చేతి మూడు వేళ్ళు, దీర్ఘ చతురస్రాకారంలో ఉండే తడి బట్ట, తేలికపాటి స్పర్శ. "నేను చాలా జాగ్రత్తగా ఉండాలి."
ఇక్కడ విజయ ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలలో స్థానికంగా తయారుచేసే తీపి వంటకమైన పూతరేకుల తయారీ గురించి మాట్లాడుతున్నారు. జారుగా కలిపిన బియ్యపు పిండితో చేసిన పలుచని రేకులలో బెల్లం పొడి, ముక్కలుగా చేసిన ఎండు ఫలాలు/గింజలు, నెయ్యితో నింపి చక్కగా మడిచి వీటిని తయారుచేస్తారు. ఇవి ఎక్కువగా పండుగల సమయంలో అమ్ముడవుతాయి. ఈ తీపిని తయారుచేయటంలో నైపుణ్యం కలిగిన విజయ ప్రతిరోజూ దాదాపు 200 రేకులను తయారుచేస్తారు. వాటిని స్థానికంగా ఉండే మిఠాయి దుకాణాలవారు తీసుకుంటారు. “నేను పూతరేకులు చేసేటప్పుడు పూర్తిగా ఆ పనిమీదే ఏకాగ్రత పెట్టాలి. నిజంగా ఎవరితోనూ మాట్లాడటానికి ఉండదు,” అని ఆమె PARIకి చెప్పారు.
“పూతరేకులు లేకుండా నా ఇంట్లో జరిగే ఏ పండుగైనా, ఆచారమైనా, ఏదైనా ప్రత్యేక సందర్భమైనా పూర్తికాదు,” అంటారు జి. రామకృష్ణ. ఆత్రేయపురం నివాసి అయిన ఈయన ఆత్రేయపురంలోని కొన్ని దుకాణాలకు ప్యాకింగ్ సామగ్రిని, పెట్టెలను సరఫరా చేస్తుంటారు. “నాకు ఇదంటే చాలా ఇష్టం, ఇది చాలా ఆశ్చర్యకరమైన మిఠాయిలా తోస్తుంది! చూడగానే ఇదేదో కాగితంలాగా కనిపిస్తోంది, కాగితాన్ని తింటున్నామా అనుకుంటాం. కానీ ఒక్కసారి దాన్ని ఇలా కొరకగానే అది మీ నోటిలో కరిగిపోతుంది. ప్రపంచంలో ఇలాంటి మిఠాయి మరేదైనా ఉంటుందని నేననుకోను," సగర్వంగా ప్రకటించారాయన.
ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పండే బియ్యం వలన సున్నితంగా తయారయ్యే ఈ మిఠాయికి ఈ రుచి వస్తుంది. "ఈ బియ్యం జిగటగా ఉంటాయి, కాబట్టి రేకుల తయారీకి తప్ప ఎవరూ దీనిని ఉపయోగించరు" అని రామచంద్రపురం బ్లాక్‌లోని ఆత్రేయపురం గ్రామానికి చెందిన ఈ తీపిని తయారుచేసే కాయల విజయ కోట సత్యవతి చెప్పారు. ఈ ఆత్రేయపురంకు చెందిన పూతరేకులే 2023లో జియోగ్రాఫికల్ ఇండికేటర్ (జిఐ-భౌగోళిక సూచిక) ను అందుకున్నది. విశాఖపట్నంలోని సర్ ఆర్థర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకుల తయారీదారుల సంక్షేమ సంఘానికి జూన్ 14, 2023న జిఐ లభించింది.
రాష్ట్రంలో జిఐ వచ్చిన ఆహార పదార్థాలలో పూతరేకు మూడవది (మిగిలినవి తిరుపతి లడ్డూ, బందరు లడ్డూ). ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళలు, ఆహార పదార్థాలు, వ్యవసాయం వంటి వివిధ కేటగిరీలకు చెందిన 21 ఉత్పత్తులకు జిఐ ఉంది. గత సంవత్సరం పూతరేకుతో పాటు గోవాకు చెందిన బెబింకా మిఠాయి కూడా జిఐ ట్యాగ్‌ను అందుకుంది. గతంలో మురేనాకు చెందిన గజక్, ముజఫర్‌నగర్‌కు చెందిన గూర్లకు కూడా జిఐ లభించింది.




















