తేజిలీబాయి ధేడియా నెమ్మదిగా తన దేశీ విత్తనాలను తిరిగి తెచ్చుకుంటున్నారు.
సుమారు 15 ఏళ్ళ క్రితం మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పుర్, దేవాస్ జిల్లాల్లో వ్యవసాయం చేసే తేజిలీబాయి వంటి భిల్ ఆదివాసులు సేంద్రియ పద్ధతులలో పండించే దేశీ విత్తనాలకు బదులుగా రసాయనిక ఎరువులతో పండించే హైబ్రిడ్ విత్తనాలకు మారారు. ఇది అనువంశిక విత్తనాలను నష్టపోవడానికి దారితీసిందని చెప్తోన్న తేజిలీబాయి, అసలలా మారిపోవడానికి కారణాలను వివరించారు, "మా సంప్రదాయ వ్యవసాయానికి చాలా శ్రమ అవసరం, మా ఫలసాయానికి మార్కెట్‌లో లభించే ధరలు మాకు గిట్టుబాటు కావు. ఈ విధంగా ఆదా చేసిన సమయం, వలస కార్మికులుగా గుజరాత్‌కు వెళ్ళి, అధిక రేట్లకు కూలీ పని చేసుకోవడానికి మాకు వీలు కల్పించింది," అన్నారు 71 ఏళ్ళ ఆ వృద్ధురాలు.
కానీ ఇప్పుడు ఈ జిల్లాల్లోని 20 గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది మహిళలు తమ అనువంశిక విత్తనాలను సంరక్షిస్తున్నారు; కన్సరీ నూ వడావ్‌నో (KnV) మార్గదర్శకత్వంలో సేంద్రియ వ్యవసాయానికి తిరిగి వస్తున్నారు. స్థానికంగా భిలాలీ అని పిలిచే భిల్ భాషలో కన్సరీ నూ వడావ్‌నో అంటే 'కన్సరీ దేవిని సత్కరించటం' అని అర్థం. భిల్ ఆదివాసీ మహిళల ప్రజా సంఘమైన KnV మహిళల హక్కుల కోసం పోరాడటానికి, వారి ఆరోగ్య సమస్యల గురించి పనిచేయడానికి 1997లో స్థాపించబడింది. ఆరోగ్య సమస్యలపై ఒక దశాబ్దానికి పైగా పనిచేసిన తర్వాత, KnV నిర్మాణంలో భాగస్వాములైన ఆదివాసీ మహిళలు, తమ సంప్రదాయ పంటలకు తిరిగి రావడం తమ ఆహార సంబంధమైన సమస్యలను ఎదుర్కోవటానికి సహాయపడుతుందని గ్రహించారు.
KnV వద్ద, దేశవ్యాప్తంగా జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయాన్ని వ్యాప్తి చేయడం కోసం విక్రయించడానికి, ఇతర రైతులకు పంపిణీ చేయడం కోసం ఎంపిక చేసిన విత్తనాలను విడివిడిగా నిల్వ చేస్తారనీ, మిగిలిన పంటను తిండికోసం ఉంచుతారనీ కావడా గ్రామానికి చెందిన రింకూ అలావా చెప్పారు. "పంట కోతల తర్వాత, మేం వాటిలోని నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి," అని 39 ఏళ్ళ రింకూ చెప్పారు.
రైతు, KnV సభ్యురాలయిన కక్రానా గ్రామానికి చెందిన రైతీబాయి సోలంకి దీనికి అంగీకరించారు: “విత్తనాల నాణ్యతను మెరుగుపరచడానికి, వాటి ఉత్పత్తిని పెంచడానికి విత్తనాల ఎంపిక ఉత్తమమైన మార్గం.”
రైతీబాయి (40) ఇంకా ఇలా అంటారు: "చిరుధాన్యాలు, జొన్నల వంటి తృణధాన్యాలు మా భిల్ తెగకు ప్రధాన ఆహారం. అన్ని తృణధాన్యాలలోకి అత్యంత నీటి సామర్థ్యం కలిగినవి, పోషకమైనవి చిరుధాన్యాలు. వరి, గోధుమ వంటి ఇతర తృణధాన్యాల కంటే వాటిని సాగుచేయటం సులభం." ఆమె చిరుధాన్యాల పేర్లను జాబితా చేయడం ప్రారంభించారు - బట్టీ (ఊదలు), భాది, రాలా (కొర్రలు), రాగి (రాగులు), బాజ్రా (సజ్జలు), కోడో (అరికెలు), కుట్కి (సామలు), సాంగ్రీ. "సహజంగా భూసారాన్ని నిర్వహించడానికి జీవవైవిధ్య పంటలను పండించటంలో భాగంగా ఈ పంటలను బీన్స్, పప్పులు, నూనె గింజల వంటి కాయధాన్యాలతో మార్చి మార్చి వేస్తారు."
































