ఈ కథనం, 2019 పర్యావరణ రిపోర్టింగ్ విభాగంలో, రామ్‌నాథ్ గోయెంకా అవార్డును గెలుచుకున్న వాతావరణ మార్పులపై PARI ప్రచురించిన కథనాల వరుసలోనిది.
సినిమాలో చివరి ఫైటింగ్ సీన్ కోసం ఎడారి సెట్టింగ్ కి ఇది సరిగ్గా సరిపోతుంది. ఇసుక తిన్నెలు, లోయలు, మధ్యమధ్యలో చిన్న మొక్కలు - బంజరుగా ఉన్న ఈ నేపథ్యంలో, మండుతున్న ఇసుక తిన్నెల మధ్య నుంచి లేచిన హీరో, విలన్లని చావగొట్టేస్తాడు. ప్రకృతి ముందే ఇచ్చిన మండే వేడి, దుమ్ము మధ్య కథ సుఖాంతమౌతుంది. (విలన్లకి కాదనుకోండి). రాజస్థాన్లోని సుదూర ఎడారుల్లోనో, మధ్యప్రదేశ్ లోని చంబల్ లోయలోనో అసంఖ్యాకమైన సినిమాలు ఇదే సన్నివేశాన్ని చిత్రీకరించాయి.
తేడా ఏంటి అంటే, ఈ ఎండిపోయిన ఎడారి సీను (వీడియో క్లిప్ చూడండి) రాజస్థాన్ దో, చంబల్ లోయదో కాదు. దక్షిణ ప్రాంతంలో ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో తీసిన వీడియో ఇది. అనంతపూర్ జిల్లాలో సుమారు వెయ్యి ఎకరాల ఈ ప్రదేశంలో ఒకప్పుడు చిరుధాన్యాలు పండించేవారు. కానీ దశాబ్దాలు గడుస్తూ ఈ భూమి ఎడారిగా మారిపోయింది. అతి విచిత్రమైన కారణాలతో ఏర్పడిన ఈ ప్రదేశం లొకేషన్ కోసం చిత్ర దర్శకులు వెతుక్కుంటూ వచ్చేలా చేసింది.
ఈ భూమి యజమానుల్లో ఎక్కువమంది ఉండే దర్గా హొన్నూర్ గ్రామస్తులు మేము సినిమా లొకేషన్ వెతుక్కుంటూ రాలేదు అంటే నమ్మడానికి నిరాకరించారు. "ఇది ఏ సినిమా? ఎప్పుడొస్తుంది?" అని కొంత మంది అడిగారు. కొంతమంది అదే ఆలోచిస్తున్నట్లు అర్థమైంది. మేము జర్నలిస్టులమని చెప్పేసరికి కొంత మందికి మేమంటే ఇంక ఆసక్తి పోయిందన్న విషయం స్పష్టంగా తెలిసింది.
ఈ ప్రదేశానికి లొకేషన్ గా ఖ్యాతి తెచ్చిపెట్టిన 'జయం మనదేరా' సినిమా దర్శకులు 1998, 2000 సంవత్సరాల మధ్య ఫైటింగ్ సీన్లను ఇక్కడ చిత్రీకరించారు. మంచి మాస్ సినిమా తీసేవారు ఎవరైనా చేసేటట్లుగా వారు ఎడారిలా కనిపించడానికి ఈ ''సెట్' లో కొన్ని మార్పులు చేశారు. "మా పండిన పంటల్ని పీకేయమన్నారు. దానికి డబ్బులు ఇచ్చారు," అని చెప్పారు 45 ఏళ్ళ పూజారి లింగన్న. ఆ ప్రాంతంలో లింగన్నకి 34 ఎకరాలు ఉంది. "ఎడారిలా నిజంగా కనిపించడానికి కొన్ని చెట్లు, గడ్డి కూడా పీకేశాం." కెమెరా ప్రతిభ, ఫిల్టర్ల సహాయంతో ఎడారి వాస్తవికత పూర్తి చేశారు.
