దేశంలోని ముఖ్యమైన ఆహార ధాన్యాల సరఫరాదారు అయిన ఉత్తరప్రదేశ్‌ను సంవత్సరాలుగా ప్రభావితం చేస్తోన్న ప్రధాన విపత్తులలో కరవు ఒకటి అని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అంగీకరించింది. మధ్య ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా ఇంతే సమానంగా కరవు పరిస్థితులకు ప్రభావితమవుతున్నాయి. గత 29 సంవత్సరాలలో 51 జిల్లాలు అనేక కరవులను ఎదుర్కొన్నాయి. ఈ రాష్ట్రాలలోని అసంఖ్యాక ప్రజలు తమ జీవనోపాధి కోసం వర్షాధార వ్యవసాయంపై ఆధారపడ్డారు. దాంతో, పదే పదే వీస్తోన్న వడగాడ్పులు, అడుగంటిపోతోన్న భూగర్భ జలాలు, వర్షపాతం తగ్గిపోవటం రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులను సృష్టిస్తున్నాయి.
కరవును అనుభవించినవారికే అది సృష్టించే బీభత్సం తెలుస్తుంది. నగరవాసులకు ఇది ఒక వార్త మాత్రమే, కానీ ఏటా దానిలోనే జీవించే రైతులకు ఇది మృత్యుదేవత అయిన యముని రాక వంటి ఒక అరిష్టం. రాతిలా ఎండిపోయి, వర్షాల కోసం ఎదురుచూసే కళ్ళు, ఎండిపోయిన, నిప్పులు కురిపించే నెర్రెలు విచ్చిన భూమి, ఆకలితో ఎండిన డొక్కలతో ఉన్న పిల్లలు, పశువుల ఎముకల కుప్పలు, నీటి కోసం వెదుకులాడుతూ తిరుగుతున్న స్త్రీలు - ఇవన్నీ రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితమైన దృశ్యాలు.
మధ్య భారత పీఠభూమిలో నేను అనుభవించిన కరవు నుంచి ఈ కవిత వచ్చింది.
सूखा
रोज़ बरसता नैनों का जल
रोज़ उठा सरका देता हल
रूठ गए जब सूखे बादल
क्या जोते क्या बोवे पागल
सागर ताल बला से सूखे
हार न जीते प्यासे सूखे
दान दिया परसाद चढ़ाया
फिर काहे चौमासे सूखे
धूप ताप से बर गई धरती
अबके सूखे मर गई धरती
एक बाल ना एक कनूका
आग लगी परती की परती
भूखी आंखें मोटी मोटी
हाड़ से चिपकी सूखी बोटी
सूखी साखी उंगलियों में
सूखी चमड़ी सूखी रोटी
सूख गई है अमराई भी
सूख गई है अंगनाई भी
तीर सी लगती है छाती में
सूख गई है पुरवाई भी
गड्डे गिर्री डोरी सूखी
गगरी मटकी मोरी सूखी
पनघट पर क्या लेने जाए
इंतज़ार में गोरी सूखी
मावर लाली बिंदिया सूखी
धीरे धीरे निंदिया सूखी
आंचल में पलने वाली फिर
आशा चिंदिया चिंदिया सूखी
सूख चुके सब ज्वारों के तन
सूख चुके सब गायों के थन
काहे का घी कैसा मक्खन
सूख चुके सब हांडी बर्तन
फूलों के परखच्चे सूखे
पके नहीं फल कच्चे सूखे
जो बिरवान नहीं सूखे थे
सूखे अच्छे अच्छे सूखे
जातें, मेले, झांकी सूखी
दीवाली बैसाखी सूखी
चौथ मनी ना होली भीगी
चन्दन रोली राखी सूखी
बस कोयल की कूक न सूखी
घड़ी घड़ी की हूक न सूखी
सूखे चेहरे सूखे पंजर
लेकिन
पेट की भूक न
सूखी
కరవు
రోజురోజూ జాలువారే కన్నీటి ధారలు,
చేతి నుండి జారిపోయే నాగలి.
కోపంగా మండిపడే తడిలేని మేఘాలు
పిచ్చివాడా! ఈ భూమిని ఏమి దున్ని, ఏమి విత్తాలి?
మహాసముద్రాలే అడుగంటాయి, సరస్సులు ఎండిపోయాయి.
దాహంతో అలమటించిన భూమి పొడిబారి ఎండిపోయింది.
దానాలు చేశాను, దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పించాను,
అయినా చినుకు చుక్కైనా రాలలేదు, ఎందుకని?
ప్రచండ సూర్యతాపానికి మండిపోయిన భూమి,
కరవుతో మాడిపోయిన భూమి,
ఒక్క జొన్నపొత్తు కానీ, ఒక్క గింజ కానీ లేని భూమి,
నిష్ఫలంగా బీడు పడిన భూమిలో అగ్ని రగిలింది.
ఆకలికి కళ్ళు పెద్దవవుతాయి,
చర్మంలోంచి ఎముకలు పొడుచుకువస్తాయి.
కరవుకు ఎండిన చర్మం కప్పిన వేళ్ళు,
ఎండు రొట్టెలను చీరుతుంటాయి.
తోట ఎండిపోయింది,
ఆవరణం కూడా.
నా గుండెలో దిగిన బాణం లాగా,
గాలి కూడా ఎండిపోయింది.
కడవ, కూజా, కొయ్య స్తంభాలు,
గిలక, తాడూ అన్నీ ఎండిపోయాయి,
నీటి కోసం ఎక్కడికని వెళ్ళేది?
ఎప్పటికీ ఆమె అలా వేచి ఉంటుంది, ఆశలెండిపోయి.
ముందు ఆ గులాబీ బుగ్గలు, ఆ తర్వాత నుదుటి కుంకుమ,
కరవుతో నిద్ర కూడా మెల్లగా కరవైపోయింది.
ఆపైన ఆమె ఒడిలో ఆశ ఒకటి వికసించింది,
దానిని కూడా ఆమె బొట్టు బొట్టుగా జారవిడుచుకుంది.
ఎద్దుల శరీరాలు బక్కచిక్కిపోయాయి.
ఆవుల పొదుగులు వట్టిపోయాయి.
ఇంకా ఎక్కడి నెయ్యి? ఎక్కడి వెన్న?
ఇంటిలోని పాత్రలన్నీ నిండుకున్నాయి.
పక్వానికి రాకముందే పచ్చిగానే పండ్లు ఎండిపోయాయి.
సువాసనల పూల రేకులు రాలిపోయాయి.
పచ్చపచ్చగా అలరారిన చెట్లు మోడువారిపోయాయి.
అన్ని రోజులూ గంటలూ పొడిబారిపోయాయి.
పండుగలు, జాతరలు, ఊరేగింపులు,
దీపావళి, బైసాఖీ, చౌథ్, హోలీ,
చందన తిలకమూ లేదు, కుంకుమా లేదు,
ఈ ఏడాది రాఖీ కూడా కరవైపోయింది.
కానీ కోయిల పాట సజీవంగానే ఉంది.
హృదయ వేదనలు, బాధలు సజీవంగా ఉన్నాయి.
ఎండిన ముఖాలు, అస్థిపంజరాల వెనుక
ఆకలి మంటలు మాత్రం ఆరిపోలేదు
అనువాదం: సుధామయి సత్తెనపల్లి