కిరణ్ వంట చేస్తుంది, ఇంటిని శుభ్రం చేస్తుంది, ఇంటిని నడుపుతుంది. ముంచుకొస్తోన్న ఎండాకాలం వలన వెళ్ళాల్సిన దూరాలు పెరుగుతున్నప్పటికీ, ఆమె కట్టెలనూ నీటినీ సేకరించి, వాటిని ఇంటివరకూ మోసుకొస్తుంది.
కేవలం 11 ఏళ్ళ వయసున్న ఆమెకు మరో అవకాశం లేదు - ప్రతి ఏటా ఆమె తల్లిదండ్రులు వలస పోతుండటంతో, బాన్స్‌వాడా జిల్లాలోని ఆమె గ్రామంలో (పేరును తొలగించాము) ఉన్న ఇంటిలో మరెవ్వరూ ఉండరు. 18 ఏళ్ళ వయసున్న ఆమె అన్న వికాస్ (పేరు మార్చాం) ప్రస్తుతానికి అక్కడే ఉన్నాడు, కానీ గతంలో చేసినట్టే అతను కూడా ఎప్పుడైనా వలసపోవచ్చు. మూడు నుంచి పదమూడేళ్ళ మధ్య వయసుండే వారి మిగిలిన ముగ్గురు తోబుట్టువులు గుజరాత్, వడోదరలోని నిర్మాణ స్థలాల వద్ద కూలీలుగా పనిచేసే వారి తల్లిదండ్రుల వద్దనే ఉంటారు. వాళ్ళు బడికి వెళ్ళలేకపోయినా, కిరణ్ మాత్రం బడికి వెళ్తోంది.
"నేను ఉదయం పూట కొంత వంట చేస్తాను," ఈ రిపోర్టర్‌తో తన దినచర్య గురించి చెప్పింది కిరణ్ (పేరు మార్చాం). ఆ ఒంటిగది ఇంటిలో దాదాపు సగభాగాన్ని వంటచేసుకునే ప్రదేశం ఆక్రమించింది. కప్పుకు వేలాడదీసి ఉన్న ఒకే ఒక మెరుపు దీపం (ఫ్లాష్ లైట్), సూర్యుడు దిగిపోగానే ఆ ఇంటికి వెలుతురును అందిస్తుంది.
ఒక చివరన కట్టెల పొయ్యి ఉంది; మరికొన్ని కట్టెలు, ఒక పాత ఇంధనపు డబ్బా ఆ దగ్గరలోనే ఉన్నాయి. కూరగాయలు, మసాలాలు, ఇంకా ప్లాస్టిక్ సంచుల్లోనూ డబ్బాలలోనూ ఉన్న ఇతర దినుసులు కొన్ని నేలమీదా, మరికొన్ని ఆమె చిన్ని చేతులకు అందే ఎత్తున గోడలకూ తగిలించి ఉన్నాయి. "బడి అయిపోయాక సాయంత్రం పూట నేను రాత్రి భోజనాన్ని కూడా వండుకుంటాను. ఫిర్ ముర్గీ కో దేఖ్‌నా [తర్వాత కోడి పెట్టలనూ పుంజులనూ చూసుకుంటాను], ఆ తర్వాత నిద్రపోతాం," చెప్పింది కిరణ్
సిగ్గుపడుతూ ఆమె వివరించే కథనంలో, స్థానికులు బిజిలియా లేదా దావడా ఖోరా అని పిలిచే సమీపంలోని కొండల దిగువన ఉన్న అడవుల నుండి కట్టెలను సేకరించి మోసుకురావడం వంటి అనేక ఇతర ఇంటి పనులను గురించి చెప్పకుండా వదిలివేస్తుంది. అడవికి వెళ్ళడానికి కిరణ్‌కు సుమారు ఒక గంట పడుతుంది. కట్టెలను నరికి, వాటిని దగ్గరగా చేర్చి మోపుగా కట్టడానికి మరో గంట పడుతుంది. కొన్ని కిలోల బరువున్న కట్టెలతో ఇంటికి తిరిగి రావడానికి మరో గంట పడుతుంది. ఆ కట్టెల మోపు ఖచ్చితంగా ఆమె కంటే ఎత్తుగా ఉండి, పీలగా ఉండే ఆ చిన్నారి కంటే ఎక్కువ బరువు ఉంటుంది.












