"అమ్మాయి పుట్టింది" డాక్టర్ చెప్పారు.

ఇది ఆశాకి నాలుగో సంతానం-  కానీ ఖచ్చితంగా ఆమెకి చివరిది కాదు.  గైనకాలజిస్ట్ తన తల్లి కాంతబెన్‌ని ఓదార్చడం ఆమె విన్నది: "అమ్మా, నువ్వు ఏడవద్దు. అవసరమైతే మరో ఎనిమిది సిజేరియన్లు చేస్తాను. కానీ ఆమె అబ్బాయిని ప్రసవించే వరకు నేను ఇక్కడే  ఉంటాను.  అది నా బాధ్యత. "

దీనికి ముందు, ఆశ కి ముగ్గురు ఆడపిల్లలు, వారందరూ సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా పుట్టారు. ఇప్పుడు ఆమె అహ్మదాబాద్ నగరంలోని మణినగర్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లో పిండం సెక్స్ డిటెక్షన్ పరీక్ష ఫలితం డాక్టర్ గారు చెప్తుంటే వింటున్నది. (ఇటువంటి పరీక్షలు చట్టవిరుద్ధం, కానీ విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి.) ఈ నాలుగు సంవత్సరాలలో ఇది ఆమె నాల్గవ గర్భం. ఆమె కాంతాబెన్ తో 40 కిలోమీటర్ల దూరంలోని ఖన్‌పర్ గ్రామం నుండి ఇక్కడకు వచ్చింది. అక్కడున్నవారు ఈ తల్లి కూతుళ్ళిద్దరినీ ఓదార్చలేకుండా ఉన్నారు. ఆశా మామగారు ఆమెను అబార్షన్ చేయించుకోడానికి అనుమతించరని వారికి తెలుసు.  "ఇది మా విశ్వాసానికి విరుద్ధం" అని కాంతబెన్ అన్నారు.

మరో మాటలో చెప్పాలంటే: ఇది ఆశ కి చివరి గర్భం కాదు.

ఆశా, కాంతాబెన్ లు సాధారణంగా గొర్రెలు, మేకలను మేపుకునే భార్వాడ సంఘానికి చెందినవారు. అయితే, వీరిలో చాలా మంది అహ్మదాబాద్ జిల్లాలోని డోల్కా తాలూకాలో - ఖాన్‌పర్ గ్రామంలో ఉంటారు.  కేవలం 271 గృహాలు, 1,500 మంది కంటే తక్కువ మంది జనాభా (సెన్సస్ 2011) ఉన్న ఈ  గ్రామం లో - అందరు కొన్ని ఆవులను గేదెలను పెంచుతారు. సాంప్రదాయ సామాజిక సోపానక్రమంలో,  కులంపరంగా వారిని తక్కువ స్థాయిలో చూస్తారు. వీరు గుజరాత్‌లో షెడ్యూల్డ్ తెగగా జాబితాలో చేర్చబడ్డారు.

*****

మేము ఆమె కోసం ఎదురుచూస్తున్నాము. ఖాన్‌పర్‌లోని చిన్న గదిలోకి ప్రవేశించిన కాంతాబెన్ ఆమె తల మీద నుంచి చీర కొంగు తీసివేసింది. సమీప గ్రామాల నుండి మరికొంత మంది మహిళలు ఇక్కడ మాతో చేరారు, వారి పునరుత్పత్తి ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడటం అంత సులభమైన విషయం కాదు.

'You don’t cry. I will do eight more caesareans if needed. But I am here till she delivers a boy'

' నువ్వు ఏడవద్దు. అవసరమైతే మరో ఎనిమిది సిజేరియన్లు చేస్తాను. కానీ ఆమె అబ్బాయిని ప్రసవించే వరకు నేను ఇక్కడే ఉంటాను'

"ఈ గ్రామంలో చిన్న, పెద్ద  కుటుంబాలు కలిపి 80 నుండి 90 వరకు ఉన్నాయి" అని కాంతాబెన్ చెప్పారు. "హరిజనులు [దళితులు], వాగ్రిలు, ఠాకూర్‌లు మరియు కుంభార్‌ల [కుమ్మరులు] కూడా ఉన్నారు.  కానీ ఇక్కడ చాలావరకు కుటుంబాలు భార్వాడ వారివి.”  కోలి ఠాకూర్‌లు గుజరాత్‌లో చాలా పెద్ద కుల సమూహం - అయితే వీరిని ఇతర రాష్ట్రాలలో ఉండే థాకుర్లతో పోల్చలేము.

