ఉచితంగా వచ్చే భోజనమంటూ ఏదీ లేదు.
మీరు అస్సాంలోని అతిపెద్ద బ్రహ్మపుత్రానది మధ్యలో ఉండే మాజులీ నదీద్వీపంలో రద్దీగా ఉండి, ప్రయాణికులను అటూ ఇటూ చేరవేసే కమలాబారీ ఘాట్లో తినుబండారాల దుకాణాలను పరిశీలించే అదృష్టం కలిగిన ఆవు అయితే తప్ప!
ముక్తా హజారికాకు ఈ విషయం బాగా తెలుసు. మాతో మాట్లాడుతుండగా మధ్యలో, ఏదో కదిలిన చప్పుడు విన్న అతను అకస్మాత్తుగా మాతో మాటల్ని ఆపేసి, తన తినుబండారాల దుకాణం ముందువైపుకు పరిగెట్టాడు. అక్కడ ఓ పశుజాతి చొరబాటుదారుడు కౌంటర్‌లో ఉన్న ఆహార పదార్థాలను తినడానికి ప్రయత్నిస్తున్నాడు.
అతను ఆ ఆవును అక్కడి నుండి తరిమేసి, వెనక్కి తిరిగి నవ్వుతూ, “నేను నా హోటల్(ఆహారశాల)ను ఒక్క నిమిషం కంటే ఎక్కువ సమయం విడిచిపెట్టి పోలేను. ఇక్కడికి దగ్గర్లోనే మేత మేసే ఆవులు వీటిని తినడానికి వచ్చి, ఈ స్థలాన్నంతా గందరగోళం చేసేస్తాయి." అన్నాడు.
10 సీట్లున్న ఈ తినుబండారాల దుకాణంలో ముక్తా మూడు పాత్రలు పోషిస్తున్నాడు: వంటవాడు, సర్వర్, యజమాని. అందుకని, ఆ దుకాణానికి- హోటల్ హజారికా- అతని పేరే ఉండటంలో కూడా అర్థముంది.
కానీ ఆరేళ్లుగా విజయవంతంగా నడుస్తున్న హోటల్ హజారికా, 27 ఏళ్ల ముక్తా సాధించిన ఏకైక ఘనత మాత్రమే కాదు. అతను వినోద ప్రపంచంలో మూడు కళలు తెలిసినవాడు: నటుడు, నాట్యగాడు, గాయకుడు. అంతేకాదు, మాజులీ ప్రజలు కోరినప్పుడు సందర్భానుసారం వారి రూపాన్నీ, హావభావాలనూ మార్చేయగల నైపుణ్యమున్న మేకప్ కళాకారుడు కూడా..
ఆ కళని మనమింకా చూడాల్సే ఉంది. కానీ, ఈలోగా అతను సేవ చేయాల్సిన మనుషులున్నారు.

















