తెరచిపెట్టిన అరచేతిలో కొబ్బరికాయ, పొడవుగా చాచిన చెయ్యి... పూజారి ఆంజనేయులు ముద్దలాపురం పొలాల మీదుగా నడుస్తున్నారు. ఆ కొబ్బరికాయ గిరగిరా తిరిగి వొరిగి పడిపోవటం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. అది పడింది. ఇదే అంటూ మాకు హామీ ఇచ్చి, ‘X’ గుర్తుపెట్టారు. "ఇక్కడ మీకు నీరు పడుతుంది. సరిగ్గా ఈ ప్రదేశంలోనే మీరు బోరుబావి వెయ్యండి, మీరే చూస్తారు," అనంతపూర్ జిల్లాలోని ఈ గ్రామంలో ఆయన మాతో ఈ మాటలు చెప్పారు.
ఆ పక్క ఊరిలోని మరో పొలంలో రాయులు ధోమతిమ్మన ముందుకువాలి నడుస్తున్నారు. ఆయన రెండు చేతులలతో పట్టుకొనివున్న పెద్ద పంగల కర్ర ఆ రాయలప్పదొడ్డిలో నీరు ఉన్నచోటుకు దారిచూపిస్తుంది. "ఆ కర్ర పైకెగిరినప్పుడు, అదే నీటి తావు," అంటూ వివరిస్తాడాయన. తన పద్ధతి "90 శాతం విజయవంతం అవుతుందని" రాయులు వినయంగా చెప్పుకుంటారు.
అనంతపురంలోని వేరొక మండలంలో, చంద్రశేఖర్ రెడ్డి యుగాలుగా తత్వవేత్తలను కలవరపరుస్తోన్న ప్రశ్నతో తలపడ్డారు. మరణం తర్వాత జీవితం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం తనకు తెలుసునని రెడ్డి నమ్ముతారు. "నీరే జీవితం," అంటారాయన. అలాగే శ్మశానవాటికలో నాలుగు బోరుబావులు దించారు. అతని పొలంలో మరో 32 ఉన్నాయి. ఆయన తన జంబులదిన్నె గ్రామం అంతటా విస్తరించి ఉన్న నీటి వనరులను 8 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్‌తో అనుసంధానించారు.
మూఢనమ్మకాలు, గుప్తశక్తులు, దేవుడు, ప్రభుత్వం, సాంకేతికత, కొబ్బరికాయలు- ఇవన్నీ నీటి కోసం అనంతపురం చేస్తోన్న తీరని అన్వేషణలో తమ సేవలను అందించాయి. వాటన్నిటి సేవలు కలిపినా కూడా ఏమంత ఆకట్టుకునే ఫలితాలు లేవు. అయితే పూజారి ఆంజనేయులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు.
సౌమ్యుడూ, నెమ్మదస్తు డుగా కనిపించే ఈయన తన పద్ధతి విఫలం కాదని చెప్పారు. ఆయన సాక్షాత్తూ దేవుడి నుండి తన నైపుణ్యాలను పొందారు. "ప్రజలు తగని సమయంలో దీన్ని చేయమని నన్ను బలవంతం చేసినప్పుడు మాత్రమే అది మమ్మల్ని నిరాశపరుస్తుంది," అని ఆయన చెప్పారు (దేవుడు ఒక్కో బోరుబావి పాయింట్‌కి 300 రూపాయలు వసూలు చేస్తాడు). ఇక తన అరచేతిలో కొబ్బరికాయ ఊగుతూ ఉండగా మనల్ని పొలాల్లోకి తీసుకెళతాడు.