"మా అమ్మాయిలు తొందరగా పెళ్లి చేసుకుంటారు. కానీ వారు 16 లేదా 18 సంవత్సరాల వచ్చే వరకు తమ తండ్రి ఇంట్లోనే ఉంటారు. ఆ తరవాత వారి అత్తమామల వద్దకు వెళ్లడానికి సిద్ధమవుతారు," అని 50 సంవత్సరాలున్న కాంతాబెన్ వివరించారు. ఆమె కూతురు, ఆశకి చాలా తొందరగా వివాహం చేసారు. ఆశకి 24 సంవత్సరాల వయసులోనే ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నాల్గవ సంతానం కోసం ఎదురుచూస్తున్నారు. బాల్య వివాహం నిబంధనల ప్రకారం సమాజంలోని చాలా మంది మహిళలకు వారి వయస్సు, వివాహ సంవత్సరం లేదా వారి మొదటి బిడ్డ జన్మించినప్పుడు వారి వయస్సు గురించిన స్పష్టమైన అవగాహన ఉండదు.

"నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నానో నాకు గుర్తులేదు, కానీ దాదాపు ప్రతి సంవత్సరం నేను గర్భవతి కావడం నాకు గుర్తుంది" అని కాంతాబెన్ చెప్పారు. ఆమె ఆధార్ కార్డులోని తేదీ ఆమె జ్ఞాపకశక్తి వల్ల మాత్రమే నమ్మదగినది.

"నాకు తొమ్మిది మంది అమ్మాయిలు ఉన్నారు, ఆపై ఈ 10 వ సంతానం - ఒక అబ్బాయి" అని ఆ రోజు అక్కడ సమావేశమైన మహిళల్లో హీరాబెన్ భార్వాడ చెప్పింది. “నా కొడుకు 8 వ తరగతి చదువుతున్నాడు, నా కుమార్తెలలో ఆరుగురు వివాహం చేసుకున్నారు, ఇద్దరు ఇంకా పెళ్ళికి ఉన్నారు. మేము ఇద్దరిద్దరికి ఒకేసారి వివాహం చేశాము. ”  ఈ తాలూకాలోని ఖాన్‌పార్ మరియు ఇతర గ్రామాల్లోని సమాజంలో బహుళ, వరుస గర్భాలు సాధారణం. "మా గ్రామంలో ఒకామెకు 13 గర్భస్రావాల తర్వాత ఒక కొడుకు పుట్టాడు." అని హీరాబెన్ చెప్పారు. "ఇది పిచ్చి. ఇక్కడి ప్రజలు అబ్బాయిని పొందే వరకు, అవసరమైనన్ని ఎక్కువ గర్భాలు వచ్చేలా చూస్తారు. వారికి ఏమీ అర్థం కాదు. వారికి ఒక అబ్బాయి కావాలి. నా అత్తగారికి ఎనిమిది మంది పిల్లలు. నా పిన్నికి 16. దానికి మీరు ఏమి చెబుతారు?”

"అత్తమామలకు అబ్బాయి కావాలి" అని తన 40 వ ఏట ఉన్న రమీలా భార్వాడ కూడా చెప్పింది. "మీరు కనుక ఒప్పుకోకపొతే , మీ అత్తగారి నుండి మీ తోటి కోడలు నుండి మీ పొరుగువారి వరకు అందరూ మిమ్మల్ని దూషిస్తారు. ఈ కాలంలో పిల్లలను పెంచడం అంత సులభం కాదు. నా పెద్ద కొడుకు 10 వ తరగతిలో రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మూడోసారి చదువుతున్నాడు. ఈ పిల్లలను పెంచడం అంటే ఏమిటో అర్ధం చేసుకునేది మన స్త్రీలు మాత్రమే. అయితే మన ఏం చేయగలం? "

