అతనికి బంగారాన్ని చూస్తేనే, దాని నాణ్యత తెలిసిపోతుంది. “మీ బంగారు నగని ఓసారి నా చేతిలో పెట్టి చూడండి, అది ఎన్ని క్యారెట్లు అనేది ఇట్టే చెప్పేస్తాను” అని సగర్వంగా చెప్పుకునే అతని పేరు రఫీక్ పాపాబాయి షేక్. “నేనొక జోహరీని” (అతని ఉద్దేశ్యంలో నగలు తయారుచేసేవాడని) అని కూడా అతను చెప్పుకుంటారు. శిరూర్-సతారా రహదారి మీద ఉన్న పడవీ అనే గ్రామంలో మేమతణ్ణి కలిసి, కాసేపు ముచ్చటించినప్పుడు అతనీ మాటన్నారు. అతను త్వరలోనే తెరవబోయే ఒక హోటల్ రూపంలో బహుశా అతని చేతికి మరోసారి బంగారం చిక్కిందేమో అనిపించింది మాకు.
పుణే జిల్లా అంచున ఉన్న దౌండ్ తెహసిల్ మీదుగా వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో మాకీ హోటల్ తారసపడింది. ప్రకాశవంతమైన రంగులతో తళతళలాడుతూ ఓ డబ్బా కొట్టులా ఉన్న దీని పైభాగాన ‘హోటల్ సెల్ఫీ’ అని ఆకుపచ్చ, ఎరుపు రంగులలో రాసివుంది. దీనినో సారి చూసి తీరాలి అనిపించి మేం వెంటనే వెనక్కి మళ్ళి, దాని వద్దకు చేరుకున్నాం.
“నిజానికి నా కొడుకు కోసమని నేనీ హోటల్ తెరిచాను. నేను జోహరీగానే ఉండిపోతాను. కాని, నా కొడుకు కోసం, ఈ పనిలో కూడా ఎందుకు ఓ చేయ్యేసి చూడకూడదు అనిపించింది. ఈ రహదారి పొడవునా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. జనం చాయ్ తాగడానికో, ఏమైనా తినడానికో తరచూ ఇక్కడ ఆగుతుంటారు.” అని రఫీక్ వివరించారు. సాధారణంగా దుకాణాలు రహదారి అంచుకు ఆనుకుని ఉంటాయి. ఇతను మాత్రం అలాకాకుండా తన హోటల్‌ను రహదారి అంచునుండి, కొన్ని గజాల స్థలాన్ని ఖాళీ వదిలి, వెనక్కు కట్టారు. అక్కడ జనం తమ వాహనాలను నిలుపుకోవచ్చు- అచ్చం మేం నిలిపినట్టే.



