ఈ సంవత్సరం ఏప్రిల్ 10న రాత్రి 10:30 గంటలకు, హయ్యూల్ రహమాన్ అన్సారీ ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్‌లో ఉన్నాడు. అతను జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీ జిల్లాలోని హతియా రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు 12:30 గంటలకు వచ్చే హతియా ఎక్స్‌ప్రెస్ కోసం వేచి ఉన్నాడు. అక్కడ నుండి, రహమాన్ బస్ స్టాండ్‌కు ఆటోరిక్షా తీసుకొని వెళ్లి, ఆ తర్వాత పొరుగున ఉన్న ఛత్ర జిల్లాలోని తన గ్రామమైన అసర్హియాకు బస్సులో వెళ్తాడు.
ఈ మొత్తం ప్రయాణం అతనికి ఒకటిన్నర రోజులు పడ్తుంది.
అయితే, రైలు ఎక్కే ముందు, స్టేషన్ యొక్క నిశ్శబ్ద మూలలో నిలబడి ఉన్న 33 ఏళ్ళ రెహమాన్, ఒక సంవత్సరం వ్యవధిలో రెండవసారి ముంబైని ఎందుకు విడిచిపెడుతున్నాడో మాకు చెప్పిండు.
ఇంటికి పొయ్యే రైలు కోసం వేచి ఉండటానికి కొన్ని రోజుల ముందు, అతని కొత్త యజమాని పని మందగించిందని చెప్పాడు. "ఆయన ఇట్లా అన్నాడు, 'రెహమాన్, క్షమించు, మేము నిన్ను పనిలో పెట్టుకోలేము. తర్వాత ఎప్పుడైనా మళ్లీ ప్రయత్నించవచ్చు. ” అలా అతను, అప్పుడే చేరిన ఉద్యోగాన్ని కోల్పోయాడు – ఆ ఉద్యోగం అసలు ఇంకా మొదలేకాలే.
రెహమాన్ 10 సంవత్సరాల క్రితం జంషెడ్పూర్ లోని కరీం సిటీ కాలేజీ నుండి మాస్ కమ్యూనికేషన్లో BA పట్టభద్రుడయ్యాక ముంబైకి వెళ్లాడు. అతను వీడియో ఎడిటర్‌గా ప్రాజెక్ట్ ఆధారిత అసైన్మెంట్లను చేపట్టాడు. నగరంలో తనను తాను నిలబెట్టుకోనికి, ఇంటికి కొంత డబ్బు పంపడానికి తగినంత సంపాదించేటోడు.




