అడవిరాజును వేచివుండేలా చేయకండి

సింహాలు వస్తున్నాయి. గుజరాత్ నుండి. ప్రతి ఒక్కరూ వాటి ప్రవేశాన్ని ఎలాంటి కష్టం లేకుండా ముందుకు సాగేలా చేయాలి

మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో ఉన్న గ్రామాలలో, ఇదంతా ఎలా జరుగుతుందో అనే అనిశ్చితి ఉన్నప్పటికీ, అది మంచి విషయంగానే కనిపించింది.

“ఆ పెద్ద పిల్లులు వచ్చాక, ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందుతుంది. మాకు గైడ్‌లుగా ఉద్యోగాలు వస్తాయి. మేం ఈ ప్రదేశంలో దుకాణాలను, తినుబండారాల దుకాణాలను నిర్వహించుకోవచ్చు. మా కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి.” అని కూనో పార్కుకు వెలుపల ఉండే అగరా గ్రామానికి చెందిన 70 ఏళ్ళ రఘులాల్ జాటవ్ మాతో అన్నారు.

"మేం మంచి నాణ్యమైన నీటిపారుదల ఉన్న భూమి, అన్ని వాతావరణాలలోనూ ప్రయాణించే వీలున్న రోడ్లు, గ్రామం మొత్తానికీ విద్యుత్, అన్ని సౌకర్యాలను పొందుతాం" అని రఘులాల్ చెప్పారు

"ఏదైతేనేం, సర్కార్ (ప్రభుత్వం) మాకిచ్చిన హామీ అయితే ఇదే," అని ఆయన అన్నారు.

అందువల్ల పాయరాలోని ప్రజలతో పాటు 24 గ్రామాలలోని దాదాపు 1,600 కుటుంబాలు కూనో నేషనల్ పార్క్‌లోని తమ ఇళ్లను ఖాళీ చేశారు. వీరు ప్రధానంగా సహరియా ఆదివాసులు, దళితులు, పేద ఇతర వెనుకబడిన తరగతులకు (ఒబిసి) చెందినవారు. వారి ప్రవాస ప్రయాణం చాలా హడావుడిగా సాగింది.

ట్రాక్టర్లను తీసుకొచ్చారు. త్వరత్వరగా ఇళ్ళను ఖాళీ చేయాల్సి రావడంతో ఆదివాసులు తాము పోగుచేసి ఉంచుకున్న అనేక తరాలకు చెందిన సంపదను వదిలేసి రావలసివచ్చింది. వారింకా ప్రాథమిక పాఠశాలలను, చేతి పంపులను, బావులను, తరతరాలుగా తాము సాగుచేసిన భూములను కూడా విడిచిపెట్టేశారు. చివరకు పశువులను కూడా వదిలేశారు. ఎందుకంటే అడవిలో ఉన్నట్టు పుష్కలమైన మేత లేకుంటే, పశువుల పోషణ వారికి చాలా భారంగా మారుతుంది.

ఇదంతా జరిగి 23 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళింకా సింహాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.

Raghulal Jatav was among those displaced from Paira village in Kuno National Park in 1999.
PHOTO • Priti David
Raghulal (seated on the charpoy), with his son Sultan, and neighbours, in the new hamlet of Paira Jatav set up on the outskirts of Agara village
PHOTO • Priti David

ఎడమ: 1999 లో కూనో నేషనల్ పార్క్‌ లోని పాయరా గ్రామం నుండి స్థానచలనం చెందినవారిలో రఘులాల్ జాటవ్ కూడా ఉన్నారు. కుడి: అగరా శివార్లలో ఏర్పాటు చేయబడిన కొత్త కుగ్రామమైన పాయరా జాటవ్‌ లో తన కుమారుడు సుల్తాన్‌ తోనూ, ఇరుగుపొరుగువారితోనూ రఘులాల్ ( మంచంపై కూర్చున్నవారు)

"ప్రభుత్వం మాకు అబద్ధం చెప్పింది," తన కొడుకు ఇంటి బయట ఉన్న చార్‌పాయ్‌(మంచం)పై కూర్చుని ఉన్న రఘులాల్ అన్నారు. ఆయనకిప్పుడు కోపం కూడా లేదు. రాష్ట్రం చేసిన వాగ్దానాలను నెరవేరుస్తుందేమోనని ఎదురుచూసి చూసి విసిగిపోయారంతే. దళితుడైన రఘులాల్ లాంటి వేలాదిమంది పేదలు, అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలు తమ భూములనూ, ఇళ్లనూ, జీవనోపాధినీ కూడా వదులుకున్నారు.

అయితే రఘులాల్‌కు జరిగిన నష్టం కూనో నేషనల్ పార్క్‌కు లాభంగా మాత్రం మారలేదు. ఇందులో ఎవరికీ సింహభాగం దక్కలేదు. చివరికి ఆ గొప్ప పిల్లులకు కూడా! ఇంతవరకూ అవి ఇక్కడకు రానేలేదు.

