నారాయణ్ కుండలిక్ హజారే బడ్జెట్ అనే పదాన్ని అర్థం చేసుకున్నారు, ఎందుకంటే ఆయన వద్ద పెద్ద బడ్జెట్ లేదు.
“ఆప్లా తేవ్ఢా బజెటచ్ నాహీ [నా దగ్గర అంత బడ్జెట్ లేదు]!” నారాయణ్ కాకా కేవలం నాలుగు మాటల్లో, రూ. 12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదని ఊదరకొడుతోన్న కొత్త పన్ను విధానం గాలి తీసేశారు.
కేంద్ర బడ్జెట్ గురించిన ప్రశ్న, పళ్ళను విక్రయించే ఈ 65 ఏళ్ళ వృద్ధరైతును తీవ్రంగా ఆలోచించేలా చేసింది. ఆయన చాలా నమ్మకంగా ఇలా సమాధానం ఇచ్చారు. “దీని గురించి నేను ఏమీ వినలేదు. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ వినలేదు.”
నారాయణ్ కాకాకు, దాని గురించి తెలుసుకునే దారే లేదు. “నా దగ్గర మొబైల్ ఫోన్ లేదు. ఇంట్లో టీవీ కూడా లేదు." కొద్ది రోజుల క్రితమే ఒక స్నేహితుడు ఆయనకు ఒక రేడియోను బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ వార్షిక ఈవెంట్ గురించి ఆ ప్రజా ప్రసారాల సేవ ఆయనకు ఇంకా తెలియజేయలేదు. “ఆమ్చా అడాణీ మాణసాచా కాయ్ సంబంధ్, తుమ్హీచ్ సాంగా [మాలాంటి అక్షరజ్ఞానం లేనివాళ్ళకు దీనితో ఏమైనా సంబంధం ఉందా]?” అని ఆయన అడుగుతారు. ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ లేదా ‘పెరిగిన రుణ పరిమితి’లాంటి పదాలు నారాయణ్ హజారే ప్రపంచానికి చెందినవి కావు.



