"నా ఎడమ కంటితో నేనేమీ చూడలేకపోతున్నాను. ప్రకాశవంతమైన వెలుతురు బాధపెడుతోంది. చాలా బాధగా ఉంటుంది. దీని కారణంగా నేను సమస్యలతో నిండిన పరిస్థితులలో జీవిస్తున్నాను," పశ్చిమబెంగాల్, దక్షిణ 24 పరగణాల జిల్లోని బన్‌గాఁవ్ పట్టణానికి చెందిన గృహిణి, ప్రమీలా నస్కర్ అన్నారు. తొలి నలబైల వయసులో ఉన్న ప్రమీల కొల్‌కతాలోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆప్తల్మాలజీలో వారానికొకసారి నిర్వహించే కార్నియా క్లినిక్‌లో మాతో మాట్లాడుతున్నారు. ఆమె చికిత్స కోసం అక్కడకు వచ్చారు.
నేను ప్రమీలా నస్కర్ ఆవేదనను అర్థంచేసుకోగలను. ఒక కంటికి చూపు కోల్పోవడం కూడా ఒక ఫోటోగ్రాఫర్‌కు భయంకరమైన అనుభవం. 2007లో నా ఎడమ కన్నులో కార్నియల్ అల్సర్ రావటంతో అంధుడిగా మారే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో విదేశాలలో నివసిస్తున్న నేను చికిత్స కోసం భారతదేశానికి తిరిగి రావలసి వచ్చింది. నేను పూర్తిగా దృష్టిని తిరిగి పొందటానికి ముందు ఒకటిన్నర నెలల పాటు చాలా భాధాకరమైన పునరుద్ధరణ విధానాన్ని భరించాను. ఇప్పటికీ, కోలుకున్న దశాబ్దంన్నర తర్వాత కూడా, అంధుడిని అవుతాననే భయం కలుగుతుంటుంది నాకు. ఒక ఫోటోగ్రాఫర్ తన చూపును కోల్పోవడం ఎంత బాధగా ఉంటుందో నాకు కళ్ళకు కడుతూనే ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా "కనీసం 2.2 బిలియన్ల మంది ప్రజలు హ్రస్వ దృష్టి, లేదా దూర దృష్టి లోపాలను కలిగి ఉన్నారు. ఇందులో కనీసం ఒక బిలియన్ - దాదాపు సగం మంది - కేసులలో, దృష్టి లోపం రాకుండా నిరోధించవచ్చు, లేదా ఇంకా గుర్తించటం జరగలేదు...”
ప్రపంచవ్యాప్తంగా కంటి శుక్లం తర్వాత, అంధత్వానికి రెండవ అత్యంత సాధారణ కారణం శుక్లపటల వ్యాధులు. శుక్లపటల సంబంధిత అంధత్వానికి సంబంధించిన సంక్రమణ విధానం (ఎపిడెమియాలజీ) సంక్లిష్టమైనది. శుక్లపటలం మీద మచ్చలు ఏర్పడటానికి దారితీసే అనేక రకాల కంటి వాపులు, వైరల్ పరిస్థితులను కలిగి ఉంటుంది. ఇది చివరికి క్రియాశీల అంధత్వానికి కారణమవుతుంది. దీనికి తోడు, శుక్లపటల వ్యాధి వ్యాప్తి దేశం నుండి దేశానికి మారుతూ ఉంటుంది.





