*****

ఒకప్పుడు సింహాలు మధ్య, ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అడవులలో సంచరించేవి. అయితే ఈనాడు, ఆసియాటిక్ సింహం (పాంథెరా లియో లియో) గిర్ అడవులలో మాత్రమే కనిపిస్తుంది. గుజరాత్‌లోని ఈ అడవుల పరిసర ప్రాంతమైన సౌరాష్ట్ర ద్వీపకల్పం చుట్టుపక్కల 30,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కనిపిస్తుంది. ఆ మొత్తం ప్రాంతంలోని ఆరు శాతం కంటే తక్కువ - 1,883 చ.కి.మీ - ప్రాంతమే వాటి చిట్టచివరి సురక్షిత నివాసం. ఇది వన్యప్రాణి జీవశాస్త్రవేత్తలకు, పరిరక్షకులకు చల్లచెమటలు పట్టించే వాస్తవం.

ప్రపంచంలోని ప్రముఖ పరిరక్షణ సంస్థ IUCN, ఇక్కడున్న 674 ఆసియాటిక్ సింహాలను అంతరించిపోతున్న జాతిగా జాబితా చేసింది. వన్యప్రాణి పరిశోధకుడు డాక్టర్. ఫయాజ్ ఎ. ఖుద్సర్ ఇవి ప్రస్తుతం ఉన్న ప్రమాదకర పరిస్థితిని స్పష్టంగా ఎత్తిచూపుతున్నారు. "చిన్న సంఖ్యలో ఉన్న ఒక జీవజాతిని ఒకే ప్రదేశానికి పరిమితం చేస్తే, అది అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని పరిరక్షణ జీవశాస్త్రం స్పష్టంగా సూచిస్తుంది" అని ఆయన చెప్పారు.

ఈ సింహాలు ఎదుర్కొనే అనేక ప్రమాదాలను గురించి ఖుద్సర్ సూచిస్తున్నారు. ఈ ప్రమాదాలలో కీనైన్ డిస్టెంపర్ వైరస్ వ్యాప్తి, అడవుల్లో చెలరేగే మంటలు, వాతావరణ మార్పులు, స్థానిక తిరుగుబాట్లు, ఇంకా మరెన్నో ఉన్నాయి. ఇటువంటి ప్రమాదాలు కొద్ది సంఖ్యలో ఉన్న ఈ వన్యప్రాణులను వేగంగా నాశనం చేయగలవని ఆయన చెప్పారు. మన దేశ అధికార చిహ్నాలుగా, రాజముద్రలుగా సింహం బొమ్మలే ఆధిపత్యం చెలాయిస్తున్నందున ఇవి అంతరించిపోవటం భారతదేశానికి ఒక పీడకల లాంటి విషయం.

సింహాలకు అదనపు ఆవాసంగా కూనో తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఖుద్సర్ నొక్కిచెప్పారు. "(సింహాల) జన్యు శక్తిని ప్రోత్సహించడానికి, వాటి చారిత్రక భౌగోళిక పరిధులలో కొన్ని సింహాల గుంపులను తిరిగి ప్రవేశపెట్టడం చాలా అవసరం." అని ఆయన అన్నారు.

A police outpost at Kuno has images of lions although no lions exist here.
PHOTO • Priti David
Map of Kuno at the forest office, marked with resettlement sites for the displaced
PHOTO • Priti David

ఎడమ: కూనో వద్ద ఉన్న పోలీసు అవుట్‌ పోస్ట్‌. ఇందులో సింహాల బొమ్మలు ఉన్నప్పటికీ, సింహాలయితే లేవు. కుడి: అటవీ కార్యాలయం వద్ద, నిర్వాసితుల కోసం పునరావాస ప్రదేశాలను గుర్తుపెట్టి ఉన్న కూనో రేఖాచిత్ర పటం

ఆలోచన చాలా ముందుగానే వచ్చినప్పటికీ, 1993-95లోనే ఒక స్థలమార్పిడి ప్రణాళికను రూపొందించారు. ఆ ప్రణాళిక ప్రకారం, కొన్ని సింహాలను గిర్ నుండి అక్కడికి 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూనోకు తరలిస్తారు. తొమ్మిది అనువైన ప్రదేశాల జాబితా నుండి, కూనో ఈ ప్రణాళికకు బాగా సరిపోతుందని నిర్ధారించినట్టు, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) డీన్ డాక్టర్ యాదవేంద్ర ఝాలా చెప్పారు.

WII అనేది పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC)కూ, రాష్ట్ర వన్యప్రాణి విభాగానికీ చెందిన సాంకేతిక విభాగం. సరిస్కా, పన్నాలలో పులులను, బాంధవ్‌గఢ్‌లో అడవిదున్నలను, సాత్పురాలో బారాసింగ(12 కొమ్ములున్న దుప్పి)ను తిరిగి ప్రవేశపెట్టడంలో ఈ విభాగం ముఖ్యమైన పాత్రను పోషించింది.

"కూనో మొత్తం పరిమాణం (సుమారు 6,800 చ. కి.మీ. విస్తీర్ణంలో వరుసక్రమంలో విస్తరించి ఉన్న ఆవాసం), సాపేక్షికంగా తక్కువ స్థాయిలో ఉండే మానవ కదలికలు, దాని గుండా వెళ్లే రహదారులు లేకపోవడం- ఇవన్నీ దీనిని చక్కటి ప్రదేశంగా మార్చాయి" అని పరిరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ రవి చెల్లం చెప్పారు. ఈయన గత నాలుగు దశాబ్దాలుగా ఈ శక్తివంతమైన క్షీరదాలను గమనిస్తున్నారు.

