దట్టమైన చెట్లతో కూడిన కుదురేముఖ నేషనల్ పార్క్ కొండలలో, చారిత్రకంగా అడవిలో నివసించే సముదాయాలకు అత్యంత అవసరమైన సౌకర్యాలు లేవు. వారిలో కుత్లూరు గ్రామంలోని మలెకుడియా సముదాయానికి చెందినవారి 30 ఇళ్ళకు నేటికీ విద్యుత్ కనెక్షన్లు, నీటి సరఫరా లేదు. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా, బెళ్తంగడి తాలూకాలో ఉండే కుత్లూరుకు చెందిన రైతు శ్రీధర మలెకుడియా మాట్లాడుతూ “విద్యుత్ కోసం ఇక్కడి ప్రజలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు," అన్నారు.
ఒక ఎనిమిదేళ్ళ క్రితం, తన ఇంటికి విద్యుత్తు కోసం శ్రీధర ఒక పికో హైడ్రో జెనరేటర్ కొన్నారు. విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కోసం సొంతంగా పెట్టుబడి పెట్టిన 11 ఇళ్ళలో ఆయనది కూడా ఒకటి. "మిగిలిన ఇళ్ళల్లో - విద్యుచ్ఛక్తి, జల విద్యుత్తు, నీటి సరఫరా - ఇవేమీ లేవు." ప్రస్తుతం గ్రామంలోని 15 ఇళ్ళు పికో జల యంత్రాల ద్వారా జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నాయి. ఒక చిన్న నీటి టర్బైన్ (నీటి తాకిడికి తిరిగే పళ్ళ చక్రం), ఒక కిలోవాట్ విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేస్తుంది. అది ఒక ఇంటిలో రెండు బల్బులు వెలగటానికి సరిపోతుంది.
అటవీ హక్కుల చట్టం అమలులోకి వచ్చి 18 సంవత్సరాలవుతున్నా, కుదురేముఖ నేషనల్ పార్క్‌లో నివసించే ప్రజలకు ఈ చట్టం కింద మంజూరైన మౌలిక సదుపాయాలైన నీరు, రహదారులు, పాఠశాలలు, వైద్యశాలలు ఇంతవరకూ అమలులోకి రాలేదు. షెడ్యూల్డ్ తెగకు చెందిన మలెకుడియా సముదాయం పొందేందుకు కష్టపడుతున్న సౌకర్యాల్లో విద్యుత్ ఒకటి.
పోస్ట్ స్క్రిప్ట్: ఈ వీడియోను రూపొందించినది 2017లో. ఈనాటి వరకూ కుత్లూరు గ్రామానికి విద్యుత్ సరఫరా రాలేదు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి