"ఆవో ఆవో సునో అప్నా భవిష్యవాణి, సునో అప్నీ ఆగే కీ కహానీ..." జుహూ బీచ్‌లో ఆ సాయంత్రపు గందరగోళం మధ్య అతని గొంతు ఒక మార్మిక శ్లోకంలా ప్రతిధ్వనిస్తోంది. ముంబై శివారు ప్రాంతంలో సూర్యాస్తమయ నేపథ్యంలో సందడిగా ఉన్న ఈ బీచ్‌లో సుమారు 27 ఏళ్ల వయసున్న ఉదయ్ కుమార్, కొన్ని భవిష్యవచనాలను వినమని ప్రజలను ఆహ్వానిస్తున్నాడు.
అతను స్వయానా జ్యోతిష్కుడు కాదు, హస్తసాముద్రికుడు కాదు, రామ చిలుకతో కార్డులు తీయించి జోస్యం చెప్పేవాడు కూడా కాదు. అతనిక్కడ నాలుగు అడుగుల ఎత్తున్న మడతబల్ల మీద ఉన్న ఒక నిగూఢమైన నల్ల పెట్టెపై కూర్చొని ఉన్న రోబోతో నిలబడి ఉన్నాడు. చిన్నగా, సుమారు అడుగు పొడవున్న ఆ రోబోకు అలంకరణ లైట్లు చుట్టివున్నాయి. "దీన్ని జ్యోతిష్ కంప్యూటర్ లైవ్ స్టోరీ" అంటారని ఆ రోబోను ఈ రిపోర్టర్‌కు పరిచయం చేశాడు ఉదయ్.
ఆ పరికరం (గిజ్మో) ఒక వ్యక్తిలో చెలరేగే ప్రకంపనలను విశ్లేషించగలదని, యంత్రానికి సంధించి ఉన్న హెడ్‌ఫోన్‌లను తన వద్దకు వచ్చిన ఆసక్తిగల కస్టమర్‌కు అందజేస్తూ అతను వివరించాడు. కొద్దిసేపు విరామం తర్వాత, హిందీలో మాట్లాడే ఒక స్త్రీ స్వరం భవిష్యత్తులోని రహస్యాలను విప్పుతుంది. ఇదంతా కూడా 30 రూపాయలకే.
కొన్ని దశాబ్దాల క్రితం బిహార్‌లోని గెంధా అనే కుగ్రామం నుండి ముంబైకి వచ్చిన తన చిన్నాన్న రామ్ చందర్ నుండి వారసత్వంగా పొందిన ఈ సాంకేతిక అద్భుతానికి ఉదయ్ ఏకైక సంరక్షకుడు. రామ్ చందర్‌ను నగరంలో రాజు అని పిలిచేవారు. అతని చిన్నాన్న గ్రామంలోని ఇంటికి తిరిగివచ్చిన ప్రతిసారీ తనతో పాటు నగరానికి చెందిన కథలను తీసుకువచ్చేవారు. “తన వద్ద భవిష్యత్తును చెప్పగల అజూబా [ఒక వింత వస్తువు] ఉందని, ఆ విధంగానే తాను డబ్బు సంపాదిస్తున్నాడని చాచా [చిన్నాన్న] మాకు చెప్పేవాడు. ఇదేదో హాస్యానికి చెప్తున్నాడని చాలామంది నవ్వేవారు. నేను మాత్రం అబ్బురపడ్డాను!” గుర్తుచేసుకున్నాడు ఉదయ్. 11 ఏళ్ళ తన అన్న కొడుక్కు రాజు నగర జీవితంలోని అద్భుతాలతో పాటు యంత్రం గురించి కూడా పరిచయం చేశారు.















