కొంతకాలం క్రితం, మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా, హాత్‌కణంగలే తాలూకాలోని ఖోచి అనే గ్రామానికి చెందిన రైతులు ఒక ఎకరం పొలంలో అత్యధికంగా చెరకును ఎవరు పండిస్తారనే దానిపై ఒకరితో ఒకరు పోటీపడ్డారు. ఈ ఆచారం దాదాపు ఆరు దశాబ్దాల నాటిదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇది ప్రతి ఒక్కరికీ మంచి ప్రతిఫలాన్ని అందించే ఆరోగ్యకరమైన పోటీ. కొంతమంది రైతులైతే ఎకరాకు 80,000-100,000 కిలోల వరకు పండించారు. ఇది సాధారణంగా పండించే పంట కంటే దాదాపు 1.5 రెట్లు ఎక్కువ.
ఆగస్ట్ 2019లో వచ్చిన వరదల కారణంగా గ్రామంలోని అనేక ప్రాంతాలు దాదాపు 10 రోజుల పాటు నీటిలో మునిగిపోయి, పండిన చెరకు పంటలో ఎక్కువ భాగం దెబ్బతినడంతో ఆ ఆచారం అనుకోకుండా అర్ధాంతరంగా ముగిసిపోయింది. రెండు సంవత్సరాల తరువాత, జూలై 2021లో భారీ వర్షాలూ వరదలూ మరోసారి ఖోచి గ్రామాన్ని చొట్టుముట్టి చెరకు, సోయాబీన్ పంటలకు భారీగా నష్టం కలిగించాయి.
“ఇప్పుడు రైతులు పోటీపడటంలేదు; అందుకు బదులుగా వారు, తమ చెరకు పంటలో కనీసం సగమైనా మిగలాలని ప్రార్థిస్తున్నారు" ఖోచి గ్రామ నివాసి, కౌలు రైతు కూడా అయిన గీతా పాటిల్ (42) అన్నారు. ఒకప్పుడు చెరకు ఉత్పత్తిని పెంచడానికి అన్ని రకాల మెళకువలు నేర్చుకున్నానని నమ్మిన గీత, ఈ రెండు వరదల్లో 8 లక్షల కిలోలకు పైగా చెరకు పంటను కోల్పోయారు. "ఎక్కడో ఏదో తప్పు జరిగింది," అంటారామె. ఆమె వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకోలేదు.
"(2019లో వచ్చిన వరదల నుండి) వర్షపాతం నమూనా పూర్తిగా మారిపోయింది" అన్నారామె. 2019 వరకు ఆమె పనులు ఒక నియమిత పద్ధతిలో ఉండేవి. చెరకు పంట కోత అయిన తర్వాత, సాధారణంగా అక్టోబరు-నవంబర్ నెలలలో, ఆమె వేరే రకాల పంటలను పండించేవారు: సోయాబీన్, భుయీమూగ్ (వేరుశెనగ), వివిధ రకాల ధాన్యాలైన హలు (హైబ్రిడ్ జొన్న) లేదా బజ్రా (సజ్జలు) వంటి భూపోషకాలను నిలిచివుండేలా చేసే పంటలు. ఆమె జీవితానికీ పనికీ ఒక స్థిరమైన, సుపరిచితమైన లయ ఉండేది. ఇప్పుడిక అది లేదు.
“ఈ సంవత్సరం (2022) రుతుపవనాలు ఒక నెల ఆలస్యంగా వచ్చాయి. కానీ వానలు మొదలయ్యాక పొలాలన్నీ ఒక్క నెలలోనే ముంపునకు గురయ్యాయి." ఆగస్ట్‌లో కురిసిన భారీ వర్షాలకు దాదాపు మొత్తం పొలాలన్నీ రెండు వారాల పాటు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. అప్పుడప్పుడే చెరకు సాగు మొదలుపెట్టిన రైతులు, ఈ అదనపు నీటి వల్ల మొక్కలు గిడసబారిపోవటంతో అపారంగా నష్టపోయామని చెప్పారు. నీటిమట్టం మరింత పెరిగితే ప్రజలు ఇళ్లను ఖాళీ చేసిపోవాలని పంచాయతీ హెచ్చరికలు కూడా జారీచేసింది.



















