మొదటిసారి దియా దాదాపు తప్పించుకుంది.
ఆమె బస్‌లో ఇబ్బందిపడుతూ కూర్చొని, అది నిండటానికి ఎదురుచూస్తోంది. సూరత్ నుండి ఝాలోద్‌కు టిక్కెట్ కొనుక్కుంది. అక్కడి నుంచి, గుజరాత్ సరిహద్దును దాటి రాజస్థాన్‌లోని కుశల్‌గఢ్‌లో ఉండే తన ఇంటికి చేరటానికి ఒక గంట ప్రయాణమేనని ఆమెకు తెలుసు.
అకస్మాత్తుగా తన వెనుకనుంచి రవి వచ్చినప్పుడు ఆమె కిటికీలోంచి బయటకు చూస్తోంది. ఆమె ప్రతిఘటించేలోపే, అతను ఆమె చేతిని పట్టుకొని బస్‌లోంచి కిందకు బరబరా ఈడ్చుకుపోయాడు.
బస్‌లో ఉన్న జనాలంతా సామాన్లు సర్దుకుంటూ, పిల్లలను చూసుకుంటూ తీరికలేకుండా ఉన్నారు. కోపంతో ఉన్న ఆ యువకుడిని గానీ, భయంతో వణికిపోతోన్న ఆ అమ్మాయిని గానీ ఎవరూ పట్టించుకోలేదు. "నాకు అరవటానికి కూడా భయమేసింది," అంది దియా. రవి కర్కశత్వం సంగతి ఇంతకుముందే అనుభవమైంది కాబట్టి నిశ్శబ్దంగా ఉండటమే మంచిది.
ఆ రాత్రి, గత ఆరు నెలలుగా ఆమెకు ఇల్లూ జైలూ కూడా అయిన ఆ నిర్మాణ స్థలానికి చేరిన తర్వాత, దియా నిద్రపోలేకపోయింది. ఆమె శరీరమంతా గాయాలే. రవి ఎంతగా ఆమెను కొట్టాడంటే ఆమె చర్మం అనేకచోట్ల చిట్లి కమిలిపోయి ఉంది. "అతను నన్ను పిడికిళ్ళతో గుద్దాడు," ఆమె గుర్తుచేసుకుంది. "ఎవరూ అతన్ని ఆపలేకపోయారు." మధ్యలో కల్పించుకోబోయిన మగవాళ్ళపై వాళ్ళు ఆమెపై కన్ను వేశారని ఆరోపించాడు. ఆ హింసను చూసి భయపడిన మహిళలు దూరంగా ఉండిపోయారు. ఎవరైనా జోక్యం చేసుకునే ధైర్యం చేసినా, 'మేరీ ఘర్‌వాలీ హై, తుం క్యోఁ బీచ్ మే ఆ రహే హో [ఆమె నా భార్య. నువ్వెందుకు మధ్యలో కల్పించుకుంటున్నావ్]?' అంటాడు రవి.
"నన్ను కొట్టినప్పుడల్లా, మలాము పట్టీ (గాయానికి కట్టు కట్టడం) కోసం నేను ఆసుపత్రికి వెళ్ళి 500 రూపాయలు ఖర్చుపెట్టాల్సివస్తుంది. ఒకోసారి రవి సోదరుడే డబ్బులిస్తాడు, తాను కూడా నాతోపాటు ఆసుపత్రికి వస్తాడు. 'తుమ్ ఘర్ పే చలే జా [నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో],' అంటాడు," చెప్పింది దియా. కానీ అదెలా జరుగుతుందో ఇద్దరికీ తెలియదు.

