ఇతర సానుకూల అంశాలు: “గడ్డి భూములు, వెదురు, తడి నిలిచే భూభాగాల వంటి మంచి నాణ్యత, వైవిధ్యం ఉన్న ఆవాసాలు. ఆపైన చంబల్ నదికి నిరంతర నీటి ప్రవాహం కలిగివుండే భారీ ఉపనదులు, ఆహారం కోసం విభిన్న జాతుల జంతుజాలం ఉన్నాయి. ఇవన్నీ కలిగిన ఈ అభయారణ్యం సింహాలకు ఆతిథ్యం ఇవ్వడానికి చక్కగా సరిపోతుంది,” అని ఆయన చెప్పారు.

అయితే, మొదట అక్కడ నివాసముంటున్న వేలాదిమంది ప్రజలను కూనో అభయారణ్యం నుండి తరలించవలసి ఉంటుంది. అలా వారు ఆధారపడివున్న అడవుల నుండి కొన్ని మైళ్ళ దూరానికి, వారిని ఉన్నచోటు నుంచి తొలగించి, తరలించడానికి మరికొన్ని సంవత్సరాలు పట్టింది.

ఇదంతా జరిగిన 23 ఏళ్ళ తర్వాత కూడా సింహాలింకా అక్కడికి రానేలేదు.

*****

An abandoned temple in the old Paira village at Kuno National Park
PHOTO • Priti David
Sultan Jatav's old school in Paira, deserted 23 years ago
PHOTO • Priti David

ఎడమ: కూనో నేషనల్ పార్క్ వద్ద ఉన్న పాత పాయరా గ్రామంలో పాడుబడిన ఆలయం. కుడి: పాయరాలో 23 సంవత్సరాల క్రితమే నిర్జనమైన సుల్తాన్ జాటవ్ పాత పాఠశాల

కూనోలోని 24 గ్రామాలలో నివాసముండేవారికి, అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి ఉంటుందనే సూచన మొదటిసారిగా 1998లో వచ్చింది. ఈ అభయారణ్యం మానవ రహిత జాతీయ ఉద్యానవనంగా మారుతుందని అక్కడి అటవీ రేంజర్లు మాట్లాడటం ప్రారంభించడంతో ఇది మొదలయింది.

“మేం (గతంలో) సింహాలతో కలిసి జీవించామని చెప్పాం. పులులు, ఇతర జంతువులతో కూడా. అలాంటిది, మేం ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి?" అని మంగు ఆదివాసీ అడుగుతారు. 40 ఏళ్ల వయస్సున్న ఆయన ఒక సహరియా ఆదివాసీ. అడవిని ఖాళీచేసి వచ్చేసినవారిలో ఈయన కూడా ఉన్నారు.

1999 ప్రారంభంలో, గ్రామస్తులను ఒప్పించడం కోసం వేచి చూడకుండానే, అటవీ శాఖ కూనో సరిహద్దుకు వెలుపల ఉన్న పెద్ద భూభాగాలను ఖాళీ చేయడం ప్రారంభించింది. చెట్లను నరికి, జె.సి. బామ్‌ఫోర్డ్ ఎక్స్‌కవేటర్ల (జెసిబిలు) సాయంతో భూమిని చదును చేశారు.

"ఈ పునరావాసం స్వచ్ఛందంగా జరిగింది, నేను దాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించాను" అని జె.ఎస్. చౌహాన్ అన్నారు. ఈయన 1999లో కూనో జిల్లా అటవీ అధికారిగా పనిచేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ముఖ్య అటవీ సంరక్షణ ప్రధానాధికారి (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ - PCCF) గానూ, వన్యప్రాణి సంరక్షకుడుగానూ పనిచేస్తున్నారు.

స్థానచలనం అనే చేదు మందుబిళ్ళను తీయబరచడం కోసం, ప్రతి కుటుంబానికీ రెండు హెక్టార్ల దున్నిన, సాగునీటి వసతి ఉన్న భూమి లభిస్తుందని చెప్పారు. 18 ఏళ్లు పైబడిన మగ పిల్లలందరూ కూడా దీనికి అర్హులవుతారు. ఇంకా కొత్త ఇల్లు కట్టుకోవడానికి రూ. 38,000, వారి వస్తువులను రవాణా చేయడానికి రూ. 2,000 ఇస్తారని చెప్పారు. వారు నివాసముండే కొత్త గ్రామాలలో అన్ని విధాలైన పౌర సదుపాయాలు ఉంటాయని హామీ ఇచ్చారు.

ఆ తర్వాత పాల్‌పుర్ పోలీస్ స్టేషన్‌ని తొలగించారు. "ఈ ప్రాంతంలో బందిపోటు దొంగల భయం ఉన్నందున వాళ్ళు అలారం గంటలను మాత్రం వదిలేసి వెళ్ళారు," అని 43 ఏళ్ల సయ్యద్ మెరాజుద్దీన్ అన్నారు. ఈయన, ఆ సమయంలో ఆ ప్రాంతంలో పనిచేసిన ఒక యువ సామాజిక కార్యకర్త.

