రాధ ధైర్యానికి ఆమె పెంచుకున్న కుక్కలు మూల్యం చెల్లించవలసి వచ్చింది. మొదటి కుక్క తలను నరికేశారు, రెండో కుక్కకు విషం ఇచ్చారు, మూడో కుక్క అసలు కనిపించడం లేదు, నాలుగోదాన్ని రాధ కళ్ళ ముందే చంపేశారు. “ఈ గ్రామంలోని నన్ను హింసించిన  నలుగురు పెద్దమనుషులు జైలులో ఉన్నారు.  అందుకని ఊరిలో కొందరు నేను ఆ రేప్ కేసులో రాజీపడలేదని మండిపడుతున్నారు.”

ఆరేళ్ళ క్రితం నలుగురు మగవాళ్లు రాధ(అసలు పేరు కాదు)ను లైంగికంగా హింసించారు. ఆమె తన గ్రామం నుండి 100 కిలోమీటర్ల  దూరంలో ఉన్న బీడ్  జిల్లాలో ఉన్న బీడ్ నగరానికి వెళ్తుండగా ఒక ప్రైవేట్ వాహనంలోని డ్రైవర్ ఆమెకు లిఫ్ట్ ఇస్తానని ఎక్కించుకుని, అతని ఊరికి చెందిన మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెను లైంగికంగా హింసించారు(రేప్ చేశారు).

“వారాల తరబడి నా మనసు చెదిరిపోయింది.” తను పడిన క్షోభని గురించి చెబూతూ అన్నది 40 ఏళ్ళ రాధ . “వారికి  చట్టప్రకారం శిక్ష పడాలని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను.”

ఆమె పై లైంగిక దాడి జరిగినప్పుడు, రాధ బీడ్  నగరంలో తన భర్త, పిల్లలతో కలిసి ఉండేది. “నా భర్త అక్కడ ఒక ఫైనాన్స్ ఏజెన్సీ లో పని చేసేవాడు. నేను మా ఊరికి అప్పుడప్పుడు వెళ్లి పొలాన్ని చూసుకుని వచ్చేసేదాన్ని.” అని చెప్పింది.

కంప్లైంట్ నమోదు చేసాక రాధ పై కేసు వెనక్కు తీసుకోమని చాలా ఒత్తిడి వచ్చింది . నేరం చేసినవారికి, వారి బంధువులు అందరికీ గ్రామ పంచాయత్ సభ్యులు, గ్రామంలోని పెద్దమనుషులు బాగా తెలుసు. “నా పై ఒత్తిడి పెరిగింది. కానీ నేను గ్రామంలో లేను, నగరంలో నాకు చాలామంది మద్దతునిచ్చారు. ఇక్కడ  భద్రంగా, ధైర్యంగా అనిపించింది.” అన్నది రాధ.

కాని ఆమె కప్పుకున్న ధైర్యం మార్చ్ 2020లో  అకస్మాత్తుగా కోవిడ్-19 వ్యాపించడంతో జారిపోయింది. ఆమె  భర్త మనోజ్(నిజం పేరు కాదు) దేశవ్యాప్తంగా  ప్రకటించిన లాక్ డౌన్ వలన ఉద్యోగం కోల్పోయాడు. “అతనికి నెలకు 10,000 రూపాయిలు వచ్చేవి. మేము ఒక అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. మా జరుగుబాటుకి చాలా ఇబ్బంది అయింది.”

మరే  మార్గం దొరకక, రాధా, మనోజ్, వారి  పిల్లలు అయిష్టంగా వారి  గ్రామానికి  వెళ్లారు. ఇక్కడే అంతకు ముందు రాధ పై  లైంగిక  దాడి జరిగింది. “మాకు ఇక్కడ మూడు ఎకరాల భూమి ఉంది, అందుకనే మేము ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం. మాకిక  ఏం చెయ్యాలో  కూడా తోచలేదు,” అన్నది ఆమె. ఆమె కుటుంబం ఇప్పుడు వారి పొలంలో గుడిసె వేసుకుని బతుకుతున్నారు. రాధ అక్కడ పత్తి, గోధుమలు పండిస్తున్నది.

