"పత్రం అయితే సరిగా ఉండేది. యంత్రంతో అయితే నువ్వు ఏ బటన్ నొక్కుతున్నావో తెలియదు, వోటు ఎవరికి పడుతుందో కూడా తెలియదు!"
అంటే, ఇవిఎమ్(ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు)ల కంటే బ్యాలెట్ పేపర్ల వాడకానికే తాను ప్రాధాన్యమిస్తానని కల్ముద్దీన్ అన్సారి అంటున్నారు. పలామూలోని కుమనీ గ్రామ నివాసి అయిన 52 ఏళ్ళ కల్ముద్దీన్‌ను మేం స్థానిక మవేశీ (పశువుల) బాజార్లో కలిశాం. ఝార్ఖండ్‌లో ఏప్రిల్ మాసపు బొబ్బలెక్కించే ఎండ నుండి తనను తాను కాపాడుకోవడానికి ఆయన తన తలచుట్టూ ఒక తెల్లని గమ్ఛా (తువ్వాలు)ని చుట్టుకొని ఉన్నారు. పలుచని, ముతకగా ఉండే నూలు వస్త్రమైన గమ్ఛాను సంప్రదాయకంగా తువ్వాలుగా, స్కార్ఫ్‌గా, తలపాగాగా చుట్టుకోవడానికి కూడా ఉపయోగిస్తారు; ఇది అనేక రకాలుగా ఉపయోగించేందుకు అనుకూలమైన వస్త్రం.
పాథర్‌లో జరిగే ఈ వారపు సంతలో తన ఎద్దును అమ్మటం కోసం కల్ముద్దీన్ 13 కిలోమీటర్ల దూరం నడిచి ఇక్కడకు వచ్చారు. "మాకు డబ్బు అవసరం ఉంది," అన్నారాయన.
పోయిన ఏడాది (2023), ఆయన వరి పంట పూర్తిగా నాశనమైపోయింది. రబీ పంటకాలంలో ఆయన ఆవాల పంట వేశారు, కానీ మూడవ వంతు పంటను పురుగులు తినేశాయి. "మేం 2.5 క్వింటాళ్ళ పంటను కోసుకోగలిగాం. అదంతా అప్పులు చెల్లించడానికే పోయింది," అన్నారు కల్ముద్దీన్.
నాలుగు బిఘాల (సుమారు మూడు ఎకరాలు) భూమిని సాగుచేసే రైతు కల్ముద్దీన్ స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న వివిధ రకాల అప్పుల భారం కింద ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. "బహుత్ పైసా లే లేవా లే [వాళ్ళు చాలా డబ్బు తీసేసుకున్నారు]," అంటూ అతను ప్రతి వంద రూపాయలకు నెలకు ఐదు రూపాయల వడ్డీ కట్టాల్సిరావడం మనిషిని అశక్తుడిని చేస్తుందని కూడా అన్నారు. "నేను 16,000 రూపాయలు అప్పు తీసుకున్నాను, అదిప్పుడు రూ. 20,000 అయింది. అయితే నేను అందులో రూ. 5,000 మాత్రమే చెల్లించాను."
ఇప్పుడు ఆయనకున్న ఒకే ఒక అవకాశం తన ఎద్దును అమ్మటం. ఇసీలియే కిసాన్ చుర్మురా జాతా హై. ఖేతీ కియె కి బైల్ బేచా గయా [అందుకే రైతు కష్టాలు పడుతున్నాడు. నేను వ్యవసాయం చేస్తూ, చివరకు నా ఎద్దును అమ్ముకునే స్థితికి వచ్చాను]," 2023లోనైనా వర్షాలు పడతాయని ఆశించిన కల్ముద్దీన్ అన్నారు.












