జోనాలి రిసోంగ్ (34) ఆపంగ్ తయారీలో నిపుణురాలు. "కొన్ని రోజుల్లో నేను 30 లీటర్ల కంటే ఎక్కువగానే ఆపంగ్ తయారుచేయగలను," అంటారామె. చాలామంది మద్యం తయారీదార్లు వారానికి కొన్ని లీటర్లు మాత్రమే తయారుచేయగలరు. ఈ మద్యం తయారీ ప్రక్రియ పూర్తిగా చేతి తయారీ.
గరముర్ పట్టణం సమీపంలోని మూడు గదుల ఇల్లు, ఆ ఇంటివెనుకనున్న పెరడులోనే జోనాలి సారాయి బట్టీ కూడా ఉంది. ఈ పట్టణం అస్సామ్‌లోని బ్రహ్మపుత్ర నదిపై ఉన్న మాజులీ నదీ ద్వీపంలో ఉంది. ఆమె ఇంటి వెనుక ఒక చిన్న చెరువు ఉంది. ఈ చెరువు బ్రహ్మపుత్ర నదికి క్రమం తప్పకుండా వచ్చే వరదల సమయంలో పొంగిపొరలిన నీటితో తయారైనది.
పనిలో మునిగివున్న ఆమెను మేం కలిసినప్పుడు సమయం ఉదయం 6 గంటలయింది. దేశానికి తూర్పు వైపు ఉన్న ఈ ప్రాంతంలో అప్పటికే బారెడు పొద్దెక్కింది. సారాయి కాచేందుకు జొనాలీ పెరట్లో కట్టెల పొయ్యి వెలిగించారు. సారాయి తయారీకి కావలసిన పదార్థాలు, పరికరాలు ఇంట్లో ఒకచోట పెట్టివున్నాయి
అస్సామ్‌లోని షెడ్యూల్డ్ తెగలకు చెందిన మిసింగ్ సముదాయానికి చెందిన ప్రజలు పులియబెట్టిన పానీయమైన ఆపంగ్ను తయారుచేస్తారు. దీనిని భోజనంతోపాటు తీసుకుంటారు. మిసింగ్ భరత్ చండీ చెప్తున్నట్టు, "మా మిసింగ్ ప్రజలం ఆపంగ్ లేకుండా ఎటువంటి పూజలు కానీ పండుగలు కానీ జరుపుకోం." చండీ, గరముర్ మార్కెట్లో ఇంటి తరహా భోజనాన్ని అందించే మాజులీ కిచెన్ యజమాని.
బియ్యాన్నీ, కొన్ని మూలికలనూ ఉపయోగించి తయారుచేసే ఈ లేత మీగడ రంగు పానీయాన్ని జొనాలీ వంటి మిసింగ్ మహిళలు మాత్రమే తయారుచేసి గరముర్లోని హోటళ్ళకూ దుకాణాలకూ అమ్ముతారు. "మగవాళ్ళు దీన్ని తయారుచేయడానికి ఇష్టపడరు. దీన్ని తయారు చేయడం శారీరక శ్రమతో కూడుకున్నదనీ, ఇందులో ఉపయోగించే మూలికలను సేకరించటం చాలా కష్టమైన పని అనీ వాళ్ళు భావిస్తారు," నవ్వుతూ చెప్పారు జొనాలీ.






















