ఆమె మాట్లాడుతున్నప్పుడు జబ్బుపడి పాలిపోయిన ముఖంపై నుదిటి మీద ముడతలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒంగిపోయి, కుంటుతూ, కొన్ని వందల మీటర్ల దూరానికొకసారి ఆగిపోయి శ్వాసను భారంగా తీసుకుంటున్నారు. మృదువైన గాలి ఆమెను తాకగానే నెరసిన జుట్టు ముఖాన్ని కప్పేసింది.
ఇంద్రావతి జాదవ్ వయస్సు కేవలం 31 సంవత్సరాలంటే నమ్మశక్యం కాదు.
మహారాష్ట్రలోని నాగపూర్ నగర శివారులలో ఉన్న మురికివాడలో నివసించే జాదవ్ క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఒపిడి)తో బాధపడుతున్నారు. ఇది ఊపిరితిత్తులలో గాలి ప్రవాహాన్ని నిరోధించి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగజేయడంతో పాటు తరచుగా దీర్ఘకాలిక దగ్గుకు కారణమవుతుంది. దీంతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతింటాయి. 'స్మోకర్స్ డిసీజ్'గా పిలిచే ఈ వ్యాధిగ్రస్తులు ప్రపంచవ్యాప్తంగా తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో 30 నుండి 40 శాతం వరకు పొగాకు లేదా ధూమపాన చరిత్ర కలిగిన రోగులే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.
జాదవ్ ఎన్నడూ సిగరెట్ ముట్టుకోలేదు, కానీ ఆమె ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా దెబ్బతింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పినదాని ప్రకారం చెక్క లేదా బొగ్గుతో మండే పొయ్యిమీద వంట చేయటం, గృహ వాయు కాలుష్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
వంట కోసం ఉపయోగించే శుభ్రమైన ఇంధనం ఏదీ ఆమెకు ఎప్పుడూ అందుబాటులో లేదు. "వంట చేయడానికి, నీళ్లు కాచటానికి మేం ఎప్పుడూ కట్టెల పొయ్యినీ లేదా బొగ్గుల పొయ్యినీ మాత్రమే వాడతాం. చులీవర్ జేవణ్ బన్‌వున్ మాఝీ ఫుప్పుసా నికామీ ఝాలీ ఆహెత్ (ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేయడం వల్లనే నా ఊపిరితిత్తులు పనికిరాకుండా పోయాయి)," అని వైద్యులు చెప్పిన దానినే తిరిగి చెప్పారామె. బయోమాస్‌తో (ఎండు కట్టెలు, పిడకల వంటివి) మండే పొయ్యి నుంచి వచ్చిన కాలుష్యం వల్ల ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయి.
వాయు కాలుష్యం కారణంగా ప్రతి ఏడాది దాదాపు ఆరు లక్షల మంది భారతీయులు అకాలంగా మరణిస్తున్నారని 2019 లాన్సెట్ అధ్యయనం అంచనా వేసింది. పరిసరాల గాలి నాణ్యతలో గృహ వాయు కాలుష్యం ఒక ముఖ్యమైన అంశమని తేల్చింది.