అబ్బాయికి ఉన్న బలమైన ప్రాధాన్యత కుటుంబాలు తీసుకునే నిర్ణయాలను నిర్దేశిస్తుంది, మహిళల అభిప్రాయానికి పెద్దగా విలువ ఉండదు. "దేవుడు మనలను ఒక కొడుకు కోసం వేచి ఉండమని చెపితే ఏమి  చేయాలి?" అని అడిగింది రమీలా. "నా కొడుకు కంటే ముందు నాకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇంతకు ముందు మేమంతా కొడుకు కోసం ఎదురు చూసేవాళ్లం, కానీ ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా భిన్నంగా ఉన్నాయి.”

"ఏమి తేడా? నాకు నలుగురు అమ్మాయిలు లేరా? " పొరుగున 1,522 మంది జనాభా ఉన్న గ్రామం లానా నుండి వచ్చిన రేఖాబెన్‌ను వ్యంగ్యంగా నవ్వుతు చెప్పింది. మేము మాట్లాడుతున్న మహిళల సమూహం ఈ తాలూకాలోని ఖాన్‌పర్, లానా మరియు అంబలియారా గ్రామాలలోని అహ్మదాబాద్ నగరానికి 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అనేక గ్రామాల నుండి వచ్చింది. ఇప్పుడు వారు ఈ రిపోర్టర్‌తో మాత్రమే కాకుండా తమలో తామే ఆవేశంగా మాట్లాడుకుంటున్నారు. పరిస్థితి మారుతుందనే రమీలా అభిప్రాయాన్ని రేఖాబెన్ ప్రశ్నించారు: "నేను కూడా అబ్బాయి కోసమే ఎదురు చూస్తున్నాను, కదా?" ఆమె అన్నది. "మేము భార్వాదులు, మాకు ఒక కొడుకు ఉండాలి. మాకు ఆడపిల్లలు మాత్రమే ఉంటే వారు మాకు వంధ్యత్వం ఉంది, అని అంటారు.”

'The in-laws want a boy. And if you don’t go for it, everyone from your mother-in-law to your sister-in-law to your neighbours will taunt you'

'అత్తమామలకు అబ్బాయి కావాలి. మరియు మీకు అబ్బాయి పుట్టకపోతే, మీ అత్తగారి, మీ తోటికోడలు నుండి మీ పొరుగువారి వరకు అందరూ మిమ్మల్ని దూషిస్తారు '

సంఘం డిమాండ్లపై రమిలాబెన్ ధైర్యంగా విమర్శించినప్పటికీ, సామాజిక ఒత్తిళ్లు, సాంస్కృతిక సంప్రదాయాలకు అలవాటుపడిన చాలామంది మహిళలు, 'అబ్బాయే కావాలి’  అని ప్రకటించారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన 2015 అధ్యయనం ప్రకారం, అహ్మదాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో 84 శాతం మంది మహిళలు తమకు మగ బిడ్డ కావాలని చెప్పారు. మహిళల్లో ఈ ప్రాధాన్యతకు కారణం పురుషులు: "ముఖ్యంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలలో అధిక వేతన సంపాదన సామర్థ్యం ఉంది; వారు కుటుంబ శ్రేణిని కొనసాగిస్తారు; వారు సాధారణంగా వారసత్వాన్ని స్వీకరిస్తారు."

మరోవైపు, 2015 అధ్యయనం ప్రకారం, అమ్మాయిలు ఆర్థిక భారం అని భావిస్తారు ఎందుకంటే; "వరకట్న వ్యవస్థ; వివాహం తర్వాత వారు సాధారణంగా భర్త కుటుంబ సభ్యులు అవుతారు; [దానితో] అనారోగ్యంలో, వృద్ధాప్యంలో  వారి తల్లిదండ్రుల బాధ్యత వారు తీసుకోరు."

