సెప్టెంబర్ 2023. మేం పూలు పూసే కాలం మధ్యలో ఉన్నాం. ఇది పశ్చిమ కనుమల్లోని 'పూల లోయ'. ప్రత్యేకమైన జీవవైవిధ్యానికి ఆటపట్టయిన ఈ లోయలో ప్రతి సంవత్సరం వందలకొద్దీ స్థానిక రకాలైన గులాబీ, ఊదా రంగుల పూలు వికసిస్తాయి.
కానీ ఈ సంవత్సరం, కేవలం వాడిపోయిన పూలే నేలపై పడివున్నాయి…
1,200 మీటర్ల ఎత్తులో ఉన్న కాస్ పీఠభూమిని 2012లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించింది. అప్పటి నుండి, ఈ కాస్ పీఠభూమి మహారాష్ట్రలో ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది - ముఖ్యంగా పువ్వులు ఎక్కువగా పూసే ఆగస్ట్ నుండి అక్టోబర్ నెలల కాలంలో. అయితే ఇక్కడే అసలు సమస్యలు మొదలవుతాయి.
“(ఇంతకు ముందు) ఎవరూ ఇక్కడికి వచ్చేవారు కాదు. ఇది మాకు కేవలం ఒక కొండ మాత్రమే. ఇక్కడ మేం పశువులను, మేకలనూ మేపేవాళ్ళం,” అని సులాబాయి బదాపురి చెప్పారు. "ఇప్పుడు జనం పువ్వుల మీద నడుస్తారు, ఫొటోలు తీస్తారు, పువ్వులను సమూలంగా పెరుకుతారు!" జనం అలక్ష్యంతో విసిగిపోయిన 57 ఏళ్ళ సులాబాయి అన్నారు. "ఇది బాగ్ (తోట) కాదు; ఈ పూలు రాతిపై పూస్తాయి."
కాస్‌లోని ఈ పీఠభూమి సతారా జిల్లాలోని సతారా తాలూకాలో 1600 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఒక ఆధార శిల. దీనిని కాస్ పఠార్ అని కూడా అంటారు.