"జయం మనదేరా" చిత్రాన్ని 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు తీస్తే, వాళ్ళు అంత కష్టపడక్కర్లేదు. కాలం, నానా హింసలు పడ్డ ప్రకృతి, నిర్దాక్షిణ్యంగా మానవ జోక్యంతో ఏ మార్పులూ, ఫిల్టర్లు అవసరం లేకుండానే ఎడారి తయారైపోయింది.
(ఈ ఎండిపోయిన ఎడారి సీను (వీడియో క్లిప్ చూడండి) రాజస్థాన్ దో, చంబల్ లోయదో కాదు. దక్షిణ ప్రాంతంలో ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో తీసిన వీడియో ఇది.)
కానీ ఇది ఒక తమాషా ఎడారి. ఇంకా ఉపరితలానికి దగ్గరగానే భూగర్భ జలాలు ఉన్నాయి కనుక కొంత సాగు ఉంది. "ఈ ప్రదేశంలో కేవలం 15 అడుగుల లోతుని మాకు నీళ్లు తగిలాయి," లింగన్న కొడుకు పి హొన్నురెడ్డి చెప్పాడు. అనంతపూర్ లో చాలా ప్రాంతాల్లో 500-600 అడుగుల లోతుకి వెళ్లినా కూడా బోరు బావులకు నీరు తగలదు. జిల్లాలో కొన్ని చోట్ల వెయ్యి అడుగుల లోతుకి కూడా వెళ్లారు. అలాంటి పరిస్థితుల్లో కూడా కేవలం నాలుగు అంగుళాల బోర్ వెల్ నుంచి మా నీరు పైకి చిమ్ముతోంది. ఇంత వేడిమి ఉన్న, ఇసుకతో నిండిన ప్రదేశంలో ఉపరితలానికి అంత దగ్గరగా ఇంత నీరా?
"ఈ మొత్తం ప్రాంతం నదీగర్భం నుంచి విస్తరించిన ప్రాంతం" సమీప గ్రామానికి చెందిన పాల్తూరు మూకన్న వివరించాడు. నది? ఏ నది? మాకైతే ఏమీ కనిపించలేదు. "సుమారు అయిదు దశాబ్దాల క్రితం హొన్నూరు నుంచి 25-30 కిలోమీటర్ల దూరంలో వేదవతి నది మీద ఆనకట్ట కట్టారు. ఆ నది ఇక్కడ నుంచే పారేది. తుంగభద్రా ఉపనది అయిన వేదవతిని అఘారి అని కూడా అంటారు... ఇక్కడ పారిన నది మాత్రం ఎండిపోయింది."
"నిజం. అదే జరిగింది," అనంతపూర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఎకాలజీ సెంటర్ కి చెందిన మల్లారెడ్డి ధృవీకరించారు. ఆయనకీ తెలిసినంతగా ఆ ప్రాంతం చాలా కొద్దిమందికి తెలుసు. "నది పోయి ఉంటుంది కానీ...కొన్ని శతాబ్దాల మీద నది ఒక భూగర్భ జలాశయాన్ని సృష్టించింది. ఇప్పుడు అన్ని తవ్వి, నీరు లాగేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఏ స్థాయిలో అంటే, త్వరలోనే ముంచుకుని వచ్చేంత."
విపత్తు ముంచుకురావడానికి ఎక్కువ సమయం లేదు. "ఇరవై ఏళ్ళ క్రితం ఒక్క బోర్ వెల్ కూడా ఉండేది కాదు," ఎడారీకరణ జరిగిన చోట పన్నెండున్నర ఎకరాల భూమి ఉన్న రైతు, 46 సంవత్సరాల VL హిమాచల్ గుర్తుచేసుకున్నాడు. "అంతా వర్షాధార వ్యవసాయమే. ఇప్పుడు వెయ్యి ఎకరాల్లో 300-400 బోర్లు ఉన్నాయి. మాకు 30-35 అడుగుల్లో, కొన్ని సార్లు అంత కంటే తక్కువలో నీరు పడుతుంది." అంటే, మూడెకరాలు లేదా అంత కంటే తక్కువ విస్తీర్ణంలో ఒక బోర్ వెల్ అన్నమాట.
