"నాకు ఈ ఒటిపిలంటే చాలా భయం. సహా ఆకడే ఆణి పైసా గాయబ్ [ఆరు అంకెలు, డబ్బు మాయం]," అనిల్ ఠోంబరే నాతో చెప్పారు. బస్సుల హారన్లు, చిరుతిండ్లు, నీళ్ళ సీసాలు అమ్ముకొంటున్నవారి కేకలు, బస్సుల రాక పోకలతో ఆ రాష్ట్ర రవాణా శాఖ బస్టాండ్ అంతా శబ్దాల సందడితో నిండివుంది. ఎవరో ఆయనను ఒటిపి (ఒన్ టైమ్ పాస్వర్డ్) అడగటంతో ఆయన నా సహాయాన్ని కోరారు.
బడ్జెట్ - ఆయన మాటల్లో చెప్పాలంటే అర్థ సంకల్ప - గురించి ఆయన విన్నారు. “జనవరి 31న, దాని గురించి రేడియోలో కొన్ని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం ప్రతి శాఖకు కొన్ని కేటాయింపులు ప్రకటిస్తుంది. దాని గురించి నాకు తెలుసు. అన్నీ కాకపోయినా, కనీసం రూపయత్ దహా పైసే [రూపాయిలో పది పైసలు]!” ఆయన ఒక అడికిత్తా (అడకత్తెర)తో పోకచెక్కను కత్తిరిస్తూ అన్నారు.
కొంత నిశ్శబ్దంగా ఉన్న చోటుకోసం మేం చూస్తుంటే, ఆయన అనేకంటే, ఆయన తెలుపు ఎరుపు రంగుల చేతికర్ర, క్యాంటీన్ వైపుకు దారితీసింది. ఠోంబరేకు దృష్టిలోపం ఉంది. ఆయనకు అక్కడి ప్లాట్‌ఫామ్‌లు, జనాల గుంపులు, క్యాంటీన్ కౌంటర్లు, మెట్లు - ఇవన్నీ బాగా తెలుసు. "తడపర పోసి నా కంటిచూపును పూర్తిగా పోగొట్టుకునే నాటికి నా వయసు కేవలం ఒక్క నెల మాత్రమేనని నాకు చెప్పారు."



