సోమవారం ఉదయం 11 గంటలకు, మునేశ్వర్ మాంఝీ (41) తన ప్లాస్టరింగ్ చేయని, శిథిలమైన ఇంటి వెలుపల ఉన్న చౌకీలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నివాసం ముందున్న ఆ ఖాళీ స్థలంలో, వెదురు స్తంభాలకు కట్టివున్న నీలిరంగు పాలిథిన్ పట్టా అతనికి ఎండ తగలకుండా కాపాడుతోంది. కానీ అది ఉమ్మదం నుండి ఎటువంటి ఉపశమనాన్నీ కలిగించటం లేదు. “గత 15 రోజులుగా నాకు పని లేదు," అన్నారు, పాట్నా నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకో పట్టణానికి సమీపంలోని ముసహరి టోలాలో నివసించే మునేశ్వర్.
ముసహరి టోలా అనే పదాన్ని, దళిత సామాజిక వర్గమైన ముసహర్కు చెందిన వ్యక్తులు నివసించే ప్రాంతాన్ని సూచించేందుకు ఉపయోగిస్తారు. ఈ టోలాలో 60 కుటుంబాలు నివాసముంటాయి. మునేశ్వర్తో సహా ఆ టోలాలో నివసించేవారు సమీపంలోని వ్యవసాయ భూముల్లో పనిచేయడం ద్వారా వచ్చే రోజువారీ కూలీపై ఆధారపడి జీవిస్తారు. అయితే పనులు సక్రమంగా దొరకడం లేదని మునేశ్వర్ చెబుతున్నారు. ఖరీఫ్, రబీ పంటలు విత్తేటప్పుడూ, కోత సమయంలోనూ సంవత్సరంలో 3-4 నెలలు మాత్రమే వారికి పని దొరుకుతుంది.
అతనికి చివరిసారి పని దొరికింది,'బాబు సాహిబ్' అనే రాజ్పుత్ సామాజిక వర్గానికి చెందిన భూ యజమాని పొలంలో. “రోజులో ఎనిమిది గంటల పనికి మాకు 150 రూపాయల నగదు, లేదా 5 కిలోల బియ్యం చెల్లిస్తారు. అంతే," అంటూ వ్యవసాయ కూలీలకు దొరికే రోజువారి కూలీ గురించి మునేశ్వర్ చెప్పారు. నగదుకు బదులుగా ఇచ్చే బియ్యంతో పాటు మధ్యాహ్న భోజనంగా 4-5 రోటీలు, లేదా అన్నం, పప్పు, కాయగూరలతో చేసిన ఒక కూర ఇస్తారు.
భూమిలేని పేదలకు పంచేందుకు భూస్వాములు తమ భూమిలో కొంత భాగాన్ని వదులుకున్న 1955 నాటి భూదాన్ ఉద్యమ సమయంలో అతని తాతకు మూడు బిఘాల (దాదాపు రెండు ఎకరాలు) వ్యవసాయ భూమి లభించినప్పటికీ, అది ఇతనికి పెద్దగా ఉపయోగపడలేదు. “ఆ భూమి మేము నివసించే ప్రదేశానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. మేం పంట వేసినప్పుడల్లా జంతువులు వాటిని తినేయటంతో మాకు నష్టమే మిగులుతోంది,” అని మునేశ్వర్ వివరించారు.
సంవత్సరంలో ఎక్కువ రోజులు మునేశ్వర్ కుటుంబంతో పాటు టోలాలోని ఇతర కుటుంబాలు మహువా దారూ (విప్ప సారా)ను – ( మధుకా లాంగిఫోలియా వర్. లాటిఫోలియా) మహువా పువ్వులతో తయారుచేసిన మద్యం - తయారుచేసి, అమ్ముతూ జీవిస్తున్నారు.
అయితే, ఇది ప్రమాదకరమైన వ్యాపారం. బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం, 2016 అనే ఒక కఠినమైన రాష్ట్ర చట్టం మద్యం లేదా మత్తు పదార్థాల తయారీనీ, వాటిని కలిగివుండటాన్నీ, వాటి అమ్మకం లేదా వినియోగాన్నీ నిషేధించింది. 'దేశీయ లేదా సంప్రదాయ మద్యం'గా చెప్పే మహువా దారూ (విప్ప సారాయి) కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది.