అనంతపూర్ లాంటి చోటకి కూడా ఈ సంఖ్య చాలా ఎక్కువే. "జిల్లాలో 70 వేల బోర్ వెల్స్ తవ్వే అవకాశం ఉండగా, ప్రస్తుతం 270,000 బావులు ఉన్నాయి. అందులో సగానికి సగం ఈ ఏడాది ఎండిపోయాయి," మల్లారెడ్డి చెప్పారు.
మరి ఈ బంజరు భూముల్లో బోర్ బావులు ఎందుకు? అక్కడ ఏం సాగు చేస్తున్నారు? మేము చూస్తున్న ప్రదేశంలో కనిపించేది జిల్లావ్యాప్తంగా సాగు చేసే వేరుశెనగ కాదు. అక్కడ పండిస్తున్నది సజ్జలు. విత్తనాల కోసం అక్కడ చిరుధాన్యమైన సజ్జలు పెంచుతున్నారు. మార్కెట్ అవసరాల కోసం కాక రైతులకి కాంట్రాక్ట్ ఇచ్చిన విత్తన కంపెనీల కోసం ఈ సాగు జరుగుతోంది. చక్కటి వరుసల్లో ఆడ, మగ మొక్కలను నాటిన దృశ్యం అక్కడ కనిపిస్తుంది. రెండు వంగడాల సజ్జల నుంచి ఒక కొత్త వంగడాన్ని తయారు చేస్తున్నాయి ఆ కంపెనీలు. ఇటువంటి పనికి చాలా నీరు కావాలి. విత్తనాలు తీసేసాక ఆ మొక్కలు మిగిలిన భాగం కేవలం పశుగ్రాసానికే పనికొస్తుంది.
"ఈ విత్తనాల వృద్ధికి గానూ మాకు క్వింటాల్ కి 3800 రూపాయలు లభిస్తాయి," పూజారి లింగన్న చెప్పారు. ఈ పనికి అయ్యే కూలీ, సంరక్షణ చూస్తే అది తక్కువనే చెప్పాలి. పైగా ఆ కంపెనీలు ఈ రైతులకే ఆ విత్తనాలు మళ్ళీ అధిక ధరల కూడా. అదే ప్రదేశంలో సాగు చేసే మరొక రైతు YS శాంతమ్మ తమ కుటుంబానికి క్వింటాల్ కి 3700 రూపాయలు లభిస్తాయని చెప్పారు.
ఇక్కడ సాగు చేయడంలో సమస్య నీళ్లు కాదు అంటారు శాంతమ్మ, ఆమె కుమార్తె వందాక్షి. "మాకు కుళాయి కనెక్షన్ లేకపోయినా ఊరిలో కూడా నీళ్లు వస్తాయి. " అక్కడ ఉన్న పెద్ద తలనెప్పి ఇసుక. ఇప్పటికే ఉన్నది కాకుండా ఇంకా కొత్తగా పెరిగిపోతుంటుంది. ఆ ఇసుకలో కాళ్ళు కూరుకుపోతుంటే కొంచెం దూరం నడవడం కూడా చాలా అలసట కలిగిస్తుంది.
"మనం ఎంత పని చేసినా ధ్వంసం అయిపోవచ్చు," అంటారు వాళ్ళు. ఒక ఇసుక తిన్నె కింద నాలుగు రోజుల క్రితం తానూ ఎంతో శ్రమకోర్చి నాటిన నాలుగు వరసల మొక్కలను చూపించాడు హొన్ను రెడ్డి. ఇప్పుడు అవి ఇసుక కింద కప్పబడిపోయి ఊరికే వరుసలు కనిపిస్తున్నాయి. క్రమంగా సారహీనమైన ప్రాంతంగా మారిపోతున్న ఈ చోట ఈదురుగాలులు వచ్చి తరచూ ఇసుక తూఫాన్లు వస్తుంటాయి.
