"ఇప్పుడు మేం పనిచేయటం ఆపేస్తే, మొత్తం దేశమంతా విచారపడుతుంది."
బాబూ లాల్ చేసిన ఈ ప్రకటన, ఆ తర్వాత అతను మాట్లాడిన మాటలు వింటే మరింత బాగా అర్థమవుతుంది, “క్రికెట్ ఖేల్నే కో నహీఁ మిలేగా కిసీకో భీ (ఎవరూ ఇంక క్రికెట్ ఆడలేరు).”
బ్యాటింగ్ చేసేవారు, బౌలర్లు కూడా ప్రేమించడంతో పాటు భయపడే ఆ ఎరుపు తెలుపుల క్రికెట్ బంతి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, మీరట్‌లోని శోభాపుర్ అనే మురికివాడలో ఉండే చర్మశుద్ధి కర్మాగారాల నుంచి వచ్చిన తోలుతో తయారైనది. చర్మకారులు ముడి చర్మాన్ని పటికతో రుద్ది శుద్ధిచేసి క్రికెట్ బంతి తయారీ పరిశ్రమకు అవసరమైన ముడిపదార్థంగా అందించేది నగరంలోని ఈ ఒక్క ప్రదేశం నుంచే. 'టానింగ్ ' అంటే ముడి చర్మాన్ని మెరుగుపెట్టిన తోలుగా మార్చే ప్రక్రియ.
"కేవలం పటికతో చేసే చర్మశుద్ధి మాత్రమే చర్మపు పొరలలోని కణాలను తెరచుకునేలా చేసి రంగ్ (రంగు)ను దాని గుండా సులభంగా వెళ్ళేలా చేస్తుంది," అని బాబూ లాల్ చెప్పారు. అతని ఈ అభిప్రాయాన్ని 1960లలో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేసిన ఒక అధ్యయనం ధృవీకరించింది. పటికతో చర్మశుద్ధి చేయడం వల్ల బౌలర్ చేతి చెమ్మ వల్లనో లేదా చెమట/లాలాజలంతో క్రికెట్ బాల్‌ను మెరుపు కోసం రుద్దడం వల్లనో బంతి దెబ్బతినదు, బౌలర్ ఆటను పాడుచేయకుండా చేస్తుంది.
అరవై రెండేళ్ళ వయసున్న బాబూ లాల్ శోభాపుర్‌లో తనకున్న చర్మశుద్ధి కర్మాగారంలో ఒక మూలన ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చునివున్నారు; సున్నం తెలుపుదనంతో నేల మెరుస్తోంది. "మా పూర్వీకులు ఇక్కడ 200 సంవత్సరాలుగా తోలును తయారుచేస్తున్నారు," అని ఆయన చెప్పారు.




