ఆమె తన గ్రామానికి తిరిగి రాగానే, ఆమె పై దాడి చేసిన వారి  కుటుంబాలు రాధ పైన గురిపెట్టాయి. “కేసు ఇంకా సాగుతూనే ఉంది. దానిని  వెనక్కు తీసుకోమని ఒత్తిడి  బాగా పెరిగింది”, అన్నది రాధ. కానీ వెనక్కి తీసుకోనని ఆమె  చెప్పినందుకు, ఆమెను బెదిరించసాగారు. “నేను గ్రామంలో వారి ముందే ఉన్నాను. నన్ను బెదిరించి వేధించడం వారికి తేలికైపోయింది.” కానీ  రాధ లొంగలేదు

రాధా తన గ్రామం నుండి నగరానికి వెళ్తుండగా ఆమెని అపహరించి ఆమె పై లైంగిక దాడి చేశారు

2020 మధ్యలో ఆమె ఊరి గ్రామ పంచాయత్, ఆ పక్కనే ఉన్న రెండు గ్రామాలు, రాధను, ఆమె కుటుంబాన్ని వెలివేశాయి. రాధ “శీలం లేనిది..” అని, వారి ఊరి పరువును తీసివేసిందని చెప్పారు. ఆమెను ఆ మూడు గ్రామాలలోకి రావడానికి “నిషేధించారు”. “నేను ఒక బకెట్ నీళ్లు పట్టుకుందామని ఇంటి బయటకు వెళ్లినా, ఎవరొకరు ఏదోక నొప్పి కలిగించే మాటను అనేవారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు మనుషులను జైలుకు పంపాలనుకున్నావు, మళ్లీ మా మధ్య బతికే సాహసం కూడా చేస్తున్నావు, అని,” చెప్పింది రాధ.

ఆమెకి చాలాసార్లు దుఖ్ఖం ఆపుకుంది. “ మాలా స్వతహల సంభాలనా మహత్వచ్చాహోతా (నన్ను నేను సంభాళించుకోవడం ముఖ్యమనుకున్నా)” అన్నదామె మరాఠిలో. “కేసు తీర్పుకు దగ్గరగా ఉంది.” అని చెప్పింది.

బీడ్ లో ఉన్న మహిళా హక్కుల కార్యకర్త మనీషా టోక్లే, రాధ కోర్ట్ కేసు జరుగుతున్నప్పుడు, రాధ  గురించి సమాచారం తెలుసుకుంటూ, రాధతో మాట్లాడుతూ ఉంది. “మా లాయర్, తీర్పు మాకు అనుకూలంగా వస్తుందనే చెబుతున్నారు,” అన్నారు టోక్లే. “కానీ రాధ గట్టిగా నిలబడాలి. ఆమె ధైర్యంగా ఉండాలని, పరిస్థితిని చూసి కంగారు పడకూడని చెబుతుంటాను.” ఈమె, మనోధైర్య స్కీం నుండి రాధకు 2.5 లక్షలు రూపాయిలు అందేట్లు కూడా రూఢి పరుచుకుంది. ఈ స్కీం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం రేప్ కి గురైన భాదితులకు ఆర్ధిక సహాయం అందిస్తారు.

సుదీర్ఘంగా సాగిన ఈ న్యాయప్రక్రియ మనోజ్‌ని కొన్నిసమయాల్లో అశాంతికి  గురి చేసింది. "అతను కొన్నిసార్లు నిరుత్సాహపడేవాడు. నేను అతనికి ఓపికగా ఉండమని చెప్పాను,” రాధ పోరాటంలో అతను ఎంత ధైర్యంగా మద్దతు ఇచ్చాడో చూసిన టోక్లే చెప్పారు.

ఆ కేసు ఈ మహారోగం వలన నెమ్మదిగా సాగింది. కోర్ట్ కూడా ఆన్లైన్ లో పనిచేసింది. “ఇప్పటికే నాలుగేళ్లు అయిపోయింది(ఆ సమయానికి). లాక్ డౌన్ తరవాత విచారణని పలుమార్లు వాయిదా వేశారు. మేము వదిలేయలేదు. కానీ మా కు న్యాయం జరుగుతున్న ఆశ తగ్గిపోసాగింది.” అన్నది రాధ.