"ఏడాదిలో మూడు నెలలు ఈ ఊరిలో ఇసుక వర్షం కురుస్తుంది," అని చెప్పాడు మరొక ఎడారి రైతు ఎం బాషా. "ఈ ఇసుక మా ఇళ్లల్లోకి వస్తుంది. మా ఆహారంలో పడిపోతుంది." ఇసుక తిన్నెలకి దగ్గరగా లేని ఇళ్లల్లోకి కూడా గాలి ఇసుకను తీసుకొస్తుంది. ఎన్ని తలుపులు పెట్టినా, తలుపులకి జాలి వేసినా పని చేయదు. "ఇసుక వర్షం ఇప్పుడు మా జీవితంలో ఒక భాగం. వాటిని భరిస్తూ బతకడం నేర్చుకున్నాం."
D హొన్నూర్ గ్రామస్తులకు ఇసుక కొత్తేమీ కాదు. "కానీ తీవ్రత పెరిగింది," చెప్పాడు హిమాచల్. గతంలో గాలికి అడ్డంకులుగా ఉన్న చిన్న చెట్లు, పొదలు ఇప్పుడు పోయాయి. భౌగోళికీకరణ ప్రభావం, మార్కెట్ అర్థ శాస్త్రం గురించి హిమాచల్ చాలా తెలిసినట్లుగా మాట్లాడుతాడు. "ఇప్పుడు మేము ప్రతిదీ నగదుతో లెక్క పెడుతున్నాం. ఉన్న భూమిలో ప్రతి అంగుళం వాణిజ్య పంటకి వాడాలని జనాలు అనుకున్నారు కాబట్టి ఇక్కడ చెట్లు, పొదలు పోయాయి." "విత్తనాలు మొలకేసి సమయంలో కనుక ఇసుక వస్తే, మొత్తం పోయినట్లే," 56 సంవత్సరాల రైతు ఎం తిప్పయ్య చెప్పారు. నీరు ఉన్నప్పటికీ పంట తక్కువే. "ఒక ఎకరానికి మూడు, లేదా మహా అయితే నాలుగు క్వింటాల్ వేరుశెనగ వస్తుంది," 32 సంవత్సరాల రైతు KC హొన్నూర్ స్వామి అంటారు. జిల్లాలో సగటు పంట సుమారు అయిదు.
సహజంగా గాలికి అడ్డంకులుగా ఉండే చెట్లు అంటే వారికి విలువ లేదా? "వాణిజ్యపరమైన విలువ ఉన్న చెట్లు మాత్రమే వాళ్లకి కావాలి<" అన్నాడు హిమాచల్. అక్కడ పరిస్థితులు వాటికి అనుకూలం కాదు కనుక ఆ చెట్లు అక్కడ ఎలాగో పెరగవు. "అధికారులు చెట్లు నాటడంలో సహాయపడతాం అంటారు కానీ అది జరగదు."
కొన్నేళ్ల క్రితం అనేక మంది ప్రభుత్వాధికారులు ఈ ఇసుక తిన్నెల వద్దకి తనిఖీ కోసం వచ్చారు అని చెప్పాడు పాల్తూరు ముక్కన్న. అయితే ఆ యాత్ర సరిగ్గా జరగలేదని ఇసుకలో ఇరుక్కుపోయిన వారి ఎస్యూవీ వాహనాన్ని గ్రామస్తులు ట్రాక్టర్తో బయటికి లాగాల్సి వచ్చిందని చెప్పాడు అప్పటి నుంచి ప్రభుత్వ అధికారులెవరినీ మేం చూడలేదు అన్నాడు ముక్కన్న కొన్నిసార్లు బస్సు కూడా అటు పక్క గ్రామం వైపు రాలేక పోతుంది అని చెప్తాడు రైతు మోకా రమేష్.
