“మా దీవి ఒక పెద్ద పగడపు దిబ్బపై ఉందని నాకు నా చిన్నప్పుడు చెప్పారు. ఆ పగడం అంతా లోపల ఉండి, దీవిని జాగ్రత్తగా పట్టి ఉంచుతుంది. ఇంకా మా చుట్టూ ఉన్న ఉప్పునీటి మడుగు ఏమో మమ్మల్ని సముద్రం నుండి కాపాడుతుంది,” అంటారు బిట్రా దీవిపై నివసించే 60 ఏళ్ల మత్స్యకారుడు, బి. హైదర్.
“నా చిన్నతనంలో, సముద్రంలో పోటు తక్కువగా ఉన్నప్పుడు పగడాలు చూడగలిగేవాళ్ళం,” అంటారు బిట్రా దీవిపైనే నివసించే మరొక 60 ఏళ్ల మత్స్యకారుడు, అబ్దుల్ ఖాదర్. “భలే అందంగా ఉండేవిలే. ఇప్పుడు అవేవీ లేవు. కానీ పెద్ద పెద్ద అలలను ఆపాలంటే పగడం వల్లే అవుతుంది.”
లక్షద్వీప్ ద్వీపసమూహంలోని ద్వీపాలలో ఎన్నో కథలకు, ఊహలకు, జీవితాలకు, జీవనాలకు, జీవావరణ వ్యవస్థలకు మూలమైన ఆ పగడం, బ్లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా నెమ్మదిగా కనుమరుగైపోతోంది. ఇటువంటి ఎన్నో మార్పులను, అక్కడి మత్స్యకారులు కొన్ని దశాబ్దాలుగా గమనిస్తున్నారు.
“ఇందులో ఏముంది. ప్రకృతి మారిపోయింది,” అని మునియమిన్ కె. కె. వివరిస్తారు. 61 సంవత్సరాల మునియమిన్, తనకు 22 ఏళ్ళు ఉన్నప్పటి నుండి, అగట్టి ద్వీపంలో చేపలు పడుతున్నారు. “ఆ రోజుల్లో ఋతుపవనాలు సమయానికి వచ్చేవి [జూన్ లో], కానీ ఇప్పుడవి ఎప్పుడు వచ్చేది చెప్పగలిగే అవకాశమే లేకుండా పోయింది. మాకు దొరికే చేపలు కూడా తగ్గిపోయాయి. సముద్రం లోపలికి పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేకుండా, తీరం అంచునే చేపల గుంపులు ఉండేవి. కానీ ఇప్పుడు, చేపలు వెతుక్కుంటూ రోజులు, కొన్ని సార్లు వారాల తరబడి ఇల్లు వదిలేసి సముద్రంలో ఉండాల్సిన పరిస్థితి.”
భారత్ లోని అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ ద్వీపసమూహంలో భాగాలయిన బిట్రా, అగట్టి దీవులు, మొత్తం ద్వీపసముదాయంలోకెల్లా నిష్ణాతులైన మత్స్యకారులకు నివాసాలు. వీటి మధ్య పడవలో ప్రయాణించడానికి, ఏడు గంటల సమయం పడుతుంది. లక్షద్వీప్ పేరులో లక్ష ద్వీపాలున్నా, నిజానికి మన కాలంలో అక్కడ 36 దీవులు మాత్రమే ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం, అంతా కలిపి, 32 చదరపు కిలోమీటర్లు. ఈ ద్వీపసమూహం కిందకు వచ్చే సముద్రం మాత్రం, 4 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో అమూల్యమైన సముద్రజీవులు, వనరులను కలిగి ఉంది.
మొత్తం ఒకే జిల్లాగా ఉండే ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రతి ఏడుగురిలో ఒకరు, జీవనం కోసం చేపలు పట్టుకుంటారు. అంటే [2011 జనగణన ప్రకారం] మొత్తం 64,500 జనాభాలో 9,000 మంది మత్స్యకారులే.






