"అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడే కానిచ్చేస్తాను," గుబురుగా పెరిగి ముళ్ళతో నిండిన తేయాకు పొదల మధ్య కొద్దిగా ఖాళీగా ఉన్న స్థలం చూపుతూ దియా టొప్పో (అసలు పేరు కాదు) చెప్పారు. "ఈరోజు ఉదయమే నన్ను తేనెటీగ కుట్టింది, ఇక్కడ పాములు కూడా కాటేయవచ్చు," అంటూ ఆమె  ఆందోళనగా చెప్పారు.

రోజువారీ కూలీల పనిచేసే పరిస్థితులు మామూలుగానే కష్టతరంగా ఉంటాయి. అందులోను తేయాకు తోటల్లో పనిచేసే మహిళా శ్రామికులైతే మరుగుదొడ్డికి వెళ్లాలన్నా తెలియని ప్రమాదాలేవో పొంచి ఉండే దుర్భరమైన స్థితి.

"గతంలో, నేను యవ్వనంలో ఉన్నరోజుల్లో, అత్యవసర పరిస్థితుల్లో సైకిల్‌పై వెళ్ళి మా ఇంట్లోని మరుగుదొడ్డి వాడి వద్దాం అనుకునేదాన్ని," అని ఈ 53 ఏళ్ల శ్రామికురాలు గుర్తుతెచ్చుకున్నారు. కానీ అలా వెళ్లి రావటం వల్ల ఆమె తేయాకు కోసే సమయం తక్కువయ్యేది. “నేను రోజూ కోయవలసిన తేయాకు లక్ష్యాన్ని అందుకోవాల్సి ఉంటుంది. లేదంటే నాకు వచ్చే కూలీ డబ్బులు నష్టపోతాను.”

ఆమెతోపాటు పని చేసే సునీత కిస్కూ (అసలు పేరు కాదు) అంగీకరిస్తూ ఇలా చెప్పింది, "మాకు ఉన్నవి రెండే మార్గాలు - మా వల్ల అవుతే మూత్ర విసర్జన చేయాలి అనే కోరికను రోజంతా అణుచుకోవటం లేదా ఇక్కడే (బయలులో) పని కానివ్వటం. కానీ ఇక్కడ ఉండే పురుగులు, జలగల వల్ల అది చాలా ప్రమాదకరం."

కొన్ని తేయాకు కంపెనీలు ఒక గొడుగు, ఒక జత చప్పల్ (చెప్పులు), ఒక త్రిపల్ (టార్పాలిన్), ఒక ఝూరి (సంచి) సరఫరా చేస్తారు. “మొక్కల్లో ఉండే నీటి వల్ల మా బట్టలు తడిసిపోకుండా త్రిపల్ కాపాడుతుంది. బూట్ల లాంటి ఇతర వస్తువులన్నీ మేమే కొనుక్కోవలసి వస్తుంది,” అని దియా చెప్పారు

"మేం ఒకసారి మొదలుపెడితే ఆగకుండా 10 గంటలు పని చేయవలసి వస్తుంది," అని 26 ఏళ్ళ సునీత చెప్పింది. తాను పనిచేసే తేయాకు తోటకి రెండు కిలోమీటర్ల నడక దూరంలో ఉన్న తమ ఇంటిలోనున్న మరుగుదొడ్డికి వెళ్లవలసి వస్తే కొన్ని గంటల వేతనం కోల్పోవలసి వస్తుంది. ఆ ఇద్దరు బిడ్డల తల్లి అంత నష్టాన్ని భరించలేదు.

PHOTO • Adhyeta Mishra
PHOTO • Adhyeta Mishra

ఎడమ: పశ్చిమ బెంగాల్, జల్పాయిగురిలోని ఒక తేయాకు తోట. కుడి: గొడుగును ఉపయోగించి తమను తాము ఎండ బారి నుండి కాపాడుకుంటున్న శ్రామికులు

పశ్చిమ బెంగాల్ లోని దుయార్ ప్రాంతంలో గల తేయాకు తోటల్లో పనిచేసే వేలాదిమంది రోజువారి కూలీల్లో దియా, సునీతతో సహా అత్యధికులు మహిళలే. పేరు బయట పెట్టకుండా ఉండే షరతుపై చాలామంది మహిళలు పని వేళల్లో మరుగుదొడ్డికి వెళ్లడం అసాధ్యమని PARIతో చెప్పారు.