చెట్లు పొదలు పోవడం అనేది రాయలసీమ ప్రాంతం మొత్తంలో ఉన్న సమస్య అనంతపూర్ జిల్లాలోని పదకొండు శాతం ప్రాంతాన్ని అడవిగా ప్రకటించినప్పటికీ అటవీ ప్రాంతం రెండు శాతం కంటే తగ్గిపోయింది దీని ప్రభావం భూమి గాలి నీరు ఉష్ణోగ్రతల పైనా అనివార్యంగా కనిపిస్తుంది అనంతపూర్లో మనం చూసే పెద్ద అడవి కేవలం విండ్ మిల్స్ అడవి వేలాది పవన విద్యుత్ యంత్రాలు ఎక్కడ చూసినా కనిపిస్తాయి చివరికి ఈ మినీ ఎడారి అంచుల్లో కూడా. అవన్నీ కూడా దీర్ఘకాలికంగా లీజ్ తీసుకుని లేదా కొనుగోలు చేసిన భూమిలో పవన విద్యుత్ కంపెనీలు ఏర్పాటు చేశాయి.
ఈ పరిస్థితి ముందు నుంచి ఇలాగే ఉండేదని డి పొన్నూరులో ఎడారిలో సాగు చేసే వారు మాకు ముందు తెలియజేసి అనంతరం దానికి వ్యతిరేకమైన సాక్ష్యాధారాలను మా ముందు ఉంచారు. ఇసుక ముందునుంచి ఉంది అయితే ఇసుక తుపాన్లు తీసుకువచ్చే దాటి పెరిగింది అంటారు వారు ఇదివరకు మరిన్ని పొదలు చెట్లు ఉండేవి ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. నీరు ఎప్పుడూ ఉందని చెప్పారు కానీ ఆ నది ఎండి పోయిందన్న విషయం ఆ తర్వాత మా కొచ్చి తెలిసింది. ఇరవై ఏళ్ల క్రితం చాలా తక్కువ బోరుబావులు ఉండేవి ఇప్పుడు వందలాది పావులు ప్రతి ఒక్కరికి కూడా గత రెండు దశాబ్దాల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడిన విషయం గుర్తుంది.
వర్షపాతం సరళి మారింది మాకు వర్షం అవసరమైనప్పుడు కనీసం అరవై శాతం తక్కువ పడుతుంది అని చెప్పగలను అంటాడు హిమాచల్. గత కొద్ది సంవత్సరాలుగా ఉగాది తెలుగు సంవత్సరాది సాధారణంగా ఏప్రిల్లో వస్తుంది సమయంలో వర్షాలు తక్కువ పడతాయి. అనంతపూర్లో చూచాయగా నైరుతి ఈశాన్య రుతుపవనాలు రెండు వచ్చినప్పటికీ ఈ రెండు రుతుపవనాల ప్రయోజనం కొంచెం కూడా ఉండదు.
జిల్లాలో వార్షిక సగటు వర్షపాత మైన ఐదు వందల ముప్పై ఐదు మిల్లీ మీటర్లు కురిసినప్పటికీ కూడా ఆ వర్షాలు వచ్చే సమయం విస్తృతి వ్యాప్తి చాలా హెచ్చుతగ్గులుగా ఉంటాయి కొన్ని సంవత్సరాల్లో వర్షాలు పంట సీజన్లో కాక పంటలు లేని సీజన్లో కురవడం మొదలైంది. కొన్ని సంవత్సరాలు మొదటి ఇరవై నాలుగు నుంచి నిలిపింది గంటల వరకు కుండపోత వర్షం కురిసి ఆ తర్వాత చుక్క కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది గత ఏడాది కొన్ని మండలాల్లో పంట సీజనైనా జూన్ నుంచి అక్టోబర్ మాసం మచ్చ దాదాపు డెబ్బై ఐదు రోజుల పాటు కూడా వర్షం కురవని పరిస్థితి ఉంది. అనంతపూర్ జనాభాలో డబ్బేదో శాతం గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్మికులందరితో ఎనభై శాతం రైతులుగానే కూలీలుగానో వ్యవసాయంలో ఉండడంతో ఈ పరిస్థితి చాలా కష్టాలను తెచ్చిపెడుతుందని చెప్పాలి.