*****

3,567 జనాభాతో సమీపంలోని అంబలియారా గ్రామానికి చెందిన జీలుబెన్ భార్వాడ (30), కొన్నేళ్ల క్రితం ధోల్కా తాలూకాలోని కోత్ (కోఠా అని కూడా పిలుస్తారు) గ్రామానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి ఆమె  ట్యూబల్ లిగేషన్ చేయించుకుంది. కానీ ఆమెకు నలుగురు పిల్లలు పుట్టిన తర్వాతే ఆ స్టెరిలైజేషన్ ప్రక్రియ జరిగింది. "నాకు ఇద్దరు అబ్బాయిలు పుట్టే  వరకు నేను వేచి ఉండాల్సి వచ్చింది" అని ఆమె చెప్పింది. "నాకు 7 లేదా 8 సంవత్సరాల వయసులో వివాహం జరిగింది. నేను రజస్వల అయ్యాక, నన్ను అత్తమామల వద్దకు పంపారు. అప్పుడు నాకు 19 సంవత్సరాలు. నా పెళ్లి బట్టలు మార్చుకోక ముందే, నేను గర్భవతిని అయ్యాను. ఆ తరువాత, దాదాపు రెండు సంవత్సరాలకొకసారి గర్భం ధరిస్తూనే ఉన్నాను. ”

గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం లేదా గర్భాశయ పరికరం (కాపర్-టి) అమర్చడం గురించి ఆమె అనిశ్చితంగా ఉంది. "అప్పుడు నాకు ఏమి తెలియదు.  తెలిసుంటే, బహుశా నాకు ఇంత మంది పిల్లలు ఉండేవారు కాదు,” ఆమె ఆలోచిస్తూ చెప్పింది. "అయితే మనలో భార్వాడ మాతాజీ (మేలాది మా, ఒక సమాజ దేవత) ఏమి ఇస్తారో మనం అది అంగీకరించాలి. నాకు మరొక బిడ్డ పుట్టకపోతే, ప్రజలు ఏదోకటి అనేవారు. నేను నా భర్త కాక వేరే వ్యక్తి మీద ఆసక్తి కలిగి ఉన్నానని వారు భావిస్తారు. వాటన్నింటినీ ఎలా ఎదుర్కోవాలి?"

జీలుబెన్ కు  మొదట ఒక అబ్బాయి పుట్టాడు. కానీ కుటుంబం ఆమెకు మరొకటి కావాలని ఆదేశించింది - ఆమె రెండొవసారి మళ్లీ అబ్బాయి పుడతాడు అనుకుంటే ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. అమ్మాయిలలో ఒకరు మాట్లాడలేరు, వినలేరు. "మ భార్వాదులకు, ఇద్దరు అబ్బాయిలు కావాలి. ఈ రోజు, కొంతమంది మహిళలు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉంటే సరిపోతుందని భావిస్తున్నారు, కానీ మాతాజీ ఆశీర్వాదం కోసం మేము ఇంకా వేచి ఉన్నాము, ” అని ఆమె చెప్పింది.

Multiple pregnancies are common in the community in Khanpar village: 'There was a woman here who had one son after 13 miscarriages. It's madness'.
PHOTO • Pratishtha Pandya

ఖాన్‌పర్ గ్రామంలో సమాజంలో బహుళ గర్భధారణ సాధారణం: ' ఇక్కడ 13 గర్భస్రావాల తర్వాత ఒక కుమారుడు కలిగిన ఒక మహిళ ఉంది. ఇది ఒక పిచ్చి తనం'

జీలుబెన్ , తన రెండవ కుమారుడు జన్మించిన తర్వాత వేరే మహిళ నుంచి కుటుంబ నియంత్రణకు సంబంధిన సమాచారం తీసుకొని కోత్‌లో ట్యూబెక్టమీ కోసం ఆమె ఆడపడచుతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకుంది. "నా భర్త కూడా నన్ను ట్యూబెక్టమీ చేసుకోమని చెప్పారు," అని ఆమె చెప్పింది. "అతను ఎంత సంపాదించగలడో, దాని పరిమితులేంటో,  ఇంటికి ఎంత కావాలో  అతనికి తెలుసు. మాకు మంచి ఉపాధి అవకాశాలు కూడా లేవు. మా వద్ద ఉన్నది ఈ జంతువులు మాత్రమే. "