మూత్ర విసర్జన సమయంలో భరించలేనంత మంటగా ఉన్నప్పుడు వారు సీనియర్ ఎఎన్ఎం(ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్) చంపా డే (అసలు పేరు కాదు) దగ్గరకు వెళతారు. మూత్ర విసర్జన సమయంలో మంట, మూత్రంలో రక్తం, ఇవి మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌ను సూచిస్తాయని డే చెప్పారు. "ఇది నీరు తక్కువగా తాగడం వల్ల వస్తుంది," అని 34 సంవత్సరాలుగా ఈ తేయాకు శ్రామికుల కోసం పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్త డే చెప్పారు.

తేయాకు తోటల చుట్టు పక్కల కొన్ని ప్రాంతాల్లో తేయాకు కంపెనీవారు మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేసినప్పటికీ, "అధిక శాతం మహిళా శ్రామికులు బహిరంగ ప్రదేశాలలో మూత్ర విసర్జన చేయకుండా ఉండటం కోసం ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోరు," అని చంపా అన్నారు.

మరుగుదొడ్లు దూరంగా ఉండటంవల్ల అది వారి తేయాకులు కోసే సమయాన్ని తినేయడమే కాకుండా వారు వేతనం కూడా కోల్పోవలసి వస్తుంది. ఒక రోజు కూలి రూ. 232 సంపాదించడానికి ఒక్కో శ్రామికురాలు 20 కిలోల ఆకులు సేకరించవలసి ఉంటుంది. ఏమాత్రం విరామం తీసుకోకుండా రోజుకు పది గంటలు పని చేస్తేనే గంటకు సుమారుగా 2 కిలోల ఆకులు కోయగలుగుతారు

PHOTO • Adhyeta Mishra

మరుగుదొడ్డికి వెళ్లటం వల్ల ఆకులు కోసే సమయం తక్కువైపోతుంది, వేతనం నష్టపోవలసి వస్తుంది

“ఎండ వేడిమి వల్ల నేను రెండు గంటల్లో కేవలం 2 కేజీల పత్తా (ఆకులు) మాత్రమే కోయగలిగాను,” అని పుష్పా లక్రా (అసలు పేరు కాదు) తెలిపింది. 26 ఏళ్ల లక్రా ఉదయం 7:30 కి వచ్చి సాయంత్రం సూర్యాస్తమానికి కొద్దిగా ముందు (5 గంటలకి) తిరిగి వెళ్ళిపోతుంది. గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే ఆమె నిత్యకృత్యం. ఆమె తల మీదుగా కట్టుకున్న వలవంటి ఝారి (సంచి)లో ఆమె కోసిన పచ్చటి ఆకులు మెరుస్తూ ఉన్నాయి.

"వేసవిలోనూ, వర్షాకాలంలోనూ చాలా మటుకు మా లక్ష్యాన్ని చేరుకోవటం కష్టతరమవుతుంది. దానివల్ల మా రోజువారీ హాజిరా (కూలీ) డబ్బుల నుంచి రూ. 30 నష్టపోవలసి వస్తోంది," అని గత ఐదు సంవత్సరాలుగా తేయాకు తోటల్లో పనిచేస్తోన్న దీప వురావ్ (అసలు పేరు కాదు) చెప్పారు.