గత రెండు దశాబ్దాల్లో అనంతపూర్ లో కేవలం రెండు సాధారణ సంవత్సరాలు ఉన్నాయని చెప్పాలి అంటారు ఇకాలజీ సెంటర్కి చెందిన మల్లారెడ్డి. రెండు దశాబ్దాల్లో చెరో రెండేళ్లు ఈ పరిస్థితి కాగా మిగిలిన పదహారేళ్లలో జిల్లాలో రెండొంతులు మూడొంతులు అనావృష్టి ప్రాంతమని ప్రకటించారు అంతకు ముందు గడిచిన ఇరవై ఏళ్లలో ప్రతి దశాబ్దానికి మూడు సార్లు కరువు వచ్చేది పంతుల ఎనభై దశకంలో చివరి సంవత్సరాల్లో ప్రారంభమైన మార్పులు ప్రతి ఏడాది మరింత తీవ్రంగా వేగవంతంగా కనిపిస్తున్న.
ఒకప్పుడు వివిధ రకాల చిరుధాన్యాలకు నెలవు అయిన ఈ జిల్లా రానురాను వేరుశెనగ వంటి వాణిజ్య పంటలకు మారిపోయింది అదే సమయంలో భారీగా బోర్ వెల్స్ తవ్వడం కూడా ప్రారంభమైంది ఇప్పుడు కొన్ని చోట్ల భూగర్భ జలాల వాడకం వంద శాతానికంటే మించిపోయిందని జాతీయ వర్షాధార ప్రాంత సాధికార సంస్థ నివేదిక .
నలభై ఏళ్ల క్రితం మాకు స్పష్టంగా అర్థమయ్యేది పదేళ్లలో మూడు కరువులు రైతులకు ఏది సాగు చేయాలో తెలిసేది తొమ్మిది నుంచి పన్నెండు రకాల పంటలు ఉండేవి ఒక స్థిరమైన సాగు ప్రక్రియ ఉండేది అంటారు సీకే బబ్లూ గంగూలీ. గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో గ్రామీణ పేదల ఆర్థిక మెరుగుదల కోసం పనిచేస్తున్న టింబక్టు కలెక్టివ్ అనే స్వచ్ఛంద సంస్థకు గంగూలీ నేతృత్వం వహిస్తారు. గత నలభై ఏళ్లుగా ఆ ప్రాంతంలో పనిచేస్తున్న గంగూలీకి ఆ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో ధోరణుల గురించి ఎంతో పరిజ్ఞానం వచ్చింది.
అనంతపూర్ లో సాగు చేస్తున్న ప్రాంతంలో ఇప్పుడు అరవై తొమ్మిది శాతం మేరకు వేరుశెనగ ఆఫ్రికాలో సాహిల్ కు ఏంచేసిందో మాకు కూడా అదే చేసింది. ఒకటి పంట పండించడం అనే పద్ధతి ఏర్పడినప్పటికి నీటి పరిస్థితి మారడమే కాదు. వేరుశెనగ నీడలో పండదని రైతులు చెట్లను కొట్టివేశారు అనంతపూర్లో భూసారం పూర్తిగా ధ్వంసమైంది చిరుధాన్యాలు కనుమరుగై . భూమిలో తేమ పోవడంతో మరోసారి వర్షాధార వ్యవసాయాన్ని వైపు వెళ్లడం కష్టమైంది." పంటల్లో మార్పు వల్ల వ్యవసాయంలో మహిళల పాత్ర కూడా దెబ్బతింది సంప్రదాయ ప్రకారం వారు ఈ ప్రాంతంలో పండే వర్షాధార పంటలకు విత్తనాలను పరిరక్షించే వారు క్యాష్ క్రాప్ హైబ్రిడ్ కోసం రైతులు మార్కెట్ పై ఎప్పుడైతే ఆధారపడ్డం ప్రారంభించారో అనంతపూర్లో పరిస్థితి మారిపోయి మహిళలు కూలీలుగా ఉండిపోయారు అంతేకాకుండా రెండు తరాల తరువాత అనేక మంది రైతులకు అదే పొలంలో వివిధ రకాల పంటలు పండించేందుకు నైపుణ్యం కూడా మాయమైంది.