ధోల్కా తాలూకాలోని సంఘం సౌరాష్ట్ర లేదా కచ్‌లోని భార్వాడ్ పశుపోషకుల నుండి చాలా భిన్నంగా ఉంటుంది. ఆ సమూహాలు గొర్రెలు, మేకలను ఎక్కువగా కలిగి ఉంటారు, ఢోల్కాలోని భార్వాదులు ఎక్కువగా కొన్ని ఆవులు లేదా గేదెలను మాత్రమే పెంచుతారు. "ఇక్కడ ప్రతి కుటుంబంలో కేవలం 2 నుంచి 4 వరకు జంతువులు ఉంటాయి" అని అంబలియార నుండి వచ్చిన జయబెన్ భార్వాడ్ చెప్పారు. "ఇది ఇంట్లో మా అవసరాలను తీర్చదు. వీటి నుంచి ఆదాయం లేదు. మేము వాటికీ మేత ఏర్పాటు చేస్తాము. కొన్నిసార్లు వేరేవాళ్లు, పంట సీజన్‌లో మాకు కొంత వరి ఇస్తారు - లేకుంటే, మేము దానిని కూడా కొనుగోలు చేయాలి. ”

"ఈ ప్రాంతాలలోని పురుషులు రవాణా, నిర్మాణం, వ్యవసాయం వంటి వివిధ రంగాలలో నైపుణ్యం లేని కార్మికులుగా పనిచేస్తున్నారు" అని గుజరాత్‌లోని భార్వాడ్ల హక్కులపై పనిచేసే మల్ధారీ సంస్థ అహ్మదాబాద్‌కు చెందిన అధ్యక్షురాలు భావన రబారీ చెప్పారు. పని లభ్యతను బట్టి రోజుకు 300 రూపాయల వరకు ఇస్తారు. "

For Bhawrad women of Dholka, a tubectomy means opposing patriarchal social norms and overcoming their own fears

డోల్కాలోని భార్వాడ్ మహిళలకు, ట్యూబెక్టమీ అంటే పితృస్వామ్య సామాజిక నిబంధనలను వ్యతిరేకించడం, వారి స్వంత భయాలను అధిగమించడం

జయాబెన్ చెప్పింది, "పురుషులు బయటకు వెళ్లి కూలీ పనులు చేస్తారు. నా భర్త సిమెంట్ సంచులను ఎత్తి 200-250 రూపాయలు వరకు సంపాదిస్తాడు.” అతనికి పని దొరికే సమీపంలోనే సిమెంట్ ఫ్యాక్టరీ ఉండటం మా అదృష్టంగా అనిపిస్తుంది. ఆమె కుటుంబానికి, ఇక్కడ చాలా మందిలాగే, BPL (దారిద్య్ర రేఖకు దిగువన) రేషన్ కార్డు కూడా లేదు.

జయబెన్ -ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి కలిగిన తర్వాత కూడా తన గర్భధారణను ప్లాన్ చేయడానికి గర్భనిరోధకమాత్రలు లేదా కాపర్-టిని ఉపయోగించడానికి భయపడింది. అలాగే ఆమె శాశ్వత ఆపరేషన్ చేయించుకోవాలని అనుకోవడం లేదు. "నా డెలివరీలన్నీ ఇంట్లోనే అయ్యాయి. వారు ఉపయోగించే అన్ని పనిముట్లను చూసి నేను చాలా భయపడ్డాను. థాకోర్ భార్య ఆపరేషన్ తర్వాత బాధపడటం నేను చూశాను.

