"నీటిమట్టం పెరిగినపుడు మా ప్రాణాలు వణికిపోతాయి," అంటారు అస్సామ్‌లోని బగొరీబారీలో నివాసముండే హరేశ్వర్ దాస్. ప్రతి ఏటా వర్షాకాలంలో సమీపంలో ఉండే పుఠిమారీ నదిలో నీటి మట్టాలు పెరగటంవలన వచ్చే వరదలలో వారి ఇళ్ళు, పంటలు ధ్వంసమయ్యే అవకాశం ఉన్నందున, ఆ కాలంలో గ్రామం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు.
"వర్షం పడినప్పుడల్లా మేం మా బట్టలు సర్దుకొని సిద్ధంగా ఉండాలి. పోయిన ఏడాది వచ్చిన వరదలు రెండు కచ్చా ఇళ్ళను ధ్వంసం చేశాయి. వెదురు బొంగులు, మట్టితో కొత్తగా మళ్ళీ గోడలు లేచాయి," అంటూ మాటలు జోడించారు ఆయన భార్య సావిత్రీ దాస్.
"నేను (ఇప్పుడు పాడైపోయిన) టివిని ఒక గోతాంలో మూటకట్టి అటకమీద పెట్టేశాను," అన్నారు నీరదా దాస్. దీనికి ముందరి టెలివిజన్ కూడా పోయినసారి వచ్చిన వరదలలో పాడైపోయింది.
అది జూన్ 16, 2023 రాత్రి, వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. అక్కడ నివాసముండేవారు, పోయిన ఏడాది కూలిపోయిన ఒక కరకట్టను మరమ్మత్తు చేయటం కోసం ఇసుక బస్తాలను ఉపయోగించారు. రెండు రోజులు గడచినా వర్షం ఆగే సూచనలు కనిపించడంలేదు. బగొరీబారీతో పాటు ధేపర్‌గావ్ఁ, మాదోయికటా, నీజ్ కౌర్‌బాహా, ఖండికర్, బిహాపరా, లాహాపరా వంటి ఇరుగుపొరుగు గ్రామాలు కూడా కరకట్టకు సంబంధించిన బలహీనమైన భాగంలో మళ్ళీ గండి పడుతుందేమోనని జాగ్రత్తగా గమనిస్తున్నారు.
అదృష్టవశాత్తూ నాలుగు రోజుల తర్వాత వర్షం నెమ్మదించడంతో, నీటి మట్టం కూడా తగ్గిపోయింది.
"కరకట్టకు గండిపడినప్పుడు అది ఒక నీటి బాంబులా కనిపిస్తుంది. అది తన దారిలోకి వచ్చిన ప్రతిదాన్నీ తుడిచిపెట్టుకుంటూ పోతుంది," స్థానిక ఉపాధ్యాయులైన హరేశ్వర్ దాస్ వివరించారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసిన 85 ఏళ్ళ హరేశ్వర్, కె.బి. దేవుల్‌కుచి హయ్యర్ సెకండరీ పాఠశాలలో అస్సామీ భాషను బోధించేవారు.
1965లో నిర్మించిన కరకట్ట వలన మంచి కంటే ఎక్కువగా చెడే జరిగిందని ఆయన దృఢవిశ్వాసం, "పంటభూములను మరింత సారవంతం చేయడానికి బదులుగా అది వాటిని ముంచేసింది."




