సాగు చేస్తున్న ప్రాంతంలో మూడు శాతం కంటే తక్కువ ఇప్పుడు పశుగ్రాసానికి వినియోగిస్తున్నారు అనంతపూర్లో ఒకప్పుడు అత్యధిక సంఖ్యలో దాణా వేసే చిన్న పశువులు ఉండేవి అంటారు గంగూలీ. కురుబలు లాంటి సంప్రదాయ పశువుల కాపర్లు కులాలకు చిన్న పశువులు సంచార ఆస్తులుగా ఉండేవి. పంట కోసిన తర్వాత ఈ చిన్న పశువులు రైతుల పొలాల్లో పెంట మూత్రం ద్వారా ఎరువులు ఇచ్చేవి. అయితే పంటల సరళి చేరడం మారడం వల్ల రసాయనిక వ్యవసాయం వల్ల దీనికి అంతరాయం కలిగింది సన్నకారు రైతులు ఇతరులకు ఈ ఈ ప్రాంతంలో ఏదైనా ప్రణాళిక వేసుకోవడం అనేది అత్యంత దుర్భరంగా మారింది.
తన చుట్టూ కుంచించుకుపోతున్న వ్యవసాయ జీవవైవిద్యాన్ని పొన్నూరుకు చెందిన హిమాచల్ గుర్తిస్తున్నాడు దాని పర్యవసానం ఏమిటో కూడా అతనికి అర్థమవుతుంది. ఈ గ్రామంలో ఒకప్పుడు మాకు సజ్జలు రాగులు పెసలు అలసందలు బఠానీలు కొర్రలు మొదలైన వినో రకాల పంటలు ఉండేవి హిమాచల్ ఏకరువు పెట్టాడు వీటిని సాగు చేయడం ఎంతో తేలిక కాని వర్షాధార వ్యవసాయం మాకు డబ్బు తెచ్చి పెట్టదు వేరుశెనగలు కొంతకాలం క్యాష్ తెచ్చిపెట్టాయి.
తొమ్మిది రకాల చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు పండించిన రోజుల్లో ఏడాది పొడుగూతా ఏదో ఒక పంట సాగు అవుతుండడంతో ప్రతి ఏడాది జూన్ నుంచి ఫిబ్రవరి వరకు భూమి ఉపరితలం మట్టికి రక్షణగా నీడ లభించేది.
హొన్నూర్ లో హిమాచల్ సాలోచనగా ఉన్నాడు. బోర్ బావులు, వాణిజ్య పంటల వల్ల రైతులకి బాగా లాభం వచ్చిందని అతనికి తెలుసు. కానీ ఆ వ్యవసాయ పధ్ధతి కూడా ఇంకా తగ్గిపోతోందని, జీవనోపాధి అవకాశాలు తగ్గిపోతుంటే, వలస పెరుగుతోందని అతనికి తెలుసు. “ఎప్పుడూ కనీసం 200 కుటుంబాలు బయట పని వెతుక్కుంటూ ఉంటాయి," హిమాచల్ చెప్పాడు. అనంతపూర్ లోని బొమ్మనహళ్ మండలంలోని ఈ గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1,227 కుటుంబాలు ఉన్నాయి. "సుమారు 70-80 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి." అనంతపూర్ లో గత రెండు దశాబ్దాల్లో వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో రైతు ఆత్మహత్యలు కూడా ఈ జిల్లాలోనే అత్యధికంగా జరిగాయి.
“బోర్ బావులు తవ్వుకుంటూ పోయిన రోజులు పోయాయి," అని చెప్పారు మల్లారెడ్డి. “వాణిజ్య పంటలు, ఏక పంటల కాలం కూడా పోయినట్లే." అయినప్పటికీ ఈ మూడు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వాటి కొనసాగింపు వెనుక ఉన్న ప్రధాన కారణం వినియోగం కోసం ఉత్పత్తి కాక "అజ్ఞాతంగా మార్కెట్ల కోసం ఉత్పత్తులు సృష్టించడం."