"కాబట్టి నేను మా మేలాది దేవతని అడగాలని నిర్ణయించుకున్నాను. ఆమె అనుమతి లేకుండా నేను ఆపరేషన్ కోసం వెళ్లలేను. పెరుగుతున్న మొక్కను కోయడానికి మా దేవత ఎందుకు అనుమతిస్తుంది? కానీ ఈ రోజుల్లో వస్తువులు చాలా ఖరీదైనవి.  ఇంతమంది పిల్లలకు ఎలా తిండి పెట్టాలి? నేను మా దేవతకి చెప్పాను, నాకు తగినంత మంది పిల్లలు ఉన్నారని, కానీ ఆపరేషన్ చేసుకోవాలి అంటే భయం. నేను ఆమెకు నైవేద్యం వాగ్దానం చేశాను. 10 సంవత్సరాల పాటు మాతాజీ నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. నేను ఒక్క మందు కూడా తీసుకోలేదు. "

*****

ఆమె భర్తకు వెసెక్టమీ చేయవచ్చనే ఆలోచన జయబెన్‌తో పాటు సమావేశమైన గ్రూపులోని ఇతర మహిళలందరికీ ఆశ్చర్యకరంగా ఉంది.

వారి ప్రతిచర్య మగ స్టెరిలైజేషన్ గురించి జాతీయ అయిష్టతను ప్రతిబింబిస్తుంది. భారతదేశం అంతటా, 2017-18లో, “మొత్తం 14,73,418 స్టెరిలైజేషన్ ప్రక్రియలలో, కేవలం 6.8% పురుషుల స్టెరిలైజేషన్ ఆపరేషన్లు మరియు అధిక శాతం 93.1% స్త్రీలు ఉన్నారు,” అని జాతీయ ఆరోగ్య మిషన్ నివేదిక పేర్కొంది.

అన్ని స్టెరిలైజేషన్‌ల నిష్పత్తిగా వెసెక్టమీ ప్రాబల్యం మరియు అంగీకారం ఈనాటి కంటే 50 సంవత్సరాల క్రితం కంటే ఎక్కువగా ఉంది, 1970 ల చివరలో, ముఖ్యంగా 1975-77 అత్యవసర పరిస్థితిలో అపఖ్యాతి పాలైన స్టెరిలైజేషన్ తర్వాత బాగా పడిపోయింది. ఆ నిష్పత్తి 1970 లో 74.2 శాతం నుండి 1992 లో కేవలం 4.2 శాతానికి పడిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ బులెటిన్‌లో ఒక పేపర్ పేర్కొంది.

కుటుంబ నియంత్రణ ఎక్కువగా మహిళల బాధ్యతగా పరిగణించబడుతుంది.

ఈ బృందంలో ట్యూబెక్టమీ చేయించుకున్న జీలుబెన్,  “నేను ఆపరేషన్ చేయించుకోడానికి ముందు నా భర్తను ఏదైనా ఉపయోగించమని అడిగే ప్రశ్నే లేదు. అతనికి ఆపరేషన్ చేయవచ్చని కూడా నాకు తెలియదు. ఏదేమైనా, మేము అలాంటి వాటి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు.” ఏదేమైనా, ఆమె భర్త తన సొంతంగా కొన్నిసార్లు డోల్కా నుండి తన అత్యవసర గర్భనిరోధక మాత్రలను కొని తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. “ఆమె ట్యూబెక్టమీకి ముందు సంవత్సరాలలో రూ. 500 లకు మూడు మాత్రలు దొరికేవి"

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాస్తవ పత్రము ఫర్ స్టేట (2015-16) ప్రకారం గ్రామీణ గుజరాత్‌లో కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో పురుష స్టెరిలైజేషన్‌లు కేవలం 0.2 శాతం మాత్రమేనని పేర్కొంది. స్త్రీల స్టెరిలైజేషన్, గర్భాశయ పరికరాలు మరియు మాత్రలతో సహా అన్ని ఇతర పద్ధతుల వల్ల మహిళలు తీవ్రభారాన్ని ఎదుర్కొన్నారు.

ధోల్కాలోని భార్వాద్ మహిళలకు, ట్యూబెక్టమీ అంటే పితృస్వామ్య కుటుంబాన్ని ఎదిరించి, సమాజ నిబంధనలకు విరుద్ధంగా వెళ్లడం, అలాగే వారి స్వంత భయాలను అధిగమించడం.

