భారతీయ బిలియనీర్ల జాబితా 12 నెలలలో 102 నుంచి 140 కు చేరినట్లుగా ఫోర్బ్స్ 2021 జాబితా చెప్తోంది. బిలియనీర్ల గురించి వారి ఆస్తి గురించి అయితే ఫోర్బ్స్ ని నమ్మవచ్చు. వారి ఉమ్మడి సంపద, పోయిన ఏడాదిలో “596 బిలియన్ డాలర్లు, అంటే ఇంచుమించుగా రెట్టింపు అయింది.”
దీని అర్థమేటంటే మన దేశంలో 140 మంది మనుషులు లేదా 0.000014 శాతం జనాభా, మన భారత GDP అయిన 2.62 ట్రిలియన్లో 22.7 శాతం లేదా ఐదోవంతు ఆస్తిని కలిగి ఉన్నారు. ఇప్పుడు GDP అన్న పదంలో gross అన్న మాటకు అర్ధం కూడా వేరుగా ధ్వనిస్తుంది.
చాలా వరకూ మన భారతీయ దినపత్రికలు ఫోర్బ్స్ వ్యక్తపరచిన ఈ విషయాన్ని ఒప్పుదలతో చాలా మామూలుగా చెప్పారు. కానీ ఎటువంటి పద్ధతిలో ఈ సంపాదన జరిగిందో తెలిసిన విషయాన్ని నిజాయితీగా, కట్టెవిరిగినట్లుగా చెప్పకుండా కావాలనే వదిలేశారు.
“ఇంకో కోవిడ్ 19 తరంగం భారత దేశంలో వ్యాపిస్తోంది. ఇప్పుడు 12 మిలియన్ కేసుల కన్నా ఎక్కువ అయ్యాయి. కానీ దేశ స్టాక్ మార్కెట్ భుజాలు విదిలించుకుని రొమ్ము విరిచి కొత్త ఎత్తులకు ఎగబ్రాకింది. సెన్సెక్స్ అంతకు ముందు ఏడాది కన్నా పోయిన ఏడాది 75 శాతం పెరిగింది. మన దేశంలో బిలియనీర్ల సంఖ్య 102 నుండి 140 కు వెళ్లి, వారి ఉమ్మడి ఆస్తి దాదాపు రెట్టింపయి 596 బిలియన్ $ లకు చేరింది.” అని ఫోర్బ్స్ తన మొదటి పేరా లోనే చెప్పింది.
అవును, ఈ 140 మంది ప్లూటోక్రాట్ల సంపద 90.4 శాతం పెరిగింది - ఒక సంవత్సరంలో జిడిపి 7.7 శాతం కుదించింది. వలస కార్మికుల రెండవ తరంగాన్ని మనం చూస్తుండగానే ఈ విజయాల వార్తలు వస్తాయి - ఇదివరకులాగానే లెక్కించడానికి కూడా వీలులేనంత సంఖ్యలో వీరు చెదరిపోయి - నగరాలను వదిలి మళ్లీ తమ గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. ఫలితంగా వచ్చే ఆ ఉద్యోగ నష్టాలు GDP కి ఏమాత్రం మేలు చేయవు. కానీ దేవుడి దయవలన, మన బిలియనీర్లకు అంతగా హాని జరగదు. ఈ విషయంలో మనకు ఫోర్బ్స్ ఎలాగూ హామీ ఇస్తుంది.
అంతేకాకుండా, బిలియనీర్ సంపద తర్కం కోవిడ్ -19 తర్కానికి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. సంపదంతా ఒకే చోట చేరిస్తే, అధిక వ్యాప్తికి తక్కువ అవకాశం ఉంటుంది.







