"ప్రస్తుత బడ్జెట్ మా మనుగడకు సంబంధించిన ఏ సమస్యనూ ప్రస్తావించలేదు. ఇది ప్రధానంగా మధ్యతరగతివారికి, ముఖ్యంగా జీతభత్యాల వ్యక్తులకు సంబంధించినదిగా కనిపిస్తోంది," అని గీతా వాళచ్చల్ అన్నారు.
36 ఏళ్ళ గీత, ప్రత్యేకించి దుర్బలమైన ఆదివాసీ సమూహం (PVTG)గా వర్గీకరించిన కాడర్ సముదాయానికి చెందినవారు. ఆమె కేరళలోని త్రిసూర్ జిల్లాలో ప్రతిపాదిత ఆతిరప్పిల్లి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారు..
చాలకుడి నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఈ ఆనకట్ట, ఇప్పటికి నాలుగోసారి ఆమె సముదాయానికి చెందినవారిని నిర్వాసితులను చేస్తోంది. “దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కారణంగా మేం మళ్ళీ మళ్ళీ నిర్వాసితులుగా మారుతున్నాం. అంతే కాకుండా మా భూములను, అడవులను, వనరులను కార్పొరేట్ సంస్థలు స్వాధీనం చేసుకోవడం గురించిన ప్రస్తావనే లేదు," అని ఆనకట్టకు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రజా ఉద్యమపు ముఖచిత్రంగా మారిన గీత అన్నారు.
"వాతావరణ మార్పులు అడవుల్లో నివసించే ఆదివాసులకు అంతకు ముందెన్నడూ లేని మనుగడ సమస్యలను సృష్టిస్తాయి. మేం ప్రతికూల వాతావరణం, క్షీణిస్తున్న అడవులు, జీవనోపాధులు తగ్గిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాం,” అన్నారు కేరళలోని ఏకైక ఆదివాసీ నాయకురాలు గీత.




