సానియా ములాణీకి మొట్టమొదటి వర్షాల జల్లు అనగానే తాను పుట్టినపుడు పదిమందీ చెప్పిన జోస్యం చటుక్కున గుర్తుకొస్తుంది.
2005 జూలై నెలలో పుట్టింది సానియా. ఆమె పుట్టడానికి వారం ముందే వరద బీభత్సం ఆ ప్రాంతాన్ని ముంచెత్తి, వెయ్యి ప్రాణాలను బలిగొనింది. రెండు కోట్ల మంది మహరాష్ట్రవాసుల జీవితాలను అతలాకుతలం చేసింది. "ఈ పిల్ల వరదల్లో పుట్టింది. జీవితమంతా వరదలు చూస్తూనే గడుపుతుంది" అన్నారు చుట్టుపక్కలవాళ్ళు.
జూలై 2022 మొదటివారంలో వర్షాలు కుండపోతగా ముంచెత్తుతున్నపుడు పదిహేడేళ్ళ సానియా ఆ మాటలు మళ్ళీ గుర్తుచేసుకొంది. "పాణీ వాఢత్ చాల్‌లై (నీటి మట్టం పెరుగుతోంది) అన్నమాట వినిపించగానే మరోసారి వరద అన్న భయం నాలో కలుగుతుంది," అంటుందామె. సానియాది కొల్హాపూర్ జిల్లాలోని హాత్‌కణంగలే తాలూకాకు చెందిన భేండ్‌వడే గ్రామం. 2019 నుంచి ఆ గ్రామమూ, ఆ గ్రామపు 4,686 మంది గ్రామస్థులూ రెండుసార్లు వరద తాకిడికి గురయ్యారు.
"2019 వరదల్లో మా ఇంటి పరిసరాల్లో ఇరవైనాలుగ్గంటల్లో వరదనీరు ఏడడుగులు పెరిగింది," గుర్తుచేసుకుంది సానియా. ఆ నీరు వాళ్ళ ఇంట్లోకి చొరబడబోతోంది అన్న క్షణంలో ములాణీ కుటుంబం ఎలాగోలా తప్పించుకోగలిగింది. కానీ ఆ అనుభవం సానియా మీద విపరీతమైన ప్రభావం చూపించింది.
జూలై 2021లో ఆ గ్రామం మళ్ళీ వరద తాకిడికి గురయింది. ఈసారి వాళ్ళంతా ముందస్తుగానే గ్రామ శివార్లలోని వరద బాధితుల శిబిరం చేరుకోగలిగారు. అక్కడ మూడు వారాలు గడిపారు. గ్రామాధికారులు 'ఇప్పుడంతా సర్దుకొంది, ఇక మీరు తిరిగిరావచ్చు ' అని ప్రకటించినపుడే ఇంటికి చేరుకొన్నారు.
టేక్వాండో క్రీడలో సానియా నిష్ణాతురాలు. అందులో బ్లాక్ బెల్ట్ సాధించాలన్న సానియా ఆశలకూ ప్రయత్నాలకూ 2019 నాటి వరదలు గండికొట్టాయి. ఆ అనుభవాల తర్వాత ఆమెలో అలసట, అలజడి, ఆందోళన, ఊరికే చిరాకుపడిపోవడం- ఇవన్నీ గూడుకట్టుకున్నాయి. గత మూడేళ్ళుగా ఆమెను పీడిస్తున్నాయి. "టేక్వాండో శిక్షణ మీద దృష్టి నిలపలేకపోతున్నాను. ఇపుడు నా శిక్షణ అంతా వర్షాల మీద ఆధారపడి ఉంటోంది," అంటుందామె.





















