2020లో, కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ ప్రకటించబడినప్పుడు, మా గ్రామం నుండి నాకొక సమాచారం వచ్చింది. దాదా, అంటే మా తాత, పడిపోవటంతో ఆయన కాలు విరిగింది. అక్కడ ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్యుడు కనిపించటం చాలా అరుదు. కరోనా కారణంగా సమీపంలోని ప్రైవేట్ క్లినిక్‌లను కూడా మూసివేశారు. నా కుటుంబం ఎలాగోలా ఆయన విరిగిన కాలుకు ప్లాస్టర్ వేసి, ఇంట్లోనే ఆయన్ని చూసుకుంది. కానీ ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ భరించలేని నొప్పితో అరిచేవారు. మరింత బలహీనపడ్డారు. చివరకు ఆ ఏడాది మే నెలాఖరున ఆయన తుది శ్వాస విడిచారు.
ఇదంతా జరిగినప్పుడు నేను ముంబైలో ఉన్నాను. ఒక్కసారిగా పనులు నిలిచిపోవడంతో అందరికీ ఒకేసారి తుపాను దెబ్బకొట్టినట్లయింది. కరోనా భయం ఒకవైపు పెరుగుతోంటే, వీధుల్లో మాత్రం పోలీసులు లాఠీల వర్షం కురిపించారు. జీవనోపాధి స్తంభించిపోయింది. వలస కార్మికులు తమ గ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. నేను బతుకుదెరువు కోసం కూరగాయలు అమ్ముతుంటాను. అందువల్ల మాకు పని చేయడానికి అనుమతి లభించింది. అలా నేను ముంబైలో ఉండిపోయాను. కానీ మా దాదా చనిపోయారని వినగానే, వెంటనే ఉత్తరప్రదేశ్, జౌన్‌పూర్ జిల్లాలోని మా స్వగ్రామానికి వెళ్లాలని చాలా అనిపించింది. నాకు ఆయనతో ఒక భావోద్వేగభరితమైన అనుబంధం ఉండింది. దానికి తోడు అక్కడ మా అమ్మ తప్ప బాధ్యత తీసుకోగల వ్యక్తి ఇంకెవరూ లేరు.
అవి చాలా కష్టంతో కూడుకున్న సమయాలు. దేశం నలుమూలల నుండి వార్తలు వెల్లువెత్తుతున్నాయి: ఇంటికి వేళ్ళేందుకు కాలి నడకన వస్తున్న కొంతమంది కార్మికులు పూర్తిగా అలసిపోయి రైల్వే ట్రాక్‌పై నిద్రపోయారు. రైలు వారి మీదుగా వెళ్లి, వారంతా చితికిపోయారు. ఒక తల్లి తన పాలుతాగే బిడ్డను చేతుల్లో పట్టుకుని ఆహారం, నీరు లేకుండా నడుస్తోంది. దాదా చనిపోయిన తర్వాత, నేను నా బ్యాగ్ సర్దుకుని, ఇంటికి వెళ్ళేందుకు రైళ్ల గురించి ఆరా తీయడానికి సమీప రైలు స్టేషన్, అంధేరి (పశ్చిమ)కి వెళ్లాను. అలహాబాద్‌కి వెళ్లే రైలు నడవడం లేదని అక్కడ నాకు తెలిసింది. వారణాసి వద్ద ఒక రైలు నుంచి రెండు మృతదేహాలు లభ్యమైనట్లు వార్తలు వస్తున్నాయి. యూపీకి వెళ్లాల్సిన రైలు ఒడిశాకు బయలుదేరింది. నేను మా గ్రామానికి చేరుకోవడానికి అలహాబాద్ [ఇప్పుడు ప్రయాగ్‌రాజ్ అని పిలుస్తున్నారు] దాటి ఇంకా 70 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. ఈ సంఘటనలు అప్పటికే బలహీనపడిన నా మనోధైర్యాన్ని మరింత దెబ్బతీశాయి. టాక్సీలో ప్రయాణించవచ్చు, కానీ అందుకు 40,000 నుండి 50,000 రూపాయలు ఖర్చవుతుంది. అంత స్థోమత లేకపోవడంతో ఇంటికి వెళ్లాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకున్నాను. ఇంక వేరే అవకాశమే లేదు.























