“ఈ భట్టీ (కొలిమి) వెలిగించిన ప్రతిసారీ నాకు ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంటుంది.”
సల్మా లోహార్ వేలి కణుపులు అన్నిటి మీదా మానిన గాయాల మచ్చలు కనిపిస్తున్నాయి. ఎడమచేతి కణుపులు రెండింటి మీద గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అవి త్వరగా మానిపోవటానికి కొలిమి నుంచి గుప్పెడు బూడిదను తీసి ఆమె వాటి మీద రుద్దారు.
సోనీపత్లోని బహాల్గఢ్ మార్కెట్లో వరుస ఝుగ్గీ (గుడిసె)లను తమ ఇళ్ళుగా పిలుచుకుంటూ బతుకుతుండే ఆరు లోహార్ కుటుంబాలలో 41 ఏళ్ళ సల్మా కుటుంబం కూడా ఒకటి. ఒక పక్క రద్దీగా ఉండే మార్కెట్ వీధి, ఇంకొక పక్క మునిసిపాలిటీ చెత్త కుప్ప. దగ్గరలోనే ఉన్న ప్రభుత్వ మరుగు దొడ్డి, నీళ్ళ టాంకర్ సౌకర్యాలపైనే సల్మా, ఆమె కుటుంబం పూర్తిగా ఆధారపడుతుంది.
ఈ ఝుగ్గీలకు కరెంటు అనే మాటేలేదు. పైగా, నాలుగైదు గంటలు వాన పడితే ఆ ప్రాంతం మొత్తం నీళ్ళలో మునిగిపోతుంది, గత అక్టోబర్లో (2023) పడ్డట్టు. అలా జరిగినప్పుడు కాళ్ళు పైకి మడచుకుని మంచాల మీద కూర్చుని, రెండు మూడు రోజులైనా సరే, ఆ నీళ్ళు పోయేదాకా ఎదురు చూడటం తప్ప వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదు. “ఆ రోజుల్లో చాలా కంపు కొడుతుంది,” అని గుర్తుచేసుకున్నాడు సల్మా కొడుకు దిల్షాద్.
“కానీ ఎక్కడికి పోతాం?” అడిగారు సల్మా. “చెత్త కుప్పల పక్కన ఉండటం వల్ల రోగాలు వస్తాయని మాకూ తెలుసు. అక్కడ మూగే ఈగలు వచ్చి మా తిండి మీద వాలతాయి. కానీ, ఇంకెక్కడికి పోగలం?”
గడియా లేదా గడులియా పేర్లతో పిలిచే లోహార్లు రాజస్థాన్లో సంచార తెగ (NT) గానూ, వెనకబడిన తరగతిగానూ జాబితా చేయబడ్డారు. ఈ సమూహానికి చెందినవారు ఢిల్లీలోనూ, హరియాణాలో కూడా నివసిస్తున్నారు. అయితే, ఢిల్లీలో వీరిని సంచార తెగగానే గుర్తించినా, హరియాణాలో మాత్రం వెనకబడిన తరగతిగా గుర్తించారు.
వాళ్ళు నివాసం ఉండే మార్కెట్ పదకొండవ రాష్ట్ర రహదారి పక్కనే ఉంది. కూరగాయలు, మిఠాయిలు, మసాలా దినుసులు, విద్యుత్ పరికరాలు, ఇంకా చాలా వస్తువులు అమ్ముకునేవాళ్ళు మార్కెట్లో అమ్ముకోవటం కోసం అక్కడికి వస్తారు. వాళ్ళు అక్కడ తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని, మార్కెట్ అయిపోగానే తిరిగి వెళ్ళిపోతారు.




