బహిష్టుతో ఉన్న మహిళలకు మరుగుదొడ్ల వసతి లేకపోవడం అనేది ఒక పీడకలలాంటిది. 28 ఏళ్ల మేరీ కిస్కూ (అసలు పేరు కాదు), "ఇక్కడ సానిటరీ ప్యాడ్లు మార్చుకోవడానికి ఏ రకమైన వసతులు లేవు," అని చెప్పింది. ఆమె గత పదేళ్ళుగా ఇక్కడ పనిచేస్తోంది. "ఒకసారి నేను పనిలో ఉండగా రక్తస్రావం మొదలైంది. అయితే నా లక్ష్యాన్ని పూర్తి చేయకుండా నేను ఇంటికి వెళ్ళలేకపోయాను. ఆ రోజు రక్తంతో తడిచిన బట్టలతోనే ఇల్లు చేరాను," అంటూ మేరీ గతాన్ని గుర్తు చేసుకుంది.

స్థానిక ఆశా (ASHA) వర్కర్ రాణి హోరో రుతుక్రమ సమయంలో పాటించవలసిన పరిశుభ్రత ప్రాముఖ్యాన్ని గురించి అక్కడి మహిళల్లో అవగాహన పెంపొందించటానికి కృషి చేస్తున్నారు. “అపరిశుభ్రమైన మరుగుదొడ్లు, తగినంత నీటి సరఫరా లేకపోవడం, ఋతుక్రమ సమయంలో మురికి బట్టలను వాడటం ఇవన్నీ అనారోగ్యానికి దారితీయటమే కాకుండా గర్భిణీలకు కూడా హాని కలగజేస్తాయి,” అని గత పది సంవత్సరాలుగా ఆ శ్రామికులతో కలిసి పనిచేస్తున్న రాణి తెలిపారు.

తేయాకు తోటల్లో పనిచేసే చాలా మంది మహిళా కార్మికులు అల్ప రక్తపోటు (లో బి.పి.) తో కూడా బాధపడుతున్నారని చంపా చెబుతూ, "మహిళల్లో క్షయవ్యాధి, రక్తహీనత వల్ల ప్రసవ సమయంలో మరింత ప్రమాదం ఏర్పడుతుంది," అని అన్నారు.

PHOTO • Adhyeta Mishra
PHOTO • Adhyeta Mishra

చంటి పిల్లలను చూసుకోవటానికి ఎవరూ లేని కారణంగా చాలామంది మహిళలు పిల్లలను తమతోపాటు పనిప్రదేశాలకు తీసుకొస్తారు. పసిబిడ్డలను ఉయ్యాలలూపి, నిద్రపుచ్చటానికి నీడ ఉన్న ప్రాంతాల్లో దుపట్టాలను (కుడి) కడతారు

PHOTO • Adhyeta Mishra
PHOTO • Adhyeta Mishra

ఎడమ: తేయాకు తోటల్లో పనిచేసే మహిళా శ్రామికులతో మాట్లాడుతున్న ప్రాంతీయ ఆరోగ్య కార్యకర్తలు  కుడి: జల్పాయిగురిలోని ఒక  తేయాకు తోటలో ఉన్న ఆరోగ్య సంరక్షణ కేంద్రం

పుష్ప, దీప, సునీత లాంటి శ్రామికులు ఉదయం ఆరున్నరకే తమ తమ ఇంటి పనులన్నీ ముగించుకుని బయటపడతారు. "తేయాకు తోటలకు సరైన సమయానికి చేరుకోవటానికి, వెంటనే పని మొదలుపెట్టటం కోసం చాలామంది మహిళలు ఉదయం పూట అల్పాహారం తీసుకోవటం మానేస్తారు," అని సామాజిక ఆరోగ్య కార్యకర్త రంజనా దత్త (అసలు పేరు కాదు) తెలిపారు. సరైన భోజన విరామం లేని కారణంగా ఈ శ్రామికులు మధ్యాహ్న భోజనాన్ని కూడా అంతంత మాత్రంగానే చేస్తారు. "అందువల్లనే ఇక్కడ చాలామంది మహిళా శ్రామికులు అధిక రక్తహీనతతో బాధపడుతున్నారు," అని రంజన చెప్పారు.