The Community Health Centre, Dholka: poor infrastructure and a shortage of skilled staff add to the problem
PHOTO • Pratishtha Pandya

కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ధోల్కా: మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం మరియు నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత సమస్యను మరింత పెంచాయి

"ఆశా [గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త] కార్యకర్తలు మమ్మల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళతారు" అని 20 ఏళ్ల వయసులో ఉన్న కాంతాబెన్ కోడలు కనక్‌బెన్ భర్వాద్ చెప్పారు. "అయితే మేమంతా భయపడ్డాం." ఆమె విన్నది "ఒకసారి ఆపరేషన్ సమయంలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించింది అని. డాక్టర్ పొరపాటున వేరే పేగును కట్ చేయడంతో ఆమె ఆపరేషన్ టేబుల్ పైనే మరణించింది. ఇది జరిగి ఒక సంవత్సరం కూడా కాలేదు."

కానీ డోల్కాలో గర్భధారణ కూడా ప్రమాదకరం. ప్రభుత్వం నిర్వహిస్తున్న సామూహిక ఆరోగ్య కేంద్రంలో (కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సిహెచ్‌సి) కన్సల్టింగ్ వైద్యుడు, నిరక్షరాస్యత, పేదరికం వలన గర్భధారణకు సహేతుకమైన అంతరం లేకుండా బహుళ గర్భధారణకు దోహదం చేస్తాయని చెప్పారు. మరియు "చెక్-అప్ కోసం ఎవరూ ఒక క్రమంతో రారు" అని ఆయన చెప్పారు. ఈ కేంద్రాన్ని సందర్శించే చాలా మంది మహిళలు పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్నారు. "ఇక్కడకు వచ్చేవారిలో దాదాపు 90% మంది హిమోగ్లోబిన్ 8 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు."

కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మౌలిక సదుపాయాలు మరియు నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత దీనికి కారణం. సోనోగ్రఫీ యంత్రాలు లేవు, మరియు పొడవైన స్టెచ్‌లకు పూర్తి సమయం గైనకాలజిస్ట్ లేదా అనుబంధ అనస్థీటిస్ట్ అందుబాటులో లేరు. ఒక అనస్థీషిస్ట్ మొత్తం ఆరు పిహెచ్‌సిలు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు), ఒక సిహెచ్‌సి మరియు ఢోల్కాలోని అనేక ప్రైవేట్ ఆసుపత్రులు లేదా క్లినిక్‌లలో పనిచేస్తున్నారు. మరియు రోగులు అతని కోసం విడిగా చెల్లించాల్సి ఉంటుంది.

ఖాన్‌పర్ గ్రామంలోని ఆ గదిలో, మహిళలకు వారి స్వంత శరీరాలపై నియంత్రణ లేకపోవడంపై కోపంతో కూడిన ఒక స్వరం సంభాషణలోకి ప్రవేశించింది. ఒక సంవత్సరం వయసున్న చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని, ఒక యువ తల్లి కొంత అస్పష్టతతో ఇలా  అడిగింది: “ఎవరు నిర్ణయించుకుంటారు అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి? నేను నిర్ణయిస్తాను. ఇది నా శరీరం; మరొకరు ఎందుకు నిర్ణయించుకోవాలి? నాకు మరో బిడ్డ అక్కరలేదని నాకు తెలుసు. నేను మాత్రలు తీసుకోవాలనుకోవడం లేదు. ఒకవేళ నేను గర్భం ధరించినా, ప్రభుత్వం మాకోసం అందుకు కూడా మందులు ఇస్తుంది, కదా? నేను మందులు తీసుకుంటాను [ఇంజెక్షన్ గర్భనిరోధకాలు].  కానీ నేను మాత్రమే నిర్ణయిస్తాను. "

అయితే ఇది అరుదైన స్వరం. ఇప్పటికీ, సంభాషణ ప్రారంభంలో రమీలా భర్వాద్ చెప్పినట్లుగా: "ఇప్పుడు విషయాలు కొద్దిగామారొచ్చు." కానీ కొద్దిగా మాత్రమే.

కథలోని మహిళల పేర్లు వారి గోప్యతను కాపాడుకోవడానికి మార్చబడ్డాయి.

సహాయం అందించిన సంవేదన ట్రస్ట్‌కు చెందిన జానకి వసంత్‌కి ప్రత్యేక ధన్యవాదాలు.