ఈ ప్రవాహంలా వచ్చి చేరుతున్న మనుషులకు సంబంధించి ఆతిథ్య గ్రామాలను సంప్రదించలేదు, పరిహారమూ ఇవ్వలేదు. ఇప్పుడు చదును చేయబడిన అడవులలోకి వెళ్ళటానికి వీలులేకపోవడం వలన కలిగిన నష్టానికి కూడా ఎటువంటి పరిహారం ఇవ్వలేదు

వీడియో చూడండి: కూనో ప్రజలు: ఎప్పటికీ రాని సింహాల కోసం స్థానచలనం చెందారు

1999 వేసవికాలం వచ్చింది. కూనోవాసులు తమ తర్వాతి పంటను నాటేందుకు సిద్ధం కావడానికి బదులుగా ఆ ప్రదేశాన్ని వదిలివెళ్ళటం మొదలయింది. వారు ఆగరా, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకుని నీలం రంగు పాలిథిన్ పట్టాల గుడిసెలలో తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. రాబోయే 2-3 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడే నివసించబోతున్నారు.

“మొదట్లో రెవెన్యూ శాఖ భూమికి కొత్త యజమానులను గుర్తించకపోవడంతో కొత్త రికార్డులను ఇవ్వలేదు. ఆరోగ్యం, విద్య, నీటిపారుదల వంటి ఇతర శాఖలు కూడా ఇక్కడికి మారడానికి 7-8 సంవత్సరాలు పట్టింది,” అని మెరాజుద్దీన్ చెప్పారు. ఆయన తర్వాత ఆధార్‌శిలా శిక్షా స‌మితి కార్యదర్శి అయ్యారు. ఇది, ఆతిథ్య గ్రామమైన ఆగరాకు నిర్వాసితులై వచ్చిన సామాజిక వర్గం కోసం పనిచేస్తూ, పాఠశాలను నడుపుతున్న ఒక లాభాపేక్షలేని సంస్థ.

ఇరవైమూడు సంవత్సరాల తరువాత, "గ్రామాన్ని తరలించడం అటవీ శాఖకు చెందిన పని కాదు. పునరావాసం కల్పించే బాధ్యతను ప్రభుత్వం సొంతంగా చేపట్టాలి. అప్పుడే నిర్వాసిత వ్యక్తికి పూర్తి ప్యాకేజీ లభిస్తుంది. అన్ని ప్రభుత్వ శాఖలూ ప్రజలకు చేరువ కావాలి. ఇది మా కర్తవ్యం,” అని పిసిసిఎఫ్ చౌహాన్ ఒప్పుకున్నారు. ఇంకా నెరవేర్చని వాగ్దానాలపై వ్యాఖ్యానించమని అడిగినప్పుడు, ఆయనిలా చెప్పారు.

శివ్‌పూర్ జిల్లా, విజయ్‌పూర్ తహసీల్ ‌లోని ఉమ్రి, ఆగరా, అరోడ్, చెంతిఖేదా, దేవరీ గ్రామాలకు 24 నిర్వాసిత గ్రామాల నుండి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. వారిలా రావటానికి సంబంధించి ఈ అతిథేయ గ్రామాలతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదు, పరిహారమూ ఇవ్వలేదు. ఇప్పుడు అడవులను చదును చేసేయడం వలన వీరు తమ జీవనావసరాల కోసం అడవికి వెళ్ళే అవకాశాన్ని కూడా కోల్పోయారు. దానివల్ల జరిగిన నష్టానికి కూడా ఎటువంటి పరిహారం ఇవ్వలేదు.

రామ్ దయాళ్ జాటవ్ (50), అతని కుటుంబం జూన్ 1999లో ఆగరా వెలుపల ఉన్న పాయరా జాటవ్ కుగ్రామానికి మారారు.కూనో పార్క్‌లోని అసలైన పాయరా నివాసి అయిన ఈయన ఈ నిర్ణయం పట్ల ఇప్పటికీ విచారం వ్యక్తం చేస్తున్నారు. “పునరావాసం మాకేం మంచి చేయలేదు. మేం చాలా సమస్యలను ఎదుర్కొన్నాం, ఇప్పటికీ ఎదుర్కుంటూనే ఉన్నాం. నేటికీ మా బావుల్లో నీరు లేదు, మా పొలాలకు కంచె లేదు. మా వైద్యపరమైన అత్యవసర ఖర్చులను మేమే భరించాలి, ఉపాధి పొందడం కష్టంగా మారింది. అంతే కాకుండా ఇంకా ఇతర సమస్యలు చాలానే ఉన్నాయి,” అని ఆయన చెప్పారు. "అవి జంతువులకు మాత్రమే మేలు చేశాయి కానీ మాకే మేలూ చేయలేదు" అంటున్నపుడు ఆయన స్వరం క్షీణించింది.