"మేం అనారోగ్యం పాలైతే సెలవు కోసం ఆరోగ్య కేంద్రంలో (కొన్ని టీ తోటల్లో ఈ సౌకర్యం ఉంది) దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ దీనివల్ల మా వేతనంలో నాలుగవ వంతు కోతపడుతుంది. ఆ నష్టాన్ని మేం భరించలేం," అని మేరీ తెలిపింది. చాలామంది శ్రామికులు ఆమెతో ఏకీభవిస్తారు. తాత్కాలిక శ్రామికులైతే కొన్ని గంటలు పని చేయకపోయినా మొత్తం వేతనాన్ని కోల్పోతారు.

తేయాకు తోటల్లో పనిచేసే అధిక శాతం మహిళా కార్మికులు తమ పిల్లల పాలన, పోషణను వారే చూసుకోవాలి. "నా బిడ్డను ఆసుపత్రికి తీసుకువెళ్ళిన కారణంగా ఈ పూట తోటకు వెళ్ళలేకపోయాను. ఈరోజు కూలీలో నాలుగోవంతు కోత తప్పదు," అని శాశ్వత కార్మికురాలైన పంపా వురావ్(అసలు పేరు కాదు) చెప్పారు.

మీనా ముండా (అసలు పేరు కాదు) వంటి చాలామంది మహిళలు తమ చంటిబిడ్డల్ని ఇంటి వద్ద చూసుకోవటానికి ఎవరూ లేని కారణంగా పని ప్రదేశానికి తీసుకొస్తారు. ఇది వారి పనిపై ప్రభావం చూపుతుంది. "నేను పని మీద ఎక్కువ ధ్యాస పెట్టలేకపోతున్నాను," అని ఇద్దరు బిడ్డల తల్లి అయిన మీనా చెప్పింది.

తమ పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టడానికి ఇంత తక్కువ వేతనాలు చాలామంది మహిళలకు సరిపోవు. "వీడు నా మొదటి బిడ్డ. వాడి చదువు కోసం ఖర్చు చేయగలమో లేదో నాకు తెలియదు," అని తన ఏడు నెలల కొడుకును ఉద్దేశించి మాట్లాడుతూ 20 ఏళ్ల కార్మికురాలు మంపి హఁసదా అంటోంది..

చాలామంది మహిళలు ఈ కథనం కోసం తమ పేర్లను ప్రచురించకూడదు అనే షరతుపై వారి అనుభవాలను పంచుకున్నారు.

అనువాదం: నీరజ పార్థసారథి

Student Reporter : Adhyeta Mishra

ଆଧ୍ୟେତା ମିଶ୍ର କୋଲକାତାର ଯାଦବପୁର ବିଶ୍ୱବିଦ୍ୟାଳୟରେ ତୁଳନାତ୍ମକ ସାହିତ୍ୟର ସ୍ନାତକୋତ୍ତର ଛାତ୍ରୀ। ତାଙ୍କର ମଧ୍ୟ ଲିଙ୍ଗ ଅଧ୍ୟୟନ ଏବଂ ସାମ୍ବାଦିକତାରେ ରୁଚି ରହିଛି।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Adhyeta Mishra
Editor : Sanviti Iyer

ସନ୍ୱିତୀ ଆୟାର ପିପୁଲ୍ସ ଆର୍କାଇଭ ଅଫ୍‌ ରୁରାଲ ଇଣ୍ଡିଆରେ ଜଣେ ବିଷୟବସ୍ତୁ ସଂଯୋଜିକା ଭାବେ କାର୍ଯ୍ୟ କରୁଛନ୍ତି। ଗ୍ରାମୀଣ ଭାରତର ପ୍ରସଙ୍ଗ ଉପରେ ଦସ୍ତାବିଜ ସଂଗ୍ରହ କରିବା ଏବଂ ରିପୋର୍ଟ ପ୍ରସ୍ତୁତ କରିବାରେ ସହାୟତା ଲାଗି ସେ ମଧ୍ୟ ଛାତ୍ରଛାତ୍ରୀଙ୍କ ସହ କାମ କରିଥାନ୍ତି।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Sanviti Iyer
Translator : Neeraja Parthasarathy

Neeraja Parthasarathy is a teacher, translator and eclectic reader in both English and Telugu.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Neeraja Parthasarathy