కేంద్ర 'బడ్జెట్ కేవలం అధికారుల కోసమే'నని అలీ మొహమ్మద్ లోన్ నమ్ముతున్నారు. అంటే ఆయన అర్థంలో అది మధ్యతరగతి సర్కారీ లోగ్ లేదా ప్రభుత్వ ఉద్యోగులకోసం రూపొందించినదని. కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఒక చిన్న బేకరీ దుకాణం యజమాని అయిన ఈయన, ఈ బడ్జెట్ తనలాంటి సామాన్యుల గురించి కాదని గుర్తించినట్లుగా కూడా ఇది సూచిస్తోంది.
"నేను 2024లో ఒక 50 కిలోగ్రాముల పిండి బస్తాను 1,400 రూపాయలకు కొన్నాను, ఇప్పుడు దాని ధర 2,200," టంగ్‌మర్గ్ బ్లాక్‌లోని మాహీన్ గ్రామానికి చెందిన ఈ 52 ఏళ్ళ రొట్టెల తయారీదారు మాతో మాట్లాడుతూ అన్నారు. "బడ్జెట్లో ధరలు తగ్గించటానికి సహాయపడేది ఏమైనా ఉండినట్లయితే, నాకు దాని పట్ల ఆసక్తి కలిగివుండేది; లేకుంటే, ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే ఈ బడ్జెట్ అధికారుల కోసమే."
శ్రీనగర్ నుండి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే మాహీన్ గ్రామం శీతాకాలపు పర్యాటక ప్రాంతాలైన టంగ్‌మర్గ్, ద్రంగ్ల మధ్య ఉంది. ఇక్కడ పొట్టి గుర్రాలను అద్దెకివ్వటం, స్లెడ్జిలు లాగటం, గైడ్లుగా పనిచేయటం వంటి ప్రధానంగా పర్యాటక సంబంధిత కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న దాదాపు 250 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడి అతిశీతల వాతావరణం కారణంగా, మాహీన్ ప్రధానంగా మొక్కజొన్నను ఉత్పత్తి చేస్తుంది.






