"మొబైల్ ఫోన్లు, టివిలు, వీడియో గేమ్స్ రావటంతోనే తోలుబొమ్మలాటలు, కథ చెప్పటం వంటి చారిత్రాత్మక సంప్రదాయాలు తమ ఉనికిని కోల్పోవటం ప్రారంభమయింది," రాజస్థాన్‌లోని సీకర్ జిల్లా, దాంతా రామ్‌గఢ్‌కు చెందిన తోలుబొమ్మలాటల కళాకారుడు పూరణ్ భాట్ అన్నారు. తాము సొంతంగా తయారుచేసుకున్న తోలుబొమ్మలతో పిల్లల పార్టీలలో, పెళ్ళిళ్ళ వేడుకలలో, ప్రభుత్వ కార్యక్రమాలలో హాస్య నాటికలను (స్కిట్స్) ప్రదర్శించిన కాలాన్ని ఆ 30 ఏళ్ళ వయసున్న కళాకారుడు గుర్తుచేసుకున్నారు.
"ఇప్పుడు జనం విభిన్నమైన కార్యక్రమాలను కోరుకుంటున్నారు. ఇంతకుముందు మహిళలు ఢోలక్పై పాడేవారు, కానీ ఇప్పుడు జనం హార్మోనియంపై సినిమా పాటలు కావాలనుకుంటున్నారు. మాకు ఆదరణ లభిస్తే, మా పూర్వీకులు మాకు నేర్పించిన వాటిని మేం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం,” అని ఆయన చెప్పారు
భాట్ ఈ సంవత్సరం (2023) ఆగస్టులో జైపూర్‌లోని మూడు దశాబ్దాల నాటి బహుళ కళలకు కేంద్రమైన జవహర్ కళా కేంద్రంలో ఉన్నారు. రాజస్థాన్‌లోని అనేక జానపద కళాకారుల సమూహాలు ఈ రాష్ట్ర-ప్రాయోజిత ఉత్సవానికి తరలివచ్చాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారి కళనూ, జీవనోపాధిని కొనసాగించడానికి కష్టపడుతున్న కళాకారుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది.
ముఖ్యమంత్రి లోక్ కళాకార్ ప్రోత్సాహన్ యోజన అని పిలిచే ఈ పథకం, ప్రతి జానపద కళాకారుల కుటుంబానికి రోజుకు రూ. 500 వేతనంతో ఏడాదికి 100 రోజుల పాటు పని కల్పించేలా హామీ ఇస్తుంది. గ్రామీణ ప్రాంత కుటుంబాలకు 100 రోజుల ఉపాధిని వచ్చేలా చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005, దీనికి పూర్వ ప్రమాణంగా నిలిచింది.
కళాకారులకు, వృత్తినైపుణ్యం కలవారి కోసం సెప్టెంబర్ 2023లో కేంద్ర ప్రభుత్వ విశ్వకర్మ యోజనను ప్రకటించారు. అయితే ఈ పథకం - కళాకర్ యోజన - కాల్బేలియా, తెరహ్ తాలీ, బహురూపియా, ఇంకా ఇతర క ళా సముదాయాలకు మొదటిది. రాజస్థాన్‌లో దాదాపు 1-2 లక్షల మంది జానపద కళాకారులు ఉన్నారని కార్యకర్తలు అంచనా వేస్తున్నారు, అయితే ఇప్పటివరకు ఎవరూ మొత్తం లెక్కలు వేయలేదు. ఈ పథకం గిగ్ కార్మికులను (రవాణా, బట్వాడా చేసేవారు), వీధి వ్యాపారులను కూడా సామాజిక భద్రతా వలయంలోకి తీసుకువస్తుంది.










