“వాళ్ళు నన్ను చంపేసి ఉండేవాళ్ళు...” పక్కనే ఆడుకుంటున్న తన ఆరేళ్ళ కూతుర్ని చూస్తున్న అరుణ (28) ముఖంలో ఏదో తెలియని అయోమయం కనబడింది. ఆ “వాళ్ళు” ఆమె కుటుంబ సభ్యులే. అరుణ ఎందుకలా ప్రవర్తించేదో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. “నేను వస్తువులను విసిరి కొట్టేదాన్ని. ఇంట్లో ఉండేదాన్ని కాదు. మా ఇంటి దగ్గరికి ఎవరూ వచ్చేవారు కారు...”
తమిళనాడులోని కాంచీపురమ్ జిల్లాలో, తన ఇంటి దగ్గరున్న కొండల్లో తిరుగుతూ ఆమె తరచూ తప్పిపోయేవారు. తమను కొడుతుందేమోనన్న భయంతో ఆమెకు దూరంగా కొందరు పారిపోతే, మరికొందరు ఆమెపై రాళ్ళు విసిరేవారు. అరుణ తండ్రి ఆమెను ఇంటికి తీసుకువచ్చి, ఆమె మళ్ళీ బయటకు వెళ్ళకుండా ఒక్కోసారి కుర్చీకి కట్టేసేవారు.
అరుణ (ఆమె అసలు పేరు కాదు) స్కిట్సఫ్రీనియా (schizophrenia) తో బాధపడుతున్నప్పుడు, ఆమెకు 18 ఏళ్ళు. ఆ మానసిక రుగ్మత ఆమె ఆలోచనా తీరుపై, అనుభూతి చెందే విధానంపై, ప్రవర్తనపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
కాంచీపురమ్‌లోని చెంగల్పట్టు తాలూకా, కొండంగి గ్రామంలో ఉన్న దళిత కాలనీలో తన ఇంటి బయట కూర్చొనివున్న అరుణ ఒకప్పుడు తను పడ్డ కష్టాలను నెమరువేసుకున్నారు. ఉన్నట్టుండి ఆమె అక్కడినుంచి లేచి వెళ్ళిపోయారు. గులాబీ రంగు నైటీలో, చిన్నగా కత్తిరించిన జుట్టుతో, పొడవుగా, నలుగు రంగులో ఉన్న ఆమె వంగిపోయి నడుస్తున్నారు. తన ఒంటిగది పూరిగుడిసెలోకి వెళ్ళి, డాక్టర్ రాసిన మందుల చీటీ, రెండు టాబ్లెట్ స్ట్రిప్‌లతో తిరిగి వచ్చారు. “వీటి వల్ల నేను నిద్రపోగలుగుతున్నాను. ఇవేమో నరాల సంబంధిత సమస్యలను నివారించడానికి. నేనిప్పుడు బాగా నిద్రపోతున్నాను. ఈ మందులు తీసుకోవడానికి ప్రతి నెలా సెంబాక్కమ్ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)కి వెళ్తాను,” ఆ టాబ్లెట్లను చూపిస్తూ వివరించారామె.
శాంతి శేష లేకపోయుంటే అరుణ కు వచ్చిన జబ్బు గుర్తించబడి ఉండేదే కాదు.