Ram Dayal Jatav regrets leaving his village and taking the resettlement package.
PHOTO • Priti David
The Paira Jatav hamlet where exiled Dalit families now live
PHOTO • Priti David

ఎడమ: రామ్ దయాళ్ జాటవ్ తన గ్రామాన్ని విడిచిపెట్టి, పునరావాస ప్యాకేజీని తీసుకున్నందుకు విచారపడుతున్నారు. కుడి: ప్రవాసం వచ్చిన దళిత కుటుంబాలు ప్రస్తుతం నివాసముంటున్న పాయరా జాటవ్ కుగ్రామం

గుర్తింపును కోల్పోవడం అనేది చాలా గట్టి దెబ్బ అని రఘులాల్ జాటవ్ అన్నారు: "ఇప్పటికి 23 సంవత్సరాలు గడిచిపోయాయి; మాకు వాగ్దానం చేసిన వాటిని పొందకపోవటం అటుంచి, మా స్వతంత్ర గ్రామసభలను కూడా ఇక్కడ ఉన్న వాటిలో విలీనం చేసేశారు."

తన సొంత పాయరాతో సహా 24 గ్రామాల వర్గీకరణ గురించి ఆయన పోరాడుతున్నారు. రఘులాల్ చెప్పినదాని ప్రకారం, 2008లో కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటయినపుడు రెవెన్యూ గ్రామంగా తన హోదాను పాయరా కోల్పోయింది. ఆ గ్రామానికి చెందినవారిని ఇక్కడున్న నాలుగు కుగ్రామాలలోని పంచాయతీలలో చేర్చారు. "ఇలా మేం మా పంచాయతీని కోల్పోయాం."

ఈ బాధను తాను పరిష్కరించేందుకు ప్రయత్నించానని పీసీసీఎఫ్ చౌహాన్ చెప్పారు. “వారి స్వంత పంచాయితీ ని తిరిగి వారికి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వంలోని చాలామంది వ్యక్తులను నేను సంప్రదించాను.'మీరిలా చేసి ఉండకూడద'ని నేను వారికి (రాష్ట్ర విభాగాలకు) చెప్తూనే ఉన్నాను. ఈ సంవత్సరం కూడా నేను ప్రయత్నించాను,” అని అతను చెప్పారు.

వారికి తమదైన స్వంత పంచాయితీ లేకపోతే, స్థానచలనం చెందినవారు తమ గొంతులను వినిపించడం కోసం సంక్లిష్టమైన న్యాయ, రాజకీయ పోరాటాన్ని ఎదుర్కొంటారు.

*****

స్థానచలనం జరిగిన తర్వాత, “మాకు అడవికి వెళ్ళే వీలు లేకుండాపోయింది. ఇంతకుముందు అడవి నుంచి గడ్డిని తెచ్చి, పశువుల మేతగా అమ్మేవాళ్లం. కానీ ఇప్పుడు మాకు దొరికే గడ్డి ఒక్క ఆవుకు కూడా సరిపోవడం లేదు," అని మంగు ఆదివాసీ అన్నారు. ఇంకా పశువులు మేసేందుకు గడ్డి భూములు లేకపోవడం, కట్టెలు, కలపేతర అటవీ ఉత్పత్తులు లభించకపోవటం వంటి మరిన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

“పశువులకు కలగబోయే (అడవికి వస్తున్నాయనుకున్న సింహాల వలన) నష్టాల గురించి అటవీ శాఖ ఆందోళన చెందడంతో ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టాల్సివచ్చింది. కానీ చివరికి, పశువులకు బయట తినడానికి మేత లేకపోవడంతో అవి అడవిలోనే మిగిలిపోయాయి." అంటూ పరిస్థితుల్లోని వైపరీత్యాన్ని సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ అస్మితా కాబ్రా ఎత్తి చూపారు.

Mangu Adivasi lives in the Paira Adivasi hamlet now.
PHOTO • Priti David
Gita Jatav (in the pink saree) and Harjaniya Jatav travel far to secure firewood for their homes
PHOTO • Priti David

ఎడమ: ప్రస్తుతం పాయరా ఆదివాసీ కుగ్రామంలో నివసిస్తున్న మంగు ఆదివాసి. కుడి: గీతా జాటవ్ ( గులాబీ రంగు చీరలో), హర్‌ జనియా జాటవ్ తమ ఇంటి వాడకానికి కట్టెల కోసం చాలా దూరమే ప్రయాణించారు

సాగు కోసం భూమిని చదును చేయడంతో అడవిలోని వృక్షాల వరుస మరింత దూరానికి జరిగింది. “ఇప్పుడు మేం కట్టెల కోసం 30-40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. మాకు తినటానికి ఆహారం ఉంది, కానీ దానిని వండడానికి కట్టెలు లేవు,” అని 23 ఏళ్ల ఉపాధ్యాయుడు, అహర్వానీ నివాసి అయిన కేదార్ ఆదివాసి చెప్పాడు. నిర్వాసితులైన సహరియాలు పునరావాసం పొందిన గ్రామాలలో అహర్వానీ కూడా ఒకటి.

50ల వయసులో ఉన్న గీత, 60లలో ఉన్న హర్జనియాలకు వివాహం అయినప్పుడు చాలా చిన్నవాళ్ళు. శివ్‌పుర్ జిల్లా, కరాహల్ తహసిల్ ‌లో ఉన్న తమ ఇళ్లను విడిచిపెట్టి ఈ అభయారణ్యంలో నివసించడానికి వచ్చారు. “(ఇప్పుడు) మేం కర్రల కోసం కొండలు ఎక్కాలి. అందుకు మాకు ఒక రోజంతా పడుతుంది. తరచుగా అటవీ శాఖవాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటుంటారు. కాబట్టి మేం చాలా మెలకువగా వ్యవహరించాల్సివుంటుంది.” అని గీత చెప్పారు.

తొందరగా పని ముగించాలనే వారి హడావిడిలో, అటవీ శాఖ చాలా విలువైన చెట్లనూ పొదలనూ నాశనంచేసిందని కాబ్రా గుర్తుచేసుకున్నారు. "జీవవైవిధ్యానికి జరిగే నష్టం గురించి ఎన్నడూ లెక్కకు రానేలేదు," అన్నారామె. ఈ సామాజిక శాస్త్రవేత్త కూనో, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగిన స్థానచలనం, పేదరికం, జీవనోపాధి భద్రతపై పిఎచ్‌డి చేశారు. పరిరక్షణ, స్థానచలన నిపుణురాలిగా, ఆమెకు ఈ ప్రాంతంలో గొప్ప పేరు ఉంది.

బంక, జిగురులు (రెసిన్స్) సేకరించేందుకు చిర్ (పైన్ జాతి చెట్టు), ఇంకా ఇతర చెట్లను చేరుకోలేకపోవడం ఒక ప్రధానమైన ప్రతికూలత. చిర్ గోందు స్థానిక మార్కెట్‌లో రూ. 200కు అమ్ముడవుతుంది. ప్రతి కుటుంబం దాదాపు 4-5 కిలోల రెసిన్‌ని సేకరించగలుగుతుంది. “అనేక రకాల గోందు రెసిన్లు ఉన్నట్టే, తెందు (తునికి) ఆకులు (వీటితో బీడీలు తయారు చేస్తారు) కూడా పుష్కలంగా ఉండేవి. అలాగే, బేల్ (వెలగ) వంటి పండ్లు, అచార్ , మహువా ( విప్ప ), తేనె, దుంపల వంటివి కూడా. ఇవన్నీ మాకు తిండి, బట్టలనిస్తాయి. ఒక కిలో గోందు ను మేం ఐదు కిలోల బియ్యానికి మార్చుకోవచ్చు,” అని కేదార్ చెప్పారు.

ఇప్పుడు కేదార్ తల్లి, కుంగై ఆదివాసి వంటి చాలామందికి అహర్వానీలో వర్షాధారమైన కొద్ది బిఘాల భూమి మాత్రమే ఉంది. దాంతో పని కోసం ఏటా మురెనా, ఆగ్రా వంటి నగరాలకు వలస వెళ్లవలసి వస్తోంది. వాళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని నెలల పాటు అక్కడ భవన నిర్మాణ ప్రదేశాలలో పని చేస్తారు. "ఇక్కడ వ్యవసాయ పనులు అందుబాటులో లేని సమయాల్లో మేం పది లేదా 20 మందిమి కలిసి పనులకు వెళ్తాం" అని 50ల వయస్సులో ఉన్న కుంగై చెప్పారు.

Kedar Adivasi and his mother, Kungai Adivasi, outside their home in Aharwani, where displaced Sahariyas settled.
PHOTO • Priti David
Large tracts of forests were cleared to compensate the relocated people. The loss of biodiversity, fruit bearing trees and firewood is felt by both new residents and host villages
PHOTO • Priti David

ఎడమ: స్థానచలనం చెందిన సహరియాలు స్థిరపడ్డ అహర్వానీలోని వారి ఇంటి వెలుపల కేదార్ ఆదివాసి, అతని తల్లి కుంగై ఆదివాసి. కుడి: పునరావాసం పొందిన ప్రజలకు పరిహారం చెల్లించేందుకు పెద్ద ఎత్తున అడవులను నరికివేశారు. దీనివలన జీవవైవిధ్యాన్నీ, ఫలాలను ఇచ్చే చెట్లనూ, వంటచెరకునూ నష్టపోవడాన్ని కొత్తగా వచ్చిచేరిన నిర్వాసితులతో పాటు, ఆతిథ్య గ్రామాలు కూడా అనుభవిస్తున్నాయి

*****

ఆగస్టు 15, 2021న ఎర్రకోట నుండి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ‘ ప్రాజెక్ట్ లయన్ ’ను ప్రకటించారు. ఇది "దేశంలోని ఆసియాటిక్ సింహాల భవిష్యత్తును సురక్షితం చేస్తుంది" అని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింహాలను బదిలీ చేయాలని పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అది జరిగిపోవాలి, "ఈరోజు నుండి 6 నెలల వ్యవధిలో" అని కోర్టు పేర్కొంది. ఈ కారణాన్నే -దేశంలోని ఆసియాటిక్ సింహాల భవిష్యత్తుకు భద్రత కల్పించడం - ఎర్రకోట నుండి చేసిన ప్రసంగంలో ఉదహరించారు. అప్పుడు, ఇప్పుడు కూడా కొన్ని సింహాలను కూనోకు పంపాలనే ఆదేశాన్ని పాటించడంలో గుజరాత్ ప్రభుత్వ వైఫల్యాన్ని గురించి మాత్రం ఎటువంటి వివరణా లేదు.

గుజరాత్ అటవీ శాఖ వెబ్ సైట్ కూడా సింహాల బదిలీపై మౌనంగా ఉంది. MoEFCC 2019లో చేసిన పత్రికా ప్రకటన లో ‘ఏషియాటిక్ లయన్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్’ కోసం రూ. 97.85 కోట్ల నిధులను ప్రకటించింది. కానీ అందులో గుజరాత్ రాష్ట్రాన్ని మాత్రమే ప్రస్తావించారు.

ఢిల్లీకి చెందిన ఒక సంస్థ 2006లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి (పిల్-PIL) ప్రతిస్పందనగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడి ఏప్రిల్ 15, 2022కి తొమ్మిది సంవత్సరాలయింది. "కొన్ని ఆసియాటిక్ సింహాల బృందాలను కూనోకు పంపే విషయంలో గుజరాత్ ప్రభుత్వానికి దిశానిర్దేశం" చేయాలని ఈ పిల్ కోరింది.

“సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన తీర్పు తర్వాత, కూనోలో సింహాలను తిరిగి ప్రవేశపెట్టడాన్ని పర్యవేక్షించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. అయితే గత రెండున్నరేళ్లుగా ఈ నిపుణుల కమిటీ సమావేశం కాలేదు. గుజరాత్ ఈ కార్యాచరణ ప్రణాళికను అంగీకరించలేదు,” అని WII కి చెందిన ఝాలా అన్నారు.

In January 2022, the government announced that African cheetahs would be brought to Kuno as there were no Asiatic cheetahs left in India.
PHOTO • Priti David
A poster of 'Chintu Cheetah' announcing that cheetahs (African) are expected in the national park
PHOTO • Priti David

ఎడమ: జనవరి 2022 లో, భారతదేశంలో ఆసియాటిక్ చిరుతలు మిగిలి లేనందున ఆఫ్రికన్ చిరుతలను కూనోకు తీసుకువస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కుడి: జాతీయ ఉద్యానవనంలో చిరుతలు ( ఆఫ్రికన్) వస్తాయని ప్రకటించే ' చింటూ చిరుత' పోస్టర్

"ఆఫ్రికన్ చిరుతలను కూనోలోకి ప్రవేశపెట్టాలని  MoEFCC ఇచ్చిన ఆదేశం చట్టం దృష్టిలో నిలబడదు, దానిని రద్దు చేస్తున్నాం," అని అదే సుప్రీమ్ కోర్టు తీర్పు చెప్పినప్పటికీ, ఈ సంవత్సరం ఆఫ్రికన్ చిరుతలు వచ్చే ప్రదేశంగా కూనోని పేర్కొన్నారు.

ప్రాజెక్ట్ లయన్‌పై 2020లో వచ్చిన నివేదిక సూచించినట్లుగా, పర్యావరణ, వన్యప్రాణి పరిరక్షకులు చేసిన హెచ్చరికలు, ఇప్పటికే నిజమవుతున్నాయి. WII, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాల ఈ నివేదిక పరిస్థితిని గురించి చాలా ఆందోళనను కలిగిస్తుంది. "గిర్‌లో ఇటీవలి కాలంలో బబీజియోసిస్, సిడివి (CDV- కీనైన్ డిస్టెంపర్ వైరస్) వ్యాప్తి చెందడం వల్ల గత రెండేళ్లలో కనీసం 60 కంటే ఎక్కువ సింహాలు చనిపోయాయి" అని నివేదిక చెబుతోంది.

వన్యప్రాణి జీవశాస్త్రవేత్త రవి చెల్లం మాట్లాడుతూ, "మానవ అహంకారం మాత్రమే ఈ సింహాల ప్రదేశాల మార్పును ఆపుతోంది," అన్నారు. స్థానచలనానికి తగిన ప్రదేశాలను నిర్ణయించడంలో, ఉన్నత న్యాయస్థాన అటవీ బెంచ్‌కు, నిపుణులైన శాస్త్రీయ సలహాదారుగా ఈయన పనిచేశారు. పర్యావరణ, వన్యప్రాణి పరిరక్షణ శాస్త్రవేత్తగా, మెటాస్ట్రింగ్ ఫౌండేషన్ CEOగా ఉన్న చెల్లం, సింహాలు స్థానచలనం చెందడాన్ని చూడటం కోసం వేచి ఉన్నారు.

"సింహాలిప్పుడు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి, ఇప్పుడు వాటి సంఖ్య కూడా పెరిగింది. కానీ దురదృష్టవశాత్తూ వాటి పరిరక్షణలో ఎప్పటికీ విరామం తీసుకోవడమంటూ ఉండదు- ముఖ్యంగా అంతరించిపోతున్న జాతుల విషయంలో. ఎందుకంటే,  ప్రమాదాలు ఎప్పుడూ ఉంటూనేవుంటాయి. ఇది శాశ్వతమైన జాగరూకతకు సంబంధించిన శాస్త్రం” అని బయోడైవర్సిటీ కొలాబరేటివ్‌లో సభ్యుడు కూడా అయిన చెల్లం చెప్పారు.

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: జాతీయ ఉద్యానవనంలో పాత పాయరా గ్రామం సైన్ బోర్డు. కుడి: ఖాళీ అయిపోయిన గ్రామంలోని చాలా ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయి, కానీ రంగులు వేసిన తలుపు ఇప్పటికీ నిలిచి ఉంది

మనుష్య్ కో భగా దియా పర్ షేర్ నహీ ఆయా ! (మనుషులను తరిమేశారు, కానీ సింహాలు మాత్రం రాలేదు)”

కూనోలో తన ఇంటిని పోగొట్టుకున్నందుకు మంగు ఆదివాసి జోకులు వేస్తుంటారు, కానీ అతని స్వరంలో నవ్వు లేదు. ప్రభుత్వం తన వాగ్దానాలను నెరవేర్చటమో, లేదా తమను తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోనివ్వడమో చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన నిరసనలో పాల్గొని అతను తలపై కొన్ని దెబ్బలు కూడా తగిలించుకున్నారు. "తిరిగి వెళ్ళిపోవాలని మేం చాలాసార్లు అనుకున్నాం."

ఆగష్టు 15, 2008న జరిగిన ఈ నిరసన, సరైన నష్టపరిహారం కోసం గట్టిగా ఒత్తిడిపెట్టేందుకు చేసిన ఆఖరి ప్రయత్నం. “(అప్పుడు) మాకు ఇచ్చిన భూమిని వదిలివేయాలని మేం నిర్ణయించుకున్నాం. అలాగే మా పాత భూమిని తిరిగి పొందాలని కూడా కోరుకున్నాం. స్థానచలనం చెందిన 10 ఏళ్లలోపు తిరిగి వెళ్లేందుకు అనుమతించే చట్టం ఒకటి ఉందని మాకు తెలుసు” అని రఘులాల్ చెప్పారు.

ఆ అవకాశాన్ని కోల్పోయిన రఘులాల్ తన ప్రయత్నాలను మానలేదు. సొంత డబ్బునూ, సమయాన్నీ వెచ్చించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. జిల్లా, తహసీల్ కార్యాలయాలకు పలుమార్లు వెళ్లారు. వారి పంచాయితీ కేసును గురించి తన వాదన వినిపించేందుకు అతను భోపాల్‌లోని ఎన్నికల సంఘం వద్దకు కూడా వెళ్ళారు. కానీ ఫలితమేమీ లేదు.

రాజకీయ స్వరం లేకపోవడం వల్ల స్థానచలనం చెందినవారిని విస్మరించడం, వారిని గొంతెత్తకుండా చేయడం సులభం అయింది. “మేమెలా ఉన్నామో, మాకేవైనా సమస్యలు ఉన్నాయేమో అని ఎవరూ మమ్మల్ని అడగరు. ఇక్కడికి ఎవరూ రారు. మేమే ఫారెస్ట్‌ ఆఫీసుకు వెళితే అక్కడ అధికారులెవరూ కనిపించరు," అని రామ్‌ దయాళ్ అన్నారు. "మేం వారిని కలిసినప్పుడు, వెంటనే మా పని చేస్తామని వాళ్ళు మాకు హామీ ఇస్తారు. కానీ 23 ఏళ్లుగా ఏమీ చేయలేదు."

ముఖచిత్రం: పాయరాలోని తన కుటుంబానికి చెందిన పాత ఇంటి స్థలంలో కూర్చున్న సుల్తాన్ జాటవ్. ఆ ఇల్లు ఇప్పుడు లేదు.

కథనాన్ని పరిశోధించడంలో, అనువాదం చేయడంలో అమూల్యమైన సహాయాన్ని అందించినందుకు సౌరభ్ చౌధురికి రిపోర్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Priti David

ପ୍ରୀତି ଡେଭିଡ୍‌ ପରୀର କାର୍ଯ୍ୟନିର୍ବାହୀ ସମ୍ପାଦିକା। ସେ ଜଣେ ସାମ୍ବାଦିକା ଓ ଶିକ୍ଷୟିତ୍ରୀ, ସେ ପରୀର ଶିକ୍ଷା ବିଭାଗର ମୁଖ୍ୟ ଅଛନ୍ତି ଏବଂ ଗ୍ରାମୀଣ ପ୍ରସଙ୍ଗଗୁଡ଼ିକୁ ପାଠ୍ୟକ୍ରମ ଓ ଶ୍ରେଣୀଗୃହକୁ ଆଣିବା ଲାଗି ସ୍କୁଲ ଓ କଲେଜ ସହିତ କାର୍ଯ୍ୟ କରିଥାନ୍ତି ତଥା ଆମ ସମୟର ପ୍ରସଙ୍ଗଗୁଡ଼ିକର ଦସ୍ତାବିଜ ପ୍ରସ୍ତୁତ କରିବା ଲାଗି ଯୁବପିଢ଼ିଙ୍କ ସହ ମିଶି କାମ କରୁଛନ୍ତି।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Sudhamayi Sattenapalli