ఎక్కువగా తన సంపాదనతోనే నిలబెట్టారు.
4వ తరగతిలోనే బడి మానేసిన బబితకు దేశంలో గత రెండు దశాబ్దాలుగా అమలవుతోన్న 'జెండర్ బడ్జెటింగ్' గురించి తెలియదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 2025-26 బడ్జెట్లో ప్రకటించిన మహిళల నేతృత్వంలోని దేశాభివృద్ధి గురించి కూడా తెలియదు. కానీ బబిత విజ్ఞత అంతా ఆమె ప్రతిస్పందనలో ప్రకాశిస్తుంది: "కష్ట సమయాల్లో ఎక్కడా కానరాని పక్షంలో, మహిళల కోసం చాలా చేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకునే ఈ బడ్జెట్ వల్ల ప్రయోజనం ఏమిటి?" కోవిడ్-19 మహామారి నాటి భాధాకరమైన జ్ఞాపకాలు ఇప్పటికీ ఆమె మనసులో మండుతూనే ఉన్నాయి.