వాతావరణంలో మార్పులు అంటే కేవలం ప్రకృతి తన రీసెట్ బటన్ నొక్కుతోంది అనుకుంటే, మరి హొన్నూర్, అనంతపూర్ లో మేము చూసింది ఏమిటి? పైగా వాతావరణంలో మార్పు అనేది చాలా విశాలమైన ప్రాంతాలు, మండలాల్లో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు అంటారు. మరి హొన్నూర్, అనంతపూర్ కేవలం పాలనాపరంగా ప్రదేశాలు, కానీ పటంలో చిన్న చుక్కలు, వాటిని ప్రాంతం అనడానికి లేదు. పెద్ద ప్రాంతాల్లో వచ్చే మార్పులు, చిన్న, ఉప ప్రాంతాల్లో ఉన్న విచిత్రమైన లక్షణాలను వెర్రితలలు ఎత్తేలా చేస్తాయా?
ఇక్కడ కనిపిస్తున్న మార్పులో దాదాపు అన్ని అంశాలు మానవ జోక్యంతో సంభవించినవే. 'బోర్ వెల్ ఉధృటి, ఏక పంటలు, వాణిజ్య పంటలకు భారీగా మారిపోవడం, అనంతపూర్ ని వాతావరణంలో మార్పుల నుంచి కాపాడే రక్షణ కవచం అయినా జీవవైవిధ్యం నాశనం కావడం, భూగర్భ నీటి నిల్వను కాపాడే పోరా పోవడం, ఈ మెత్త ప్రాంతంలో ఉన్న చిన్నపాటి అడవి నాశనం కావడం; పచ్చిక బయళ్ళ జీవ పర్యావరణానికి దెబ్బ, మట్టి సారం పూర్తిగా తగ్గిపోవడం; పరిశ్రమ నుంచి వత్తిడితో ఉధృతమైన రసాయనిక వ్యవసాయం; పొలానికి అడవికి మధ్య, గొర్రెల కాపర్లు, రైతులకే మధ్య ఉన్న పరస్పరాధార వ్యవస్థ కుప్పకూలడం; జీవనోపాధి అవకాశాలు మాయం కావడం; నదులు శాశ్వతంగా ఎండిపోవడం. ఇవన్నీ కూడా అక్కడ ఉష్ణోగ్రతలు, వాతావరణం పైన తీవ్ర ప్రభావం చూపించాయి. ఆ ప్రభావం ఈ ప్రక్రియలను మరింతగా దెబ్బ తీసింది.
మనం చూస్తున్న, అనుభవిస్తున్న మార్పులకు, అదుపుతప్పిన ఆర్ధిక సిద్ధాంతాలు, అభివృద్ధి నమూనాయే కారణమైతే, ఈ ప్రాంతం నుంచి, ఇలాంటి ప్రాంతాల నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది.
“బోరుబావులు మూసేసి వర్షాధార వ్యవసాయానికి తిరిగి రావాలేమో, కానీ అది చాలా కష్టం,” అంటాడు హిమాచల్.
పీ సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకుడు.
ముఖచిత్రం
:
రాహుల్ ఎం
/PARI
వాతావరణంలో మార్పులపై PARI దేశవ్యాప్తంగా చేస్తున్న రిపోర్టింగ్ ప్రాజెక్ట్, సామాన్య ప్రజల పైన ఆ మార్పుల ప్రభావం గురించి వారి స్వరంలోనే విని, నమోదు చేసేందుకు UNDP సహాయంతో జరుగుతున్న ప్రయత్నంలో భాగం.
ఈ వ్యాసం పునః ప్రచురించాలని అనుకుంటున్నారా? [email protected] కి ఈమెయిల్ చేసి, [email protected] కి కాపీ పెట్టండి.
అనువాదం: ఉషా తురగా-రేవెల్లి