పటచిత్రను తయారు చేయటంలో మొదటి అడుగు ఒక పాటను అంటే పటార్‌గాన్‌ను స్వర పరచటం. "పటచిత్రను గీయటానికి ముందు మేము పాటలలోని చరణాలను సృష్టించాలి... అందులోని లయ రంగులువేసే ప్రక్రియకు ఒక రూపాన్ని ఇస్తుంది," అన్నారు మామొని చిత్రకర్. వారి ఇంట్లో కూర్చుని, ఈ ఎనిమిదవ తరం చిత్రకారిణి పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు కొల్కతా చిత్తడి నేలలను వర్ణిస్తూ ఒక పటచిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ కళారూపానికి ఈ పేరు సంస్కృత పదాలయిన 'పట్ట' లేదా వస్త్రపు ముక్క, 'చిత్ర' లేదా వర్ణచిత్రం (పెయింటింగ్) నుంచి వచ్చింది. చిత్తడి నేలలచే పోషింపబడిన ఈ సంక్లిష్టమైన పర్యావరణ వ్యవస్థను చిత్రించేటప్పుడు మామొని పటచిత్ర ప్రదర్శనతో పాటుగా ‘పటార్‌గాన్’ను ఆలపిస్తారు. మామొని స్వయంగా రాసి, స్వరపరచిన ఈ పాట ఇలా ఆహ్వానంతో మొదలవుతుంది: "వినండి, అందరూ వినండి, శ్రద్ధగా వినండి".
‘అనేక మందికి జీవనాధారం'గా ఉండే తూర్పు కొల్కతా చిత్తడి నేలల ప్రాముఖ్యాన్ని వర్ణిస్తూ ఈ పాట సాగుతుంది. మత్స్యకారులను, రైతులను, పచ్చని పొలాలను కాగితపు చుట్టలు అతికించిన పట(వస్త్రం)పై చిత్రిస్తారు. ఇలా పూర్తయిన పటను ప్రదర్శన సమయంలో నెమ్మదిగా తెరిచినప్పుడు పాటలోని చరణాలకనుగుణంగా చిత్రంలోని భాగాలు బహిర్గతమవుతాయి. ఈ విధంగా చిత్రాల రూపంలోనూ, సంగీతం ద్వారానూ మామొని కళ, చిత్తడి నేలల కథను చెబుతుంది.
పశ్చిమ మేదినీపూర్‌లోని పింగ్లా తాలుకా, నయా గ్రామంలో నివాసముంటోన్న మామొని అంచనా ప్రకారం దాదాపు 400 మంది హస్తకళాకారులు ఆ గ్రామంలో ఉంటున్నారు. ఈ తాలూకాలోని మరే గ్రామంలోనూ ఇంత భారీ ఎత్తున పటచిత్రాలు తయారుచేసే కళాకారులు లేరు. "గ్రామంలోని దాదాపు అన్ని(85) ఇళ్ళ గోడలపై కుడ్యచిత్రాలు (murals) ఉన్నాయి," అంటూ అందమైన రంగులలో చిత్రించిన ఆకులు, అడవి జంతువులు, పువ్వుల చిత్రాలను ప్రస్తావిస్తూ ఇక్కడే నివసించే 32 ఏళ్ల కళాకారిణి మామొని చెప్పారు. "మా గ్రామం మొత్తం అందంగా కనిపిస్తుంది," అని ఆమె అన్నారు.