ఆమె సహనం, పట్టుదల ఊరికే పోలేదు. పోయిన ఏడాది అక్టోబర్లో, నేరం జరిగిన ఆరేళ్లకు, బీడ్ కోర్ట్ ముద్దాయిలను నేరం చేశారని నిర్ధారిస్తూ తీర్పునిచ్చి, నేరస్తులకు జీవిత కాల  ఖైదుని విధించింది. “మేము రాధకు ఈ  తీర్పుని చేరవేయగానే, ఆమె ఒక్క నిముషం మాట్లాడకుండా ఉండిపోయింది. ఆ తర్వాత ఒక్క పెట్టున ఏడ్చింది. ఆమె దీర్ఘ పోరాటం చివరికి ఒక తీరానికి చేరింది”, అన్నారు టోక్లే.

కానీ ఆ వేధింపులు అక్కడితో ఆగలేదు.

రెండు నెలల తరవాత, రాధకు ఎవరి భూమినో తాను కబ్జా చేసినట్లు నోటీసు జారీ అయింది. గ్రామ సేవక్ సంతకం చేసిన ఆ దస్తావేజు ప్రకారం గ్రామంలో మరో నలుగురుకి చెందిన భూమిని రాధ సాగుచేస్తూ అక్కడే నివసిస్తుంది. “ఆ మనుషులు నా భూమి మీద కన్నేశారు”, అన్నది రాధ. “ఇక్కడున్న అందరికి ఏం జరుగుతుందో అర్థమవుతుంది, కానీ ఎవరికీ ముందుకొచ్చి నాకు మద్దతుగా నిలబడే ధైర్యం లేదు. ఈ మహారోగంలో ఒక ఆడమనిషి జీవితాన్ని మనుషులు ఎంత ఘోరంగా మార్చగలరో తెలుసుకున్నాను.” అన్నది రాధ.

కంప్లైంట్ నమోదు చేసాక రాధను కేసు వెనక్కు తీసుకోమని చాలా ఒత్తిడి వచ్చింది . నేరం చేసినవారికి, వారి బంధువులు అందరికీ గ్రామ పంచాయత్ సభ్యులు, గ్రామంలోని పెద్దమనుషులు బాగా తెలుసు

రాధా కుటుంబం నివసించే రేకుల ఇంట్లో, వర్షం పడినప్పుడు ఇల్లు కారుతుంది, ఎండాకాలంలో వేడెక్కిపోతుంది. “గాలి బాగా వీచినప్పుడు, పైకప్పు ఎగిరిపోతుందేమో నా పిల్లలు మంచం కింద దాక్కుంటారు,” అన్నదామె. “ఇది నా పరిస్థితి. అయినా వాళ్లు నన్ను నా మానాన నన్ను వదిలేయరు. వాళ్లు నాకు వచ్చే నీళ్లను కూడా రాకుండా ఆపివేసి, ఇక్కడ నుండి వెళ్లిపొమ్మని బెదిరించారు. కానీ నా దగ్గర అన్ని దస్తావేజులు ఉన్నాయి. నేనిక్కడ నుండి  పోయేది లేదు.”

రాధ తన భూమిని లాక్కోవడానికి చేసిన ప్రయత్నాల గురించి జిల్లా మెజిస్ట్రేట్ కి రాసింది. తను ప్రమాదంలో ఉన్నదని, రక్షణ కావాలని ఆమె చెప్పింది. తరవాత గ్రామసేవక్ , అదే మేజిస్ట్రేట్ కి తన సంతకాన్ని ఎవరో నకిలీ చేసి ఆ నోటీసు పంపారని రాశాడు. ఆ భూమి రాధకు చెందినదే అని చెప్పాడు.

రాధ పరిస్థితిని అర్ధం చేసుకుని, 2021 లో నీలం గోడే, మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ కి డిప్యూటీ చైర్మన్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి అయిన హాసన్ ముష్రిఫ్ కి కి లేఖ రాశారు. ఆమె రాధకు, రాధ కుటుంబానికి  రక్షణ కావాలని, మూడు ఊర్లలోనూ ఆమే పై విధించిన చట్టవ్యతిరేకమైన సామాజిక వెలివేత గురించి విచారించమని రాశారు.

