నుస్రత్ బేనో ఇరవైఏళ్ళ లోపు ఆడవారిని, పిల్లలను కనవద్దని ఒప్పించింది. ఆమె ఈ మహిళల అత్తామామలతో, గర్భనిరోధకం వాడేందుకు అనుమతినివ్వమని దెబ్బలాడింది. ఆమె మహిళలను కానుపుల కోసం ఆసుపత్రికి తీసుకు వెళ్ళింది. కానీ బీహార్ లో అరారియా జిల్లాలో రాంపూర్ గ్రామంలోని ఈ ముప్ఫయ్యిదేళ్ల ఆశ, తన పనులన్నింటిలోనూ మగవారికి వేసెక్టమి చేయించడమే అతి కష్టమైన పని అని చెప్పింది.
“పోయిన ఏడాది, ఒక్క మాగాయన మాత్రమే ఒప్పుకున్నాడు.” ఫోర్బ్స్ గంజ్ బ్లాక్ లోని ఆమె గ్రామంలో 3,400 మంది జనాభా ఉన్నారు. “అతను వేసెక్టమి చేయించుకున్నాక, అతని భార్య నన్ను చెప్పు తీసుకుని కొట్టడానికి వచ్చింది,” నవ్వుతూ అన్నది ఈ నలుగురు పిల్లల తల్లి.
రాంపూర్ లోని ఈ మొండి వైఖరి బీహార్‌లోని మిగిలిన గ్రామాలలో కూడా కనిపిస్తుంది. “వారిని మిగిలిన మగవారందరూ వెక్కిరిస్తారు, అని వారి భయం.” గత సంవత్సరం, బీహార్ ప్రభుత్వం ప్రతి నవంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే, రాబోయే వేసెక్టమీ వారం కోసం, మరో రౌండ్ ప్రచారాన్ని ప్రారంభించబోయే ముందు, వినయ్ కుమార్ నాకు చెప్పారు. "వారు తాము బలహీనంగా మారతామని, సెక్స్ చేయలేమని ఊహించుకుంటారు."
38 ఏళ్ల కుమార్, జెహనాబాద్‌లోని మఖ్దుంపూర్ బ్లాక్‌లోని దాదాపు 3,400 జనాభా ఉన్న బిర్రా గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వికాస్ మిత్రగా గత సంవత్సరంగా పనిచేస్తున్నాడు. అతని విధులలో వివిధ ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించడం, అమలు చేయడం వంటివి ఉన్నాయి. పురుషులను వేసెక్టమీ చేయించుకోవడానికి ఒప్పించే అతికష్టమైన పని కూడా అతని విధుల జాబితాలో ఉంది. ఈ శస్త్ర చికిత్సలో మగవారి వాస్ డిఫెరెన్స్(వీర్యాన్ని మోసే ట్యూబ్‌లు)ని కట్టివేయడం లేదా మూసిచేయడం జరుగుతుంది.
బీహార్‌లో, ఇప్పటికే అతితక్కువగా ఉన్న పురుషుల స్టెరిలైజేషన్లు, NFHS-3 (2005-06) నుండి NFHS-4 (2015-16)కి, 0.6 శాతం నుండి 0 శాతానికి పడిపోయాయి. బీహార్‌లో స్త్రీల స్టెరిలైజేషన్ శాతం కూడా - ప్రస్తుతం 15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల వివాహిత మహిళల్లో 23.8 శాతం నుండి 20.7 శాతం వరకు పడిపోయింది - అయితే ఇది వేసెక్టమీల కంటే చాలా ఎక్కువగానే ఉంది.
బీహార్ సంఖ్యలు దేశవ్యాప్త డేటా ధోరణులను ప్రతిబింబిస్తాయి: భారతదేశం అంతటా, NFHS-4 ప్రకారం ప్రస్తుతం వివాహిత మహిళల్లో 36 శాతం (15-49 ఏళ్ల వయస్సులో) స్టెరిలైజేషన్ చేయించుకున్నట్లు నమోదు అయింది, అయితే ఈ మహిళల్లో 0.3 శాతం మాత్రమే తమ పురుషులకు స్టెరిలైజేషన్‌ను జరిగిందని చెప్పారు.
దేశంలో కండోమ్ వాడకం కూడా చాలా తక్కువగా ఉంది - ప్రస్తుతం 15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల వివాహిత మహిళల్లో 5.6 శాతం మంది మాత్రమే గర్భనిరోధక చర్యగా కండోమ్‌లను వాడతామని చెప్పారు.