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected] కు మెయిల్ చేసి [email protected] కు కాపీ పెట్టండి.

అనువాదం : కృష్ణ ప్రియ చోరగుడి

Pratishtha Pandya

ପ୍ରତିଷ୍ଠା ପାଣ୍ଡ୍ୟା ପରୀରେ କାର୍ଯ୍ୟରତ ଜଣେ ବରିଷ୍ଠ ସମ୍ପାଦିକା ଯେଉଁଠି ସେ ପରୀର ସୃଜନଶୀଳ ଲେଖା ବିଭାଗର ନେତୃତ୍ୱ ନେଇଥାନ୍ତି। ସେ ମଧ୍ୟ ପରୀ ଭାଷା ଦଳର ଜଣେ ସଦସ୍ୟ ଏବଂ ଗୁଜରାଟୀ ଭାଷାରେ କାହାଣୀ ଅନୁବାଦ କରିଥାନ୍ତି ଓ ଲେଖିଥାନ୍ତି। ସେ ଜଣେ କବି ଏବଂ ଗୁଜରାଟୀ ଓ ଇଂରାଜୀ ଭାଷାରେ ତାଙ୍କର କବିତା ପ୍ରକାଶ ପାଇଛି।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Pratishtha Pandya
Illustrations : Antara Raman

ଅନ୍ତରା ରମଣ ଜଣେ ଚିତ୍ରକର ଏବଂ ସାମାଜିକ ପ୍ରକ୍ରିୟା ଓ ପୌରାଣିକ ଚିତ୍ର ପ୍ରତି ଆଗ୍ରହ ରହିଥିବା ଜଣେ ୱେବସାଇଟ୍ ଡିଜାଇନର୍। ବେଙ୍ଗାଲୁରୁର ସୃଷ୍ଟି ଇନଷ୍ଟିଚ୍ୟୁଟ୍ ଅଫ୍ ଆର୍ଟ, ଡିଜାଇନ୍ ଏବଂ ଟେକ୍ନୋଲୋଜିର ସ୍ନାତକ ଭାବେ ସେ ବିଶ୍ୱାସ କରନ୍ତି ଯେ କାହାଣୀ ବର୍ଣ୍ଣନା ଏବଂ ଚିତ୍ରକଳା ସହଜୀବୀ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Antara Raman
Editor : P. Sainath

ପି. ସାଇନାଥ, ପିପୁଲ୍ସ ଆର୍କାଇଭ୍ ଅଫ୍ ରୁରାଲ ଇଣ୍ଡିଆର ପ୍ରତିଷ୍ଠାତା ସମ୍ପାଦକ । ସେ ବହୁ ଦଶନ୍ଧି ଧରି ଗ୍ରାମୀଣ ରିପୋର୍ଟର ଭାବେ କାର୍ଯ୍ୟ କରିଛନ୍ତି ଏବଂ ସେ ‘ଏଭ୍ରିବଡି ଲଭସ୍ ଏ ଗୁଡ୍ ଡ୍ରଟ୍’ ଏବଂ ‘ଦ ଲାଷ୍ଟ ହିରୋଜ୍: ଫୁଟ୍ ସୋଲଜର୍ସ ଅଫ୍ ଇଣ୍ଡିଆନ୍ ଫ୍ରିଡମ୍’ ପୁସ୍ତକର ଲେଖକ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ପି.ସାଇନାଥ
Series Editor : Sharmila Joshi

ଶର୍ମିଳା ଯୋଶୀ ପିପୁଲ୍ସ ଆର୍କାଇଭ୍‌ ଅଫ୍‌ ରୁରାଲ ଇଣ୍ଡିଆର ପୂର୍ବତନ କାର୍ଯ୍ୟନିର୍ବାହୀ ସମ୍ପାଦିକା ଏବଂ ଜଣେ ଲେଖିକା ଓ ସାମୟିକ ଶିକ୍ଷୟିତ୍ରୀ

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ଶର୍ମିଲା ଯୋଶୀ
Translator : Krishna Priya Choragudi

Krishna Priya Choragudi is a PhD student in Economics at IIT Delhi. She works in the fields of development economics and social policy.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Krishna Priya Choragudi