అది 2021 జూలై నెలలో పొగమంచు నిండిన ఒక ఉదయం, రైతు శివరామ్ గవారీ, భీమాశంకర్ వన్యప్రాణుల అభయారణ్యం సరిహద్దుల్లో ఉన్న తన పొలం వద్దకు వచ్చి, తన ఐదు గుంఠల (సుమారు 0.125 ఎకరాలు) వరి పంటలో సగం మాయం కావడాన్ని గమనించారు. మిగిలిన పంట నేలకు తొక్కేసి ఉంది..
"నేను ఇంతకు ముందెన్నడూ అలాంటిది చూడలేదు," అని ఆయన చెప్పారు. ఆనాడు పొందిన దిగ్భ్రాంతి ఇంకా ఆయన మనసులో తాజాగా ఉంది. ఆయన అడవిలోకి దారితీసిన జంతువుల పాదముద్రలను అనుసరించగా, అకస్మాత్తుగా గవా (బోస్ గౌరస్, కొన్నిసార్లు ఇండియన్ బైసన్ లేదా అడవిదున్న అని పిలుస్తారు) కనిపించింది. పశు సంబంధిత జాతుల్లో అతి పెద్దదైన అడవిదున్న, చూడటానికి వెగటుపుట్టించేలా ఉంటుంది. మగ అడవిదున్నలు ఆరు అడుగులకు మించిన పొడవు, 500- 1,000 కిలోగ్రాముల మధ్య బరువు ఉంటాయి.
భారీగా ఉండే అడవిదున్నల మంద పొలాలను తొక్కినప్పుడు పంటలు, చిన్న మొక్కలు కూడా పూర్తిగా నాశనం కావడమే కాకుండా పొలంలో పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడతాయి. “గవా ఇప్పటికి మూడేళ్ళుగా ప్రతి పంటకాలంలో నా పైరును నాశనం చేస్తున్నాయి. ఇక వ్యవసాయాన్ని వదిలేయటం తప్ప నాకు గత్యంతరం లేదు," అన్నారు శివరామ్. 2021 నుంచి గవా మంద తిరుగుతూన్న డాఁన్‌లోని తన రేకుల కప్పు ఇంటి ముందు ఆయన కూర్చునివున్నారు.














