"ఇది వేడుకలకు సరైన రోజు. వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంది,” అన్నారు లేహ్ జిల్లాలో రహదారి నిర్మాణ స్థలాల్లో రోజువారీ కూలీగా పనిచేస్తోన్న పెమా రించెన్.
లడఖ్‌లోని హాన్లే (ఆన్‌లే అని కూడా పిలుస్తారు) గ్రామంలో నివసించే 42 ఏళ్ల రించెన్ టిబెట్ క్యాలెండర్లో ముఖ్యమైన పండుగ అయిన సాగా దావాను గురించి చెప్తున్నారు. ఈ పండుగను లడఖ్, సిక్కిమ్ అరుణాచల్ ప్రదేశ్‌లలోని బౌద్ధులు జరుపుకుంటారు.
"ఇంతకుముందు ప్రతి కుగ్రామంలోనూ అందరూ సాగా దావాను జరుపుకునేవాళ్ళు. కానీ ఈ ఏడాది (2022) ఆరు గ్రామాలు మాత్రమే కలిసివచ్చాయి," హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రొనామికల్ అబ్జర్వేటరీలో పనిచేస్తోన్న 44 ఏళ్ళ సోనమ్ దోర్జే అన్నారు. ఈయన ఇక్కడి నాగా కుగ్రామంలో నివసిస్తుంటారు. కోవిడ్-19 ముమ్మరంగా ఉన్న సమయంలో రెండేళ్ళపాటు పరిమితంగా జరుపుకున్న ఉత్సవాల తర్వాత పుంగుక్, ఖల్దో, నాగా, షాడో, భోక్, జిక్సోమా కుగ్రామాలన్నీ కలిసి ఈ ఉత్సవాలను జరుపుకున్నాయి. చెదురుమదురు జనాభా కలిగిన ఈ కుగ్రామాలన్నీ హాన్లే గ్రామంలో భాగంగా ఉన్నాయి. వీటన్నింటిలోని మొత్తం జనసంఖ్య 1,879 మంది (2011 జనాభా లెక్కలు).
మహాయాన శాఖకు చెందిన బౌద్ధులు జరుపుకునే ఈ పండుగను 'శాకా దావా' అని కూడా పిలుస్తారు. సాగా దావాను టిబెట్ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం నాలుగవ నెల 15వ రోజున జరుపుకుంటారు; 2022 సంవత్సరంలో, ఇది జూన్ నెలలో వచ్చింది. టిబెట్ భాషలో సాగా అంటే నాలుగవ అనీ, దావా అంటే నెల అని అర్థం. సాగా దావా నెలను 'పుణ్య మాసం' అని పిలుస్తారు- ఈ కాలంలో చేసే మంచి పనులకు అనేక రెట్లు ఎక్కువ ప్రతిఫలం లభిస్తుందని చెబుతారు. బుద్ధుని జ్ఞాపకార్థం జరిగే ఈ పండుగ అతని పుట్టుకను, జ్ఞానోదయం కలిగిన రోజును, పరినిర్వాణం లేదా సంపూర్ణ నిర్వాణం చెందిన రోజును సూచిస్తుంది.