ఇప్పుడు, ఒక పోలీస్ కానిస్టేబుల్ ని రాధ ఇంటి వద్ద నిత్యం ఉండాలి. “నేను పూర్తిగా భద్రంగా ఉన్నానని ఇప్పటికీ అనిపించడం లేదు. ఆ పోలీసతను కొన్నిసార్లు ఉంటాడు, కొన్నిసార్లు ఉండడు. నాకు రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టదు. లాక్ డౌన్ కు ముందు(మార్చ్ 2020)లో నేను హాయిగా నిద్రపోయేదాన్న, ఎందుకంటే నేను మా గ్రామం నుండి దూరంగా ఉన్నాను. ఇప్పుడు మాత్రం ఎప్పుడు నిద్రపోయినా, కొద్దిగా మేలుకునే ఉంటాను, ముఖ్యంగా నేను, పిల్లలు మాత్రమే ఉన్నప్పుడు.” అన్నది రాధ.

మనోజ్ కూడా తన కుటుంబం నుండి దూరంగా ఉన్నప్పుడు సరిగ్గా నిద్ర పోలేకపోయేవాడు. “వారు భద్రంగా ఉన్నారో లేదో అని ఆందోళనగా ఉంటుంది,” అన్నాడు. నగరంలో ఉద్యోగం కోల్పోయాక, కొన్నిరోజుల పాటు దినవేతనాలపై పనిచేసి, గత ఏడాది సెప్టెంబర్ లో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. అతను పని చేసే ప్రదేశం వారి గ్రామానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడ అతను ఒక చిన్న గది అద్దెకు తీసుకున్నాడు. “అతను మహారోగానికి ముందు సంపాదించినదానికన్నా ఇప్పుడు వచ్చేది చాలా తక్కువ. వారంలో 3-4 రోజులు మాతో ఉంటాడు.” అన్నది  రాధ.

రాధకు 8,12, 15 ఏళ్ల వయస్సున్న తన ముగ్గురు కూతుర్ల గురించి ఆందోళన ఉంది. ఒకసారి బడి  తెరిచాక, బడిలో వారితో ఎలా  ప్రవర్తిస్తారో తెలీదు. ‘వారిని బెదిరిస్తారో లేక వేధిస్తారో నాకు తెలీదు.” అని చెప్పింది.

ఆమె కుక్కలు ఆమె ఆందోళనను తగ్గించేవి. “అవి నాకు కాస్త భద్రతను కూడా ఇచ్చేవి. ఎవరైనా గుడిసె దగ్గరికి వస్తే ఆవి  మొరిగేవి.” అన్నది రాధ. కానీ ఈ మనుషులు ఒకదాని తరవాత మరొకటిని చంపుతున్నారు. నా నాలుగో కుక్కను ఈ మధ్యే చంపేశారు.”

ఐదవ కుక్కని పెంచుకునే ప్రశ్న లేదు. “ఊరిలో ఉన్న కుక్కలనన్నా భద్రంగా ఉండనీ,” అన్నది రాధ.

ఈ కథనం, పులిట్జర్ సెంటర్ వారి స్వాతంత్య్ర పాత్రికేయ గ్రాంట్ మద్దతు ద్వారా పాత్రికేయుడు రాసిన వరుస కథనాలలోనిది.

అనువాదం: అపర్ణ తోట

Text : Parth M.N.

ପାର୍ଥ ଏମ୍.ଏନ୍. ୨୦୧୭ର ଜଣେ PARI ଫେଲୋ ଏବଂ ବିଭିନ୍ନ ୱେବ୍ସାଇଟ୍ପାଇଁ ଖବର ଦେଉଥିବା ଜଣେ ସ୍ୱାଧୀନ ସାମ୍ବାଦିକ। ସେ କ୍ରିକେଟ୍ ଏବଂ ଭ୍ରମଣକୁ ଭଲ ପାଆନ୍ତି ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Parth M.N.
Illustrations : Labani Jangi

ଲାବଣୀ ଜାଙ୍ଗୀ ୨୦୨୦ର ଜଣେ ପରୀ ଫେଲୋ ଏବଂ ପଶ୍ଚିମବଙ୍ଗ ନଦିଆରେ ରହୁଥିବା ଜଣେ ସ୍ୱ-ପ୍ରଶିକ୍ଷିତ ଚିତ୍ରକର। ସେ କୋଲକାତାସ୍ଥିତ ସେଣ୍ଟର ଫର ଷ୍ଟଡିଜ୍‌ ଇନ୍‌ ସୋସିଆଲ ସାଇନ୍ସେସ୍‌ରେ ଶ୍ରମିକ ପ୍ରବାସ ଉପରେ ପିଏଚଡି କରୁଛନ୍ତି।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Labani Jangi
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Aparna Thota