మేము ఆలస్యంగా వెళ్లాము. “గణపతి బాల యాదవ్ రెండుసార్లు ఈ ఊరి వైపు, మీకోసం వచ్చాడు.” అన్నాడు సంపత్ మోరే, శిరగావ్ లోని మా జర్నలిస్ట్ మిత్రుడు. “అతను రెండు సార్లు తిరిగి అతని స్వంత ఊరు రామపుర్ కి వెళ్ళిపోయాడు. ఇక మూడోసారి మీరు చేరారు అని చెబితే వస్తాడు.” ఈ రెండు ఊర్లు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గణపతిదేవ్ సైకిల్ మీదే ఈ దూరం అంతా ప్రయాణిస్తాడు. కానీ మూడు సార్లు వచ్చివెళ్లడమంటే 30 కిలోమీటర్లు సైకిల్ మీద తిరగడమే, అది కూడా మే నెల మధ్యలో, మధ్యాహ్నం పూట, పాడైపోయిన రోడ్డు మీద, పాతికేళ్ల వయసున్న పాత సైకిల్ మీద. ఇక ఆ సైకిల్ నడిపే మనిషి వయసు, 97 ఏళ్ళు.
మహారాష్ట్ర లోని సాంగ్లీ జిల్లా లో కడేగావ్ బ్లాక్ లో శిరగావ్ లో ఉన్న మోరే తాతగారింట్లో మధ్యాహ్న భోజనానికి సిద్ధపడుతుండగా, గణపతి బాల యాదవ్ అలవోకగా తన సైకిల్ మీద వచ్చేశాడు. అంత దూరం ఎండలో అతన్ని రప్పించినందుకు నేను చాలా క్షమాపణలు కోరాను కానీ అతను అర్థం కానట్లు నా వైపు చూశాడు. “పర్లేదు”, అని మెత్తని స్వరంలో, చక్కని చిరునవ్వుతో అన్నాడు. “నేను నిన్న మధ్యాహ్నం విటాలో ఒక పెళ్లికి వెళ్లాను. అక్కడకి కూడా నా సైకిల్ మీదనే. నేను అలానే తిరుగుతాను, ” రామాపూర్ నుండి విటాకు వెళ్లిరావడం అంటే 40 కిలోమీటర్ల దూరం సైకిల్ నడిపినట్లు. పైగా ముందు రోజు వాతావరణం ఇంకా వేడిగా, ఇంచుమించుగా 45 డిగ్రీల సెల్సీయస్ దాకా ఉంది.
“ఒకటి రెండు సంవత్సరాల క్రిందట ఈయన 150 కిలోమీటర్ల దూరం లో ఉన్న పాంథర్ పూర్ కి సైకిల్ పై వెళ్లి వచ్చాడు.” అన్నాడు సంపత్ మోరే. “ఇప్పుడు అంత దూరాలు వెళ్లడం లేదు.”







